నేనేం తప్పు మాట్లాడాను?

నేనేం తప్పు మాట్లాడాను? - Sakshi


సీఎం చంద్రబాబుపై ఎంపీ శివప్రసాద్‌ ఆగ్రహం



సాక్షి ప్రతినిధి, తిరుపతి:  ‘చిత్తూరు వేదికపై నేనేం తప్పు మాట్లాడలేదే.. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాను. అధికార పార్టీలో ఉండీ కూడా ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడాల్సి వస్తోందని ఎప్పటి నుంచో కడుపులో బాధ. నాలుగు నెలల కిందటే శ్రేయోభిలాషులకు చెప్పాను. అంబేడ్కర్‌  జయంతి సభలో నా జనాన్ని చూసే సరికి ఆపుకోలేక పోయాను. మనసులో భాధ బయటకొచ్చింది. ఇందులో తప్పేముంద’ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.



గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్‌ చిత్తూరులో ధ్వజమెత్తడం విదితమే. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. నిజంగానే చంద్రబాబు దళితులకు ఏం చేశారనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే మొదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం చంద్రబాబు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎంపీ శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఆవేదనకు గురైన ఎంపీ శివప్రసాద్‌ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో, ముఖ్యమంత్రి వద్ద తనకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు.



ఎంపీలందరూ బాధపడుతున్నారు..

‘సీఎంతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా టైమివ్వడం లేదు. రాష్ట్రంలో కాకుండా ఢిల్లీకి వచ్చినపుడూ ఒక్క నిమిషం సమయం కేటాయించడం లేదు. ఎంపీలం దరూ బాధ పడుతు న్నారు. ఈ మధ్య విజయవాడలో జరిగిన పార్టీ వర్క్‌ షాప్‌నకు వెళ్లినపుడు కాలు జారి కింద పడ్డాను. అప్పుడు సీఎం నన్ను చూశారు కూడా. మరుసటి రోజు సీఎంను కలిసేందుకు ఇంటికెళ్లాను. మూడు గంటలు వెయిట్‌ చేయించారు. నేను కింద పడితే ఎలా ఉన్నావంటూ అడగడానికి కూడా ఆయనకు (సీఎంకు) టైం లేకపోతే మాకిచ్చే గౌరవం ఏమిటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్తాననీ చెప్పలేదే. ఎవరో ఏదో చెబితే మీరు నమ్ముతారా? మీరే చెట్టును పెంచి మీరే కూల్చేయాలనుకోవడం న్యాయం కాదు.  టెలీకాన్ఫరెన్సు ద్వారా నన్ను తిట్టాల్సిన పని లేదు. బురదలోకి లాగడానికి ప్రయత్నిస్తే నేనూ సిద్ధమే’ అని  శివప్రసాద్‌ ఘాటుగా సమాధానమిచ్చారు.

(శివప్రసాద్‌పై చర్యలు తప్పవు: చంద్రబాబు ఆగ్రహం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top