బాబూ.. కేసీఆర్తో పోటీ వద్దు: జేసీ | Sakshi
Sakshi News home page

బాబూ.. కేసీఆర్తో పోటీ వద్దు: జేసీ

Published Tue, Mar 24 2015 3:12 PM

బాబూ.. కేసీఆర్తో పోటీ వద్దు: జేసీ - Sakshi

రైతు రుణమాఫీ, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ లాంటి హామీలను నెరవేర్చడం ఏపీ ప్రభుత్వానికి సులువేమీ కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలా ఇచ్చారు గానీ, ఆ రాష్ట్రంతో పోటీపడి రైతు రుణమాఫీ, ఉద్యోగుల వేతనాలు లాంటి అంశాల్లో మాట నిలబెట్టుకోలేరని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్తో పోటీపడి హామీలు ఇవ్వొద్దని చాలా అంశాల విషయంలో తాను చంద్రబాబుకు ఇప్పటికే నిర్మొహమాటంగా చాలా సలహాలు, సూచనలు ఇచ్చానన్నారు. మంగళవారం ఇరు రాష్ట్రాల అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత మిత్రులు జానారెడ్డి తదితరులను కలుసుకున్న జేసీ కొద్దిసేపు హల్ చల్ చేసి, తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవచ్చు గానీ, కొంతమేర నిధులు రావొచ్చని జేసీ చెప్పారు. అధికారం కోసం ప్రస్తుత రాజకీయనేతలు ఏమైనా చేస్తారని, తాను కూడా అందుకు మినహాయింపు కాదని, అధికారం కోసమే కాంగ్రెస్ ను వీడి టీడీపీలోకి వచ్చి ఎంపీ అయ్యానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ పనితీరు బాగుందని పేర్కొన్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం  గ్రామాల్లో సరేగానీ  అసెంబ్లీలో మాత్రం బాగోదన్నారు. సభ్యులు ఇలా దిగజారి మాట్లాడతారని తాను ఊహించలేదని జేసీ అన్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా లేనందుకు తాను సంతోషిస్తున్నానన్నారు.

Advertisement
Advertisement