కొలువు పారిశుధ్యం....టార్గెట్ ఖాకీ ఉద్యోగం | Sakshi
Sakshi News home page

కొలువు పారిశుధ్యం....టార్గెట్ ఖాకీ ఉద్యోగం

Published Wed, Aug 20 2014 3:15 AM

కొలువు పారిశుధ్యం....టార్గెట్ ఖాకీ ఉద్యోగం - Sakshi

అందరిలాగే.. ఆమె కూడా తన బంగారు భవిత గురించి అందమైన కలలు కంది. ఉన్నత చదువులు చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. కానీ, వాటిని సాకారం చేసుకోలేకపోరుుంది. పేదింటి తల్లిదండ్రులు ఆడకూతుర్ని పెళ్లిచేసి పంపటానికే ప్రాధాన్యతనిచ్చారు. అత్తింటి వారు మాత్రం ఆమె ఆసక్తిని అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్నారు. చదువుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడామె పగలంతా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూనే.. రాత్రంతా చదువుకు కేటారుుస్తూ.. పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా పరుగులు తీస్తోంది.
 
మర్రిపాలెం ఎస్టీ (యూనాదులు) కాలనీకి చెందిన ఇళ్ల ఈశ్వరీపాప నాగాయలంక గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య  కార్మికురాలిగా పనిచేస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే.. పెళ్లి సంబంధం రావడంతో చదువుకు బ్రేక్ పడింది. తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లక్ష్మీపురం నుంచి మర్రిపాలెం ఎస్టీ కాలనీలోని అత్తారింటికి చేరింది. అప్పటికే నాగాయలంక పంచాయతీలో పారిశుధ్య పనిచేస్తున్న ఆమె అత్త నాగేంద్రమ్మ గిరిజన నాయకురాలిగా ఉన్నారు.

కోడలికి చదువుపై ఉన్న మమకారాన్ని గమనించిన ఆమె గ్రామ కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతో అవనిగడ్డ నవజీవన్ సంస్థ నిర్వహిస్తున్న ఓపెన్ స్కూలులో ఈశ్వరీపాపను చేర్పించింది.  పగలంతా పారిశుధ్య పని, రాత్రంతా చదువుపై దృష్టిపెట్టిన ఈశ్వరి పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఆమె ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది.

ప్రతి ఆదివారం పారిశుధ్య పనికి సెలవు పెట్టి తరగతులకు హాజరవుతోంది. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్య పనిచేస్తోంది.  ‘చదువు పూర్తిచేసి పోలీస్ కానీ, హోంగార్డు కానీ అవుతా. మా గిరిజనుల్లో చదువుపై ఆసక్తి కలిగిస్తా. భర్త శ్రీను, అత్త నాగేంద్రమ్మ, కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతోనే నేను చదువుకుంటున్నా.’ అని ఈశ్వరీపాప చెప్పింది.  

 - నాగాయలంక
 

Advertisement
Advertisement