విద్యార్థుల ఉసురు తీసిన సరదా | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఉసురు తీసిన సరదా

Published Sun, Mar 1 2015 8:13 AM

fun that killed the students

తెనాలి: మరో పది రోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రీ పబ్లిక్ పరీక్షలు ముగిశాయన్న అనందంలో సరదాగా నదీ తీరానికి వెళ్లి విగతజీవులుగా మారారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బోస్ రోడ్డులో ఉన్న నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శనివారం ఉదయం ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిశాయి. తిరిగి మధ్యాహ్నం కళాశాలకు రావాల్సి ఉన్నా, తొమ్మిది మంది విద్యార్థులు కొల్లూరు మండలం చిలుమూరులంక కృష్ణానదీ తీరానికి వెళ్లారు.
 
 అనుకోకుండా లోతుకు వెళ్లిన వారిలో ఐదుగురు నీట మునిగిపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో స్థానిక ముత్తంశెట్టిపాలేనికి చెందిన టి.బాలశివగణేష్(17), బిట్రా రూపేష్(17), చినరావూరు అక్కలవారి వీధికి చెందిన కొమ్ము మహేష్(17), గంగానమ్మపేట భవనంవారి వీధికి చెందిన వి.ఈశ్వర్ రఘువంశీ(17), రూరల్ మండలం పెదరావూరుకు చెందిన కుర్రా సాయివంశీ(17) ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement