మాజీ ఎంపీపీ ఆరిమిల్లి వెంకటరత్నం మృతి | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ ఆరిమిల్లి వెంకటరత్నం మృతి

Published Sun, Apr 26 2015 2:59 AM

former MOPP Arrimalli Venkata Ratnam died

 తణుకు : తణుకు మండలం వేల్పూరుకు చెందిన మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ ఆరిమిల్లి వెంకటరత్నం (94) శనివారం ఉదయం మృతి చెందారు. వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటరత్నం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వెంకటరత్నం మనుమడు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రస్తుతం తణుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మనుమరాలు పెనుమర్తి వెంకట లక్ష్మి ప్రస్తుతం వేల్పూరు సర్పంచి కాగా మరో మనుమరాలు పెనుమర్తి మంగతాయారు మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. నాలుగో కుమారుడు సూర్యచంద్రరావును పెనుమర్తి వంశీ యులకు దత్తత ఇవ్వగా ఆయన గతం లో వేల్పూరు సర్పంచిగా పనిచేశారు.  
 
 తెలుగుదనం నిండిన పెద్దాయన
 వేల్పూరుకు పెద్ద దిక్కుగా ఆదరాభిమానాలు సంపాదించుకున్న వెంకటరత్నంను గ్రామస్తులు తాతయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. తెలుగుదనం మూర్తీభవించిన ఆయనలో పెద్దరికమూ తొణికిసలాడేది. పాలకొల్లు సమీపంలోని యలమంచిలిలంకకు చెందిన వెంకటరత్నం 1940లో వేల్పూరు వచ్చి స్థిరపడ్డారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఆయన తాను భూరి విరాళాలు ఇచ్చి ప్రజల్నీ భాగస్వాముల్ని చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి 1.26 ఎకరాలు, పాఠశాల నిర్మాణానికి 42 సెంట్లు స్థలాన్ని అందజేసిన వెంకటరత్నం గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో సహకారం అందించారు. గ్రామస్తుల సహకారం ఉంటే ఏదీ కష్టసాధ్యం కాదని నిరూపించారు. ఆయన ఇటీవలి కాలం వరకు సైకిల్‌పైనే పొలానికి వెళ్తుండేవారు. రెండు పర్యాయాలు 15 ఏళ్ల పాటు సర్పంచ్‌గా, ఒకసారి మండల పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు. వేల్పూరు సహకార సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
 
 మూగబోయిన వేల్పూరు
 వెంకటరత్నం మృతితో వేల్పూరు మూగబోయింది. పెద్దాయన ఇక లేరనే నిజాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతు న్నారు.  శనివారం సాయంత్రం సొంత పొలంలో వెంకటరత్నం అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటరత్నం పార్థీవదేహాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ప్రముఖ విద్యావేత్త గుబ్బల తమ్మయ్య, పలువురు సర్పంచ్‌లు, పురపాలక సంఘం కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Advertisement
Advertisement