పంట పొలాల్లో ‘రాజధాని’ మంటలు


* ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల రైతుల పొలాల్లో నిప్పుపెట్టిన దుండగులు

* గుంటూరు జిల్లాలో ఘాతుకం

* ఆ గ్రామాలన్నీ ‘ఏపీ రాజధాని’కి భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులవే

* బాధిత రైతులంతా తమ భూములు ఇవ్వబోమని స్పష్టంగా చెప్తున్న వారే

* అరటి తోటల్లో వెదురు బొంగులు, పొలాల్లో పాకలు, వస్తు సామగ్రికి నిప్పు

* అన్నదాతల్లో భయాందోళనలు.. ఘటనపై ఏపీ సీఎం చంద్ర బాబు ఆరా

* ఘటనల గురించి డీజీపీ ఆరా.. దుశ్చర్యలపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు

* సంఘటనా స్థలాలను పరిశీలించిన గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు

* గ్రామాల్లో పోలీసుల భారీ మోహరింపు.. అదుపులో అనుమానితులు?

* ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ సందర్శన

* రైతులే తగలబెట్టుకున్నారంటూ మంత్రి, టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు

* ఆగ్రహించిన బాధిత రైతులు.. మంత్రి పుల్లారావును అడ్డుకున్న వైనం

* రాజధానికి భూములు ఇవ్వబోమన్నందునే ఇలా చేయించారని ధ్వజం

* సంఘటనా స్థలాలను సందర్శించిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు

* ఘటనలపై దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

* గ్రామాల్లో బాధిత రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని ప్రకటన



సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను తగలబెట్టారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము మధ్య జరిగినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకేసారి ఇన్ని చోట్ల దుండగలు నిప్పు పెట్టడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు సైతం ధ్రువీకరిస్తున్నారు.



భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లోనే ఆగంతకులు పొలాల్లో సామగ్రి తగలబెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తవవుతున్నాయి. సంఘటన జరిగిన తీరుచూస్తే పక్కా ప్రణాళికతోనే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. రోడ్డు వెంబడి ఉన్నవే కాకుండా 1.5 కిలోమీటర్ల లోపల పొలాల మధ్యలోకి వెళ్లీ తగలబెట్టారు.



గంట గంట తేడాతో దహనకాండ...

ఆదివారం సాయంత్రం నాలుగు 30 గంటలకు లింగాయపాలెంలో వెదురుబొంగులకు నిప్పు పెట్టడంతో దహనకాండ మొదలైందని, గంట గంట తేడాతో ఈ దహనకాండ మందడం, వెంకటాయపాలెం, పెనుమాక, ఉండవల్లిల్లో వరస క్రమంలో సోమవారం తెల్లవారుజాము వరకు 13 చోట్ల సాగినట్లు తెలుస్తోంది. సపోర్ట్‌గా పెట్టే వెదురుబొంగులను తగులబెట్టడంతో అరటి పంట కొంతమేర దెబ్బతింది. పెనుమాకలో రైతుల షెడ్లను తగలబెట్టడంతో డ్రిప్‌తో పాటు ఎరువులు, పురుగు మందులు తగలబడ్డాయి.



ప్రధానంగా పెనుమాకలో భవనం శంకరరెడ్డి షెడ్డులో డ్రిప్‌తో పాటు రసాయన ఎరువులు, పొలపు సాంబిరెడ్డికి చెందిన షెడ్డు దానిలో ఎరువులు, కల్లం నరేంద్రరెడ్డికి సంబంధించిన క్వాలిటీ కూరగాయలు తదితరాలను తగలబెట్టారు. ఒక్కో రైతుకు దాదాపు మూడు లక్షల రూపాయల మేరకు నష్టం సంభవించింది. పెనుమాకలో రైతులంతా తాము భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండటం వల్లే తగలబెట్టారన్నారు. లింగాయపాలెం, మందడం రైతులు సంఘటన ఎలా జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.



రెండు జిల్లాల పోలీసుల దర్యాప్తు

ఈ దుశ్చర్యలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు.  ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. డీజీపీ జాస్తి వెంకట రాముడు విజయవాడలోనే ఉండటంతో సంఘటనపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆరా తీస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి స్పష్టమైన ఆదే శాలు ఇవ్వడంతో సోమవారం ఉదయం నుంచి గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పి.హెచ్.డి.రామకృష్ణ, రాజేష్‌కుమార్‌లు 10 ప్రత్యేక బృందాలతో సంఘటనా స్థలంలో ఉండి దర్యాప్తు చేస్తున్నారు.



విజయవాడ నుంచి సైతం అదనపు డీసీపీ జి.రామకోటేశ్వరరావు నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఇంటెలిజెన్స్ అధికారులు, డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం సాయంత్రం ఘటనా ప్రాంతాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. గుంటూరు అర్బన్ పరిధిలో ఆరు చోట్ల, రూరల్ పరిధిలో ఏడు చోట్ల గుర్తు తెలియని ఆగంతకులు.. అరటి చెట్లకు సపోర్టుగా పెట్టే కర్రలను, డ్రిప్ ఇరిగేషన్ పైపులను దహనం చేశారు. ఈ దుశ్చర్యల్లో ఎక్కువ మంది పాల్గొనలేదని, ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఒక టీమ్‌గా ఏర్పడి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.



అల్లర్లు సృష్టించటానికా..?

ఈ ఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి ఎవరైనా పథకం ప్రకారం చేశారా? లేదా ఆకతాయిల పనా? లేదా భూములను కొనుగోలు చేస్తున్న వారిని భయాందోళనకు గురి చేసి రియల్ ఎస్టేట్ బూమ్‌ను తగ్గించడానికి ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? తదితర కోణాలపై పోలీసులు దృష్టిసారించారు. సంఘటన జరిగిన గ్రామాల్లో ప్రతి ఏటా లక్ష వెదురు బొంగులను రైతులు కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది అలా కొనకుండా పాత వాటినే వినియోగిస్తున్నారు. దీంతో వ్యాపారలు ఎవరైనా ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



బాబు దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం...

సాక్షి, హైదరాబాద్: ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు, అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలను రాజధాని పరిధి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.



అవి కుట్రతో చేసిన పనులే: డీజీపీ

రైతుల పొలాల్లోని వస్తుసామగ్రి దహనం ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని డీజీపీ జె.వి.రాముడు అనుమానం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు 10-15 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతూ లింగాయపాలెం నుంచి ఈ చర్యలకు ఉపక్రమించినట్లు నిర్థారించామన్నారు. ఇవి వరుసగా జరిగాయని వెలుగులోకి వచ్చాకే బాధిత రైతులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. నిందితుల్ని గుర్తించడానికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.



పోలీసుల అదుపులో ఇద్దరు కీలక నిందితులు!

సాక్షి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో పొలాలకు నిప్పంటించిన ఘటనలో ఇద్దరు కీలక నిందితులు పోలీసులకు పట్టుబడ్డట్లు తెలిసింది. వారి నుంచి మూడు డీజిల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో వారు కీలక సమాచారాన్ని వెల్లడించినట్లు తెలిసింది. గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాత్రం దీన్ని ఖండించారు.



మంత్రిని ప్రశ్నించిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పొలాలకు నిప్పంటించిన ఘటనపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీసినందుకు కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేసినందుకు పెనుమాకలో ఆయన్ను రైతులు నిలదీశారు. రాజధానికి భూములివ్వబోమంటూ నినాదాలు చేశారు. పొలాలకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో రైతులను పోలీసులు బెదిరించారు. గొడవ చేస్తే రౌడీషీట్‌లు తెరుస్తామంటూ ఓ సీఐ రైతులను హెచ్చరించారు. రైతుల్లో పలువురిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య అంటూ పలువురు రైతులు మండిపడుతున్నారు.



నేడు రాజధాని ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ బృందం పర్యటన

రాజధాని గ్రామాల్లో జరిగిన దహనకాండను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజధాని రైతు పరిరక్షణ సమితి బృందం మంగళవారం ఆ గ్రామాల్లో పర్యటిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, తాడికొండ సమన్వయకర్త హెనీ క్రిస్టినా ఆ గ్రామాల్లో పర్యటించి, సంఘటనపై రైతుల నుంచి వివరాలు సేకరిస్తారని తెలిపారు.



మంత్రి చులకనగా మాట్లాడారు

నేను మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. ఉండవల్లి చినడొంకలో ఒక ఎక రంలో దొండపాదు వేశాను. పక్కనే వ్యవసాయ పనిముట్లు పెట్టుకునేందుకు ఒక పాక కూడా వేశాను. రాత్రి దుండగులు ఆ పాకకు నిప్పంటించారు. పాకలో పవర్‌స్పేర్, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, మందు క ట్టలు అన్నీ బూడిదపాలయ్యాయి. మూడు లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. హైకోర్టు జడ్జి లక్ష్మణరావును కలిసి.. మా పొలాలు రాజధానికి ఇవ్వబోమని చెప్పాను. దీని నిమిత్తం హైకోర్టులో ఫిటిషన్ దాఖాలు చేయమని అడిగాను. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని తగలబెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తగలబడిన పాకను పరిశీలించడానికి వ చ్చిన సమయంలో తెలుగుదేశం తమ్ముళ్లు ‘మీ పాకలు మీరే తగలబెట్టుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. రైతులంటే టీడీపీ ప్రభుత్వానికి ఎంత చులకనో ఈ వ్యాఖ్యల బట్టే అర్థమవుతుంది.     

- భవనం శంకరరెడ్డి, పెనుమాక



నేను ఏ మీటింగులకూ వెళ్లలేదు

నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. చేనుకు రావడం ఇంటికి వెళ్ళడం తప్ప ఏ మీటింగులకు వెళ్లలేదు. ఈ మధ్య కాలంలో రైతుల భూములు ప్రభుత్వం లాక్కొంటోంది అనడంతో ఇంటిల్లిపాదీ భయాందోళనకు గురయ్యాం. రాజధానికి వ్యతిరేకంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో సమావేశాలు ఏర్పాటుచేస్తే, అక్కడకు హాజరయ్యాను. మా భూములు మాత్రం మేము ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పాను. నా పక్కనే మరో పాక ఉండగా నా పాక తగలబెట్టడంలో అర్ధమేమిటో ప్రభుత్వమే చెప్పాలి.

- పల్లప్రోలు సాంబిరెడ్డి, ఉండవల్లి



ఎలా జరిగిందో

ఇది ఎటూ తేల్చలేని విషయం. సైకో చేశాడా? లేక రాజధాని విషయంలో జరిగిందా? తెల్చుకోలేక పోతున్నాం. ఏది ఏమైనప్పటికి అంతిమంగా రైతులమే సష్టపోతున్నాం. ఈ విధంగా తగలబెట్టడం దారుణం. నిందితులను పట్టుకుంటే నిజాలు వెల్లడవుతాయి. విద్వేషాలు రెచ్చకొట్టకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు కృషి చేయండి.

- పానకాలరెడ్డి, పెనుమాక, సర్పంచ్



తీవ్రంగా నష్టపోయా

నేను కౌలు రైతును. అప్పులు చేసి అరటి పంట పండిస్తున్నాను. రాజమండ్రి నుండి వెదురుబొంగులు ను తీసుకొచ్చుకున్నాను. రూ. 2.50 లక్షలకు పైగా బొంగులకే ఖర్చయింది. గుర్తు తెలియని అగంతకులు చేసిన ఈ దుర్ఘటనతో తీవ్రంగా నష్టపోయా.



నన్ను ఆదుకునేది ఎవరు? రాజధానికి  భూములు ఇవ్వం అన్న నెపంతో నిప్పు రాజేశారో.. లేక ఆగంతుల అల్ల రి చర్యో అర్ధం కావడం లేదు. మాకు ఎవరితో ఎటువంటి కక్ష లు, వివాదాలు లేవు. మమ్మల్ని ప్రభుత్వం అదుకోవాలి.

- జొన్నకూటి నాగేశ్వరావు, పెనుమాక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top