బ్యాంకర్లతో ప్రత్యక్ష పోరు | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లతో ప్రత్యక్ష పోరు

Published Sat, Aug 1 2015 12:31 AM

బ్యాంకర్లతో  ప్రత్యక్ష పోరు

కౌలురైతులకు మద్దతుగా చరిత్రలో తొలిసారిగా రెవెన్యూ యంత్రాంగం ఆందోళన బాటపట్టింది. రుణాల మంజూరులో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రత్యక్ష పోరుకు దిగింది. ఏజెన్సీ పరిధిలోని బ్యాంకుల ఎదుట సాక్షాత్తు తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూయంత్రాంగం రైతుల తరపున ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సంచలనం రేపుతోంది. బ్యాంకర్ల మెడలు వంచేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ ఆందోళనలు చేపట్టినట్టుగా క్షేత్ర స్థాయి సిబ్బంది చెప్పడం గమనార్హం..
 
విశాఖపట్నం: బ్యాంకర్ల శల్యసారథ్యం, కౌలు రైతులకు రుణాలివ్వడంలో శాఖల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. బ్యాంకర్లను ఒప్పించి కౌలురైతులకు రుణాలిప్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే. అలాంటి రెవెన్యూ యంత్రాంగమే చేష్టలుడిగి ప్రత్యక్ష ఆందోళనకు దిగడం కొత్త ఒరవడికి నాంది పలికింది. ఏటా కష్టం ఒకరిది..ఫలితం మరొకరిది అన్నట్టుగా రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించే కౌలురైతులకు అప్పులు మిగలడం పరిపాటి. వీరికి జారీ చేస్తున్న రుణఅర్హత కార్డులు(ఎల్‌ఈసీ)అలంకార ప్రాయంగా మిగిలి పోతున్నాయి. ఏటా వీరికి ఎల్‌ఈసీ కార్డులు జారీ చేయడం..రుణాల మంజూరులో బ్యాంకర్లు చుక్కలు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. కనీసం ఈ ఏడాదైనా ఉదారంగా వీరికి రుణాలివ్వాలన్న కలెక్టర్ యువరాజ్ ప్రయత్నాలకు బ్యాంకర్లు మోకాలొడ్డుతున్నారు. ఈ ఏడాది 40వేల మందికి ఎల్‌ఈసీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా,  కేవలం 16,500 మందికి జారీ చేయగలిగారు. వీరికైనా రుణాలు మంజూరు చేశారా అంటే అదీ లేదు.

సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 800 మందికి కేవలం రూ.1.5కోట్ల రుణాలు జారీ చేయగలిగారు. ఎల్‌ఈసీ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని ఎలాంటి హామీ లేకుండా రుణాలివ్వాలని కలెక్టర్ పదేపదే ఆదేశించినా బ్యాంకర్లు పెడచెవిన పెట్టారు. అడంగళ్, వన్‌బీ కాపీలు, భూమి యజమానితో చేసుకున్న ఒప్పంద పత్రాలు. వారి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు, ఆ భూమిపై గతంలో ఎలాంటి అప్పుల్లేవని తెలిపే ధ్రువీకరణ పత్రాలు ఇలా సవాలక్ష సమర్పిస్తే కానీ రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. ఇవన్నీ సమర్పించినా ఏదో విధంగా కొర్రీలు వేస్తూ మోకాలొడ్డుతూనే ఉన్నారు. ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.850 కోట్లు కాగా..ఇప్పటి వరకు రూ.250కోట్ల వరకు రుణాలిచ్చారు. ఈమొత్తంలో కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.1.5కోట్లు మాత్రమే. దీంతోబ్యాంకర్లపై ఒత్తిడి పెంచేందుకు జిల్లా కలెక్టర్ యువరాజ్ రంగంలోకి దిగారు. కౌలు రైతుల తరపున రెవెన్యూ యంత్రాంగం బ్యాంకుల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఏకంగా మండల తహశీల్దార్ల ఆధ్వర్యంలోనే ఈ ఆందోళనలు జరగడం గమనార్హం. ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో శుక్రవారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో బ్యాంకుల ఎదుట ధర్నాలు.. రాస్తారోకోలు జరిగాయి. కౌలురైతులతో పాటు మండల స్థాయిలోని ఆర్‌ఐలు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలతో సహా ఇతర రెవెన్యూ యంత్రాంగమంతా పాల్గొన్నారు. ఆంధ్రబ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో పాటు ఏజెన్సీ పరిధిలోని గ్రామీణ బ్యాంకులకు చెందిన బ్రాంచ్‌ల ఎదుట ఈ ఆందోళనలు జరిగాయి. ఎల్‌ఈసీ కార్డుల్లో సర్వే నంబర్, అదే నంబర్‌పై ఎలాంటి రుణ బకాయిలు లేకుండా ఉంటే చాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలి వ్వాలని జిల్లా బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ  బ్యాంకర్లు పెడచెవినపెట్టడం వల్లే తాము ఆందోళన బాటపట్టామని పాడేరు డిప్యూటీ తహశీల్దార్ సాక్షికి తెలిపారు.
 
 

Advertisement
Advertisement