కొత్త దర్శకుడి విషాదాంతం | Sakshi
Sakshi News home page

కొత్త దర్శకుడి విషాదాంతం

Published Sun, Apr 20 2014 9:08 AM

కొత్త దర్శకుడి విషాదాంతం - Sakshi

సింహాచలం: ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన కొత్త దర్శకుడు, నిర్మాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా సింహపురి కాలనీ నుంచి చాకిరేవుకొండకు వెళ్లే కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ ప్రాంతానికి చెందిన బండారు జగదీష్ (40) ‘బూచోడు’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ ఐదు రోజుల క్రితమే ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జగదీష్ నగరం నుంచి కారులో వచ్చి సింహపురి కాలనీ నుంచి చాకిరేవుకొండకు వెళ్లే మార్గంలో ఉన్న కొండ ప్రాంతంలో ఒక హెచ్‌టీ లైన్ విద్యుత్ టవర్‌కు ఉరి వేసుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. తాను ఈ ప్రాంతంలో ఉంటానని సినిమా యూనిట్ సభ్యుల్లో ఒకరికి సెల్‌ఫోన్‌లో మెసేజ్ పెట్టాడు. విషయం తెలుసుకున్న జగదీష్ అన్నయ్య ఈ ప్రాంతంలో వెతకగా సాయంత్రానికి గుర్తించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు జగదీష్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది యూనిట్ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నగరంలో ఒక హోటల్‌లో యూనిట్ సభ్యులున్నారని, మొత్తం రూ.4 లక్షల వరకు జగదీష్ చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు. మృతునికి భార్య, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  
 

Advertisement
Advertisement