రెవిన్యూ లీల.. ఎస్సీల గోల | Sakshi
Sakshi News home page

రెవిన్యూ లీల.. ఎస్సీల గోల

Published Sun, Apr 26 2015 3:35 AM

As the controversy over ten years

సాగుకు ఇరు వర్గాలకు భూ పట్టాలు!
ఓ వర్గానికి భూమి చూపక పోవడంతో పదేళ్లుగా వివాదం
కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల చెట్లను నరికిన ఓ వర్గం
గతంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల దృష్టికి సమస్య
తాజాగా చెట్ల నరికివేతపై ప్రస్తుత కలెక్టర్‌కూ ఫిర్యాదు
సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

 
సాక్షి ప్రతినిధి, కడప : వారంతా ఎస్సీలు. కష్టాన్ని నమ్ముకొని జీవించే బడుగు జీవులు. ప్రభుత్వ సహాయ సహకారాలు పొందేందుకు అక్షరాల అర్హులు. అయితే రెవిన్యూ అధికారుల తప్పిదం కారణంగా దశాబ్దకాలంగా వారి మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చే రాయి. తక్షణమే స్పందించి పరిష్కరించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో చెట్లు నరికివేత సంృ్కతి వేళ్లూనుకుంటోంది. సమస్య జిల్లా కలెక్టర్ల దృష్టికి వెళ్లినా పరిష్కారం దొరకని వైనమిది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు జెడ్‌హెచ్‌డిసీ కాలనీకి చెందిన ఎస్సీలకు చంద్రమౌళి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో పట్టాలు ఇచ్చారు.

ఒక్కొక్కరికి 2.85 ఎకరాల నుంచి 3.60 ఎకరాల చొప్పున అర్హులైన 107 మంది ఎస్సీలకు పట్టాలు అందించారు. 1993-94లో అప్పటి కలెక్టర్ కెవి రమణాచారి వారి భూముల్లో బోర్లు వేయించి నీటి సౌకర్యం కల్పించారు. అప్పటి వరకు మోడువారిన భూములు పచ్చదనం నింపుకున్నాయి. సజావుగా పంటలు సాగుచేసుకుంటున్న తరుణంలో 2005లో కమ్మపల్లెలో 25 మంది ఎస్సీలకు రెవిన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. అయితే భూమి హద్దులు చూపించలేదు. దీంతో అప్పటి నుంచి వారు జడ్‌హెచ్‌డీసీ భూములు తమవేనంటూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ముగ్గురు కలెక్టర్లు మారినా తెగని వివాదం

ఓబులవారిపల్లె ఎస్సీల మధ్య నెలకొన్న భూవివాదం అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న 827 ఎకరాల్లో సర్వే నిర్విహ ంచి, ఎవరెవరు ఏయే సర్వే నంబర్లలో భూములు కలిగి ఉన్నారనే వివరాలు అందజేయాలని అప్పటి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఆదేశించారు. సర్వే చేసేందుకు సమాయత్తమైన తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. అనంతరం కలెక్టర్‌గా వచ్చిన అనిల్‌కుమార్ రికార్డులు పరిశీలించి ఆ భూములపై చిన్నఓరంపాడు ఎస్సీలకే హక్కు ఉందని నిర్ధారించారు.

దీంతో తమ భూములు ఎక్కడ ఉన్నాయో చూపాలంటూ కమ్మపల్లె ఎస్సీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈలోగా ఎన్నికలు రావడం.. కలెక్టర్ అనిల్‌కుమార్ బదిలీ కావడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తర్వాత వచ్చిన కలెక్టర్ కోన శశిధర్ హయాం పూర్తి కాలం ఎన్నికలతో సరిపోయింది.

మళ్లీ తెరపైకి వచ్చిన వివాదం

కమ్మపల్లె ఎస్సీలు జడ్‌హెచ్‌డీసీ భూముల్లోకి వెళ్లి ఈ భూములు తమవే అంటూ ఎవరూ అడ్డువస్తారో రండి అంటూ ప్రత్యక్షదాడులకు సిద్ధమయ్యారు. ఆ భూముల్లోకి ప్రవేశించి సుమారు 75 నిమ్మచెట్లు నరికి వేశారు. ఈ ఘటనపై చిన్నఓరంపాడు ఎస్సీలు రాజంపేట ఆర్డీఓ, కలెక్టర్ కె.వి.రమణను కలిసి వారి సమస్యను విన్నవించారు. చెట్లు నరికిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అప్పట్లో రాజంపేట ఆర్డీఓ  జోక్యం చేసుకుని.. ఇకపై కమ్మపల్లె ఎస్సీలు ఈ భూముల జోలికి రారని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని చెప్పి రాజీ కుదిర్చారు.

అయితే ఈనెల 15న మరోమారు 630 (అరటి, మామిడి, సఫోట) చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న చెట్లు ఒక్క పూటలో తెగిపడ్డాయని బాధితులు తహశీల్దారు నుంచి కలెక్టర్ వరకు, ఎస్‌ఐ నుంచి ఎస్పీ వరకు విన్నవించుకున్నారు. పది రోజులైనా ఈ ఘటనపై విచారించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యను పూర్తిగా వినడం లేదని, బాధితులందరితో మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరే స్పందించకపోతే ఇక తమకు దిక్కెవరని కన్నీటిపర్యంతమవుతున్నారు.

Advertisement
Advertisement