Breaking News

క్యూ లేదు.. డిపో లేదు.. ఫోన్‌లోనే బస్‌పాస్‌లు

Published on Fri, 02/27/2026 - 16:26

హైదరాబాద్‌: ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మీసేవ ఆధ్వర్యంలోని ‘మీ టికెట్’ యాప్‌లో టీజీఎస్‌ఆర్టీసీ సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్‌పాస్‌ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులు ముగిసే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ చేసే దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.

మీటికెట్ యాప్ ఇప్పటికే రెండు లక్షలకు పైగా డౌన్‌లోడ్లు సాధించగా, రూ.2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మీసేవ ఈ-గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు నగర బస్‌పాస్‌లు, అంతర్రాష్ట్ర టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందగలుగుతున్నారు. డిపోలకు వెళ్లడం, ఫారమ్‌లు నింపడం, క్యూలో నిలబడడం వంటి ప్రక్రియలు ఇక అవసరం లేకుండా పోతున్నాయి. దరఖాస్తు, చెల్లింపు, పాస్ జారీ అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తవుతున్నాయి. అదనపు బుకింగ్ ఛార్జీలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

ఈ మార్పు ప్రయాణికులకు స్పష్టంగా కనిపిస్తోంది. “ప్రతి నెల పాస్ కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు నిమిషాల్లోనే పూర్తి అవుతోంది” అని ఓ విద్యార్థి తెలిపారు. మరో విద్యార్థిని “ఫోన్‌లో ఉండే క్యూ ఆర్ కోడ్ సురక్షితం. ఎవరూ కాపీ చేయలేరు” అని చెప్పారు. మీటికెట్ ద్వారా జారీ చేసే ప్రతి పాస్‌లో డైనమిక్ క్యూ ఆర్ కోడ్, లైవ్ వాలిడిటీ సూచిక, స్క్రీన్‌షాట్ నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాస్‌ల దుర్వినియోగం తగ్గడమే కాకుండా, బస్సుల్లో కండక్టర్లు వెంటనే స్కాన్ చేసి ధృవీకరించగలుగుతున్నారు. దీంతో ప్రయాణం వేగవంతం అవుతోంది.

యాప్‌లోనే పాస్ రీన్యువల్ సదుపాయం కల్పించడం ద్వారా డిపోలపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. 221 ప్రాంతాల్లోని 190 సేవా కేంద్రాలపై ఉన్న భారం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. “పారదర్శకత, సౌలభ్యం కలిగిన పౌర కేంద్రిత రవాణా వ్యవస్థను రూపొందించడం మా లక్ష్యం” అని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ టి. రవి కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ), పుష్పక్ ఏసీ వంటి ఐదు రకాల పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, వృద్ధులకు రాయితీ పాస్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

టీజీఎస్‌ఆర్టీసీ సేవలను మీటికెట్‌లో విలీనం చేయడం ద్వారా మీసేవ సేవలు మరింత విస్తరించాయి. పత్రాల సేవల నుంచి ప్రజా రవాణా వరకు విస్తరించిన ఈ వేదిక, తెలంగాణను డిజిటల్ పాలనలో ముందంజలో నిలిపింది. ఇకపై ప్రయాణం కోసం కాగితం అవసరం లేకుండా, ఫోన్‌లోనే బస్‌పాస్‌తో ముందుకు సాగుతున్న కొత్త యుగానికి రాష్ట్రం నాంది పలికింది.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు