బహు శిరస్సుల జల రాక్షసిలా 'హైడ్రా' తీరు

Published on Tue, 07/28/2026 - 01:53

ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వ సంస్థలు చట్టాన్ని అతిక్రమించే స్థాయికి చేరుకుంటే అది దేశానికే ప్రమాదకరం. కోర్టుల ఆదేశాలను పక్కనబెట్టి స్వతంత్ర అధికార కేంద్రాలుగా వ్యవహరిస్తే అది న్యాయవ్యవస్థకు ‘మరణ ఘంటిక’గా మారుతుంది. న్యాయపాలన, రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ప్రభుత్వ సంస్థకు అత్యంత ప్రాథమిక బాధ్యత.

న్యాయస్థానాన్ని ప్రజలు ఆశ్రయించడం రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వెంటనే ఆ ఫలితాన్ని పొందడం అందులో భాగమే. అయితే ఆ తీర్పు అమలు కానంత వరకు న్యాయం జరగనట్లే లెక్క. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరితో వరుసగా ధిక్కార పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టులో 9,290 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి
– హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మరో సమర్థ అధికారిని ఆ పోస్టులో నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది. రంగనాథ్‌  పదేపదే తమ ఆదేశాలు ఉల్లంఘించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకే కేసులో మూడు ధిక్కరణ కేసులు నమోదైనా కోర్టు ఆదేశాలపై ఏమాత్రం గౌరవం చూపకపోవడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. ఇలాంటి అధికారి హైడ్రా కమిషనర్‌గా కొనసాగితే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. గతంలోనే హెచ్చరించినా ఎలాంటి మార్పు కనిపించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడేందుకు ఇలాంటి చర్యలు తీసుకోక తప్పడం లేదని వెల్లడించింది. ఆయన దాఖలు చేసిన క్షమాపణను అంగీకరించబోమంటూ సదరు అఫిడవిట్‌ను కూడా తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటు ఉద్దేశం మంచిదే కానీ, ఎవరైనా చట్టాన్ని పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట భూ వివాదంలో శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన ధిక్కార కేసుపై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా క్షమాపణ కోరుతూ రంగనాథ్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్‌ తరఫున న్యాయవాది హరీశ్‌కుమార్‌ హాజరయ్యారు. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించారు.  

తీర్పులు అమలు కాకపోతే హక్కులు నిరర్థకం 
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందనేదే దాని నిబద్ధతకు నిజమైన కొలమానం. న్యా­యస్థానాల గౌరవం వాటి తీర్పులను వెంటనే అమలు చేయడంలోనే ఉంటుంది. కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలైతేనే పౌ­రుడు న్యాయం పొందుతారు. అమలు చేయకుండా ఆలస్యం చేయడం కోర్టు ధిక్కరణే. తీర్పులు అమలు కాకపోతే రాజ్యాంగ బద్ధమైన హక్కులే నిరర్థకంగా మారతాయి. ప్రభుత్వ యంత్రాంగంలో వాటి అమలును పర్యవేక్షించే సమర్థమైన వ్య­వస్థ ఉండాలి. గ్రీకు పురాణాల్లోని ‘హైడ్రా’అనే బహుశిరస్సుల జల రాక్షసిలా ఈ హైడ్రా మారుతోంది. ఒక తల నరికితే మరిన్ని తలలు పుట్టే భీకర జీవి అది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం, మరో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కావడం ఇదే తరహాలో కనిపిస్తోంది. అంత పెద్ద రాక్షసిపై అక్కడ న్యాయమే గెలిచింది. అలాగే కోర్టులు కూడా చట్ట పరిపాలనను కాపాడటంలో వెనక్కి తగ్గవు. హైడ్రా అనే పేరుతో పనిచేసే సంస్థ కూడా చట్టంపై పైచేయి సాధించలేదని గుర్తుంచుకోవాలి.  

ఒకే అధికారి.. 63 ధిక్కరణ కేసులు 
2016లో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వాటిని అమలు చేయకపోవడంతో 2021లో తొలి ధిక్కరణ కేసు.. 2026లో మరోసారి అదే అంశంపై రెండో ధిక్కరణ కేసు.. ప్రస్తుతం మూడోసారి కూడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ ధిక్కరణ కేసు విచారణకు వచ్చింది. రిట్‌ పిటిషన్, అప్పీల్, సివిల్‌ సూట్, సిటీ సివిల్‌ కోర్టు అప్పీల్‌ వరకు అన్ని దశల్లోనూ పిటిషనర్‌కు అనుకూలంగానే తీర్పులు వచ్చినా, వాటిని గౌరవించకుండా వ్యవహరించడం అత్యంత విచారకరం. హైడ్రా కమిషనర్‌పై మొత్తం 63 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటిన్నర నుంచి రెండేళ్ల వ్యవధిలో ఒకే అధికారిపై ఇన్ని కేసులు రావడం సాధారణ విషయం కాదు. ఇలాంటి కేసులను విచారించడానికే కోర్టులు ఎంతో విలువైన సమయం వెచ్చించాల్సి వస్తోంది. కోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించకపోతే న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కోర్టులు ప్రజల హక్కులను కాపాడటానికే ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు దాని ఉత్తర్వులను ధిక్కరించి, పౌరుల హక్కులను కాలరాస్తే.. అది న్యాయవ్యవస్థకే సవాలుగా మారుతుంది. అలాంటి పరిస్థితిని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహింబోవు. 

క్షమాపణ అంగీకరించే పరిస్థితి లేదు.. 
రెండో ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా.. పిటిషనర్‌ ఆస్తిలోకి హైడ్రా అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించబోరని స్టాండింగ్‌ కౌన్సిల్‌ ద్వారా కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీని ఉల్లంఘించి మళ్లీ అదే చర్యలకు పాల్పడటం ఉద్దేశపూర్వక ధిక్కరణకు నిదర్శనం. ఇది సాధారణ తప్పిదం కాదు. కోర్టు ఆదేశాలు తెలిసీ ధిక్కరించిన చర్యగా పరిగణించాల్సి వస్తుంది..’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రంగనాథ్‌ దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌ను జడ్జి పరిశీలించారు. ‘నిజమైన క్షమాపణ అంటే పశ్చాత్తాపంతో వెంటనే చెప్పేది. కోర్టు శిక్ష విధించబోతోందని తెలిసిన తర్వాత చెప్పే క్షమాపణకు విలువ ఉండదు. అది పశ్చాత్తాపం కాదు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే..’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. ఆ క్షమాపణను అంగీకరించే పరిస్థితి లేదన్నారు. పరిపాలనకు ఇచ్చే అధికారాలు ఎంత గొప్పవో, వాటిని దుర్వినియోగం చేస్తే అంతే ప్రమాదకరంగా మారతాయని స్పష్టం చేశారు. పక్షపాతంతో వినియోగిస్తే రాష్ట్ర ప్రజల హక్కులపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.  

అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ సూచన 
కోర్టు ఆదేశాల వరుస ఉల్లంఘన, హామీలను పాటించకపోవడం, ధిక్కరణ కేసులు పెరుగుతుండటం లాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ కొనసాగడం సముచితం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ‘గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు కనిపించని అధికారిని కొనసాగిస్తే.. చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడుతుంది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను తొలగించి, మరొకరిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సీఎస్‌కు సూచిస్తున్నాం. అసాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అసాధారణ సూచన చేయాల్సి వస్తోంది. హైకోర్టుకు ఆర్టికల్‌ 215తో పాటు ధిక్కరణ చట్ట ప్రకారం ధిక్కారంపై చర్యలు తీసుకునే అధికారం ఉంది. ప్రజా ఆస్తుల రక్షణ ప్రాధాన్యమే అయినా.. అది చట్టబద్ధంగానే జరగాలి. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అధికారులు చేపట్టిన చర్యలతో ప్రభుత్వం లేదా పౌరులకు నష్టం జరిగితే, దాన్ని ప్రభుత్వ ఖజానాపై మోపకుండా, బాధ్యులైన అధికారుల వ్యక్తిగత బాధ్యతగా పరిగణించాలి..’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వెల్లడించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)