నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..
వనజ చితాభస్మంలో బయటపడ్డ కత్తెర
Published on Fri, 06/19/2026 - 11:33
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర ఘటన వెలుగు చూసింది. పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతి, కడుపు నుంచి బయటపడ్డ పసికందు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యారు!. ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే.. పుట్టెడు దుఖంలో ఆ తల్లీబిడ్డలకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించగా.. చితాభస్మం నుంచి కత్తెర బయటపడడం ఒక్కసారిగా కలకలం రేపింది.
గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో జరిగిన దారుణ ఘటనలో వైద్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 13న గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రసవాన్ని ఒక నర్సు నిర్వహించారు.

అయితే ఈ ప్రక్రియలో అవగాహన లోపం కారణంగా శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ పసికందును ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటు తీవ్ర రక్తస్రావంతో వనజ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూసింది.
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని.. విచారణకు ఆదేశించారు. ఈలోపు మరో ఘోరం బయటపడింది. కర్మకాండల కోసం వనజ చితాభస్మాన్ని సేకరిస్తున్న సమయంలో అందులో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో షాక్ తిన్నారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై, ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారని, చితాభస్మంలో కత్తెర బయటపడటమే దీనికి స్పష్టమైన నిదర్శనమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రం సాధారణ ప్రసవమే జరిగిందని, చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని పేర్కొంటూ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
Tags : 1