‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!

Published on Sun, 11/19/2023 - 05:12

సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు.

మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్‌ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం.  

మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 
2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్‌ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్‌ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్‌ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్‌ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్‌ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది.

జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్‌ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది.  

‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? 
ఆహారోత్పత్తులను మనం మార్కెట్‌లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్‌ కాస్ట్‌’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్‌ అకౌంటింగ్‌’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్‌ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్‌ఏఓ వెల్లడించింది. 

ఈ ఆహారాలే జబ్బులకు మూలం 
వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్‌ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్‌ఏఓ నివేదిక తేల్చింది.

ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్‌ఎఓ తెలిపింది.

సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)