నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి
Breaking News
బహదూర్‌గూడ వివాదంలో రైతులపై కేసు
Published on Sun, 07/19/2026 - 12:20
సాక్షి,శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు హబ్ భూసేకరణ ఉద్రిక్తతలకు దారితీసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో, పోలీసులపై దాడికి పాల్పడిన పలువురు రైతులపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగిందంటూ శంషాబాద్ రూరల్ ఎస్ఐ వనజ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడటం వంటి పలు సెక్షన్ల కింద ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బహదూర్‌గూడలో దాదాపు 650 ఎకరాల భూసేకరణను అడ్డుకునేందుకు రైతులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులతో రైతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరసనకారులు ఒక్కసారిగా పోలీసులపై కుర్చీలు విసురుతూ, వారిపై కారం చల్లారు. ఈ ఘర్షణలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల కళ్లల్లో కారం పడటంతో వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
ఈ ఘటన అనంతరం బహదూర్‌గూడలో అధికారులు ఫెన్సింగ్ పనులను పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, బందోబస్తును ముమ్మరం చేశారు.
Tags : 1