Breaking News

‘స్వర్ణ’ నందిని

Published on Sat, 05/31/2025 - 02:18

గుమి (దక్షిణ కొరియా): తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి మెరుపులతో అదరగొడుతున్నారు. పోటీల మూడో రోజు ఆంధ్ర అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధిస్తే... ఇప్పుడు నాలుగో రోజు శుక్రవారం తెలంగాణ అథ్లెట్‌ నందిని అగసార స్వర్ణ పతకం సాధించింది. మొత్తం మీద కొరియన్‌ గడ్డపై భారత బృందం స్వర్ణభేరి మోగిస్తోంది. నాలుగో రోజు పోటీల్లో మన నందినితో పాటు... లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్, హైజంపర్‌ పూజ సింగ్‌లు కూడా బంగారు పతకాలు గెలుపొందారు. దీంతో భారత్‌ ఇప్పటికే 18 పతకాలు సాధించింది. 

ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. ఇదే జోరు కొనసాగితే... గత 2023–బ్యాంకాక్‌ చాంపియన్‌షిప్‌లో పట్టుకొచ్చిన 27 పతకాల రికార్డును భారత్‌ అధిగమించే అవకాశముంది. ఇదివరకు 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీ మరో పతకంపై గురిపెట్టింది. ఆమె 200 మీటర్ల పరుగులో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. నిత్య గంధే కూడా ఫైనల్‌ చేరింది. పురుషుల 200 మీటర్ల స్ప్రింట్‌లో అనిమేశ్‌ కుజూర్‌ ఫైనల్‌ పరుగుకు సిద్ధమయ్యాడు. 

చైనా అథ్లెట్‌ను అధిగమించి... 
తెలంగాణ తేజం నందిని హెప్టాథ్లాన్‌లో పతకం కోసం పెద్ద పోరాటమే చేసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన ఈ ఈవెంట్‌లో నందిని చైనా అథ్లెట్‌ ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని... అగ్రస్థానం సాధించడం గొప్ప విశేషం. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్లిష్టమైన హెప్టాథ్లాన్‌లో భారత్‌ బంగారు పతకం సాధించగలిగింది. 2017లో స్వప్న బర్మన్‌ తర్వాత ఆసియా ఈవెంట్‌లో బంగారం నెగ్గిన ఘనత మన నందినిదే కావడం గమనార్హం. సోమ బిస్వాస్‌ (2005లో) తర్వాత సుదీర్ఘ నిరీక్షిణకు ఆమె తెరదించితే... నందిని తాజాగా భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చింది. 

100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, జావెలిన్‌ త్రో, 800 మీటర్ల పరుగు ఇలా... ఈ ఏడు క్రీడాంశాల్లో మొత్తంగా కలిపి నందిని 5941 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో ఈవెంట్‌ అయిన జావెలిన్‌ త్రోలో కేవలం 34.18 మీటర్ల పేలవ ప్రదర్శన తర్వాత రేసు (మొత్తం పాయింట్లు)లో వెనుకబడిన తెలంగాణ అథ్లెట్‌ ఆఖరి పోటీ అయిన 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 15.54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలువడంతో తిరిగి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. 

నందినికి ఆఖరిదాకా సవాల్‌ విసిరిన చైనా హెప్టాథ్లెట్‌ లియు జింగ్‌యి 5869 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. నిజానికి చైనా క్రీడాకారిణి జావెలిన్‌ త్రో తర్వాత ఆధిక్యంలోకి వచ్చింది. అయితే నందిని 800 మీటర్ల పరుగులో పుంజుకోవడంతో చైనా అథ్లెట్‌ ‘బంగారు’ ఆశలు గల్లంతయ్యాయి.   

అనర్హతకు గురైన పురుషుల రిలే జట్టు 
మూడో రోజు పోటీల్లో మహిళలు, పురుషుల రిలే జట్లు పతకాలు సాధించగా... తాజాగా 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు అనర్హతకు గురైంది. ప్రణవ్‌ గౌరవ్, రాహుల్, మణికంఠ, అమ్లన్‌ బొర్గొహైన్‌లతో కూడిన రిలే జట్టు ప్రిలిమినరీ రౌండ్‌లోనే అనర్హతకు గురైంది. ఒకరి నుంచి మరొకరు బ్యాట్‌ను అందుకునేందుకు అనుమతించే చోటు (చేంజ్‌ ఓవర్‌ జోన్‌)ని దాటి బ్యాటన్‌ను తీసుకోవడంతో (ప్రణవ్‌నుంచి రాహుల్‌) టీమ్‌ డిస్‌క్వాలిఫై అయింది. అయితే పురుషుల జావెలిన్‌ త్రోలో సచిన్, యశ్‌వీర్‌ ఫైనల్‌ పోటీలకు అర్హత సాధించారు.

గుల్వీర్‌ అ‘ద్వితీయ’ం
ఆసియా చాంపియన్‌షిప్‌ మొదలైన రోజే 10 వేల మీటర్ల సుదీర్ఘ పరుగులో బంగారు పతకం సాధించిన గుల్వీర్‌ సింగ్‌ నాలుగో రోజు మరో పసిడిని పట్టాడు. శుక్రవారం పురుషుల 5000 మీటర్ల పరుగులో అతను విజేతగా నిలిచాడు. గుల్వీర్‌ 13 నిమిషాల 24.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. వెంట్రుక వాసిలో థాయ్‌లాండ్‌ అథ్లెట్‌ కీరన్‌ తుంతివతే (13:24.97 సెకన్లు)ను రజతానికి పరిమితం చేశాడు. 

పూజ ‘హై’జంప్‌
హరియాణాకు చెందిన 18 ఏళ్ల టీనేజ్‌ అథ్లెట్‌ పూజ సింగ్‌ హైజంప్‌లో పసిడి శోభ తెచ్చింది. మహిళల హైజంప్‌లో ఆమె తన ఐదవ ప్రయత్నంలో 1.89 మీటర్ల ఎత్తులో జంప్‌ చేయడం ద్వారా తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీంతో ఆమెకు బంగారు పతకం లభించింది. పూజ ‘షో’తో ఉజ్బెకిస్తాన్‌ హైజంపర్‌ సఫినా సదుల్లెవా (1.86 మీటర్లు) రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. 

భవన నిర్మాణ కూలీ కుమార్తె అయిన పూజ రెండేళ్ల క్రితం ఆసియా అండర్‌–23 చాంపియన్‌షిప్‌ (2023)లోనూ బంగారు పతకంతో సత్తా చాటుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌ చౌదరి రజతం గెలుపొందింది. 9 నిమిషాల 12.46 సెకన్లలో పోటీని పూర్తిచేసిన ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది. కేవలం 2 సెకన్ల తేడాతో పారుల్‌ స్వర్ణావకాశం చేజారింది. కజకిస్తాన్‌ అథ్లెట్‌ నోరా జెరుతో తనుయ్‌ (9:10.46 సెకన్లు) బంగారు పతకం గెలుచుకుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)