Breaking News

ఆటపై అభి‘రుచి’

Published on Sun, 04/20/2025 - 01:42

సాక్షి క్రీడా విభాగం  :  పెరూ రాజధాని లిమా నగరంలో ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నీ... భారత స్టార్‌ షూటర్, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ మనూ భాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో బరిలో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత మొదటిసారి బరిలోకి దిగిన మనూ స్వర్ణం గెలవడం ఖాయం అన్నట్లుగా అంచనాలు ఆమెపైనే ఉన్నాయి. కానీ చివరకు అనూహ్య ఫలితం వచ్చింది. భారత్‌కే చెందిన మరో యువ షూటర్, 18 ఏళ్ల సురుచి సింగ్‌ దూసుకొచ్చింది. మనూ భాకర్‌ను వెనక్కి నెట్టి ఆమె స్వర్ణపతకం సొంతం చేసుకుంది. 

ఒలింపిక్‌ మెడలిస్ట్‌ మనూ భాకర్‌ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆమెపై పడింది. మనూ భాకర్‌పై గెలిచిన రెండో రోజు సురుచి పిస్టల్‌ మళ్లీ మెరిసింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కే చెందిన సౌరభ్‌ చౌధరీతో కలిసి సురుచి మరో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు వారమే అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో స్వర్ణం నెగ్గిన ఆమెకు ఓవరాల్‌గా ఇది మూడో స్వర్ణం. అయితే మొదటి స్వర్ణంతో పోలిస్తే మనూ భాకర్‌ను ఓడించి సాధించిన పసిడి పతకం విలువ పెద్దదిగా మారిపోయింది.  

బాక్సింగ్, రెజ్లింగ్‌ను కాదని... 
సురుచి స్వస్థలం హరియాణాలోని జఝర్‌. దేశంలోనే బాక్సింగ్‌కు అడ్డాగా ఒలింపిక్‌ మెడలిస్ట్‌ విజేందర్‌ సింగ్‌ సహా ఎంతో మంది బాక్సర్లు ఓనమాలు నేర్చుకొని అగ్రస్థాయికి చేరిన భివానికి సమీపంలో ఇది ఉంటుంది. జఝర్‌కు చెందిన ఇందర్‌ సింగ్‌ ఆర్మీలో హవల్దార్‌గా పని చేశాడు. ఒకప్పుడు గొప్ప రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గూంగా (మూగ) పహిల్వాన్‌ (వీరేందర్‌ సింగ్‌) ఇతనికి సోదరుని వరుస (కజిన్‌) అవుతాడు. తన కజిన్‌ తరహాలోనే తన కూతురు సురుచిని కూడా రెజ్లర్‌ను చేయాలని ఇందర్‌ సింగ్‌ ఆశించాడు. 

అయితే ఆ అమ్మాయి మాత్రం మరోవైపు ఆసక్తిని చూపించింది. అటు బాక్సింగ్, ఇటు రెజ్లింగ్‌ కాకుండా షూటింగ్‌ను ఎంచుకుంది. అందులో టాప్‌ ప్లేయర్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కూతురి ఇష్టాన్ని గుర్తించిన ఇందర్‌ సింగ్‌ ఆమెను భివానిలోని గురు ద్రోణాచార్య షూటింగ్‌ అకాడమీలో చేర్పించాడు. ఆపై తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కూతురును షూటర్‌ను చేసేందుకు తన సమయం వెచ్చించాడు. 

13 ఏళ్ల సురుచి కోచ్‌ సురేశ్‌ సింగ్‌ మార్గనిర్దేశనంలో షూటింగ్‌ను నేర్చుకొని అందులో పట్టు సంపాదించింది. ఇక మున్ముందు టోర్నీల్లో విజయాలే లక్ష్యంగా ఆమె సిద్ధమవుతూ వచ్చింది. అప్పుడే కోవిడ్‌ మహమ్మారి వచ్చేసింది. ప్రపంచంలో ఎంతో మంది ప్లేయర్లకు వచ్చిన కష్టమే సురుచికి కూడా వచ్చింది.  

సొంత ఊర్లో సాధన... 
కోవిడ్‌ సమయంలో భివానికి వెళ్లి ప్రాక్టీస్‌ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే సురుచి కొన్ని జూనియర్‌ టోర్నమెంట్‌లలో పాల్గొంటూ వచ్చింది. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఇందర్‌ సింగ్‌కు తమ స్వగ్రామంలోనే కొత్తగా ఏర్పాటైన కార్గిల్‌ షూటింగ్‌ అకాడమీ కలిసొచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న అనిల్‌ జాఖడ్‌ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. దాంతో ఇక్కడే సురుచి సాధన మళ్లీ మొదలైంది. ఆమె తన ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 

ఈ శిక్షణ కోవిడ్‌ తర్వాత మంచి ప్రభావం చూపించింది. 2022 జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆమె తొలి సారి పతకం గెలుచుకొని తన విజయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023 జాతీయ చాంపియన్‌షిప్‌లో కూడా పతకాలు సాధించింది. అయితే 2024లో జరిగిన పోటీలు ఆమె స్థాయిని షూటింగ్‌ ప్రపంచానికి తెలియజేశాయి. ఈసారి ఏకంగా 7 పతకాలతో మెరిసిన సురుచికి భారత భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు వచ్చింది.  

స్టార్‌ షూటర్‌ శిక్షణలో... 
ప్రఖ్యాత పిస్టల్‌ షూటర్‌ జీతూ రాయ్‌ భారత జట్టు కోచింగ్‌ బృందంలోకి వచ్చాక సురుచి ఆట మరింత పదునెక్కింది. షూట్‌ చేసే సమయంలో ఆమె నిలిచే తీరులో ఉన్న స్వల్ప లోపాన్ని సవరించడంతో పాటు కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకునే విషయంలో జీతూ రాయ్‌ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. సురుచి ఇటీవలి వరుస విజయాల్లో రాయ్‌ పాత్ర కూడా చాలా ఉంది. ముఖ్యంగా వరల్డ్‌  కప్‌కు ముందు కర్ణీ సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జీతూ రాయ్‌ మార్గనిర్దేశనంలో జరిగిన 15 రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం సురుచికి ఎంతో మేలు చేసింది. 

వరల్డ్‌ కప్‌లో 2 వ్యక్తిగత స్వర్ణాలతో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌదరితో కలిసి మరో పసిడిని కూడా ఆమె సొంతం చేసుకొని తన స్వర్ణాల సంఖ్యను మూడుకు పెంచుకుంది. ఓపికకు చిరునామావంటి షూటింగ్‌ క్రీడలో కెరీర్‌ ఆరంభంలో ఆమె త్వరగా ప్రాక్టీస్‌ ముగించే ప్రయత్నంలో కాస్త అసహనం ప్రదర్శించేది. కానీ కోచ్‌లు దీనిని గుర్తించి ఆమెకు సరైన దిశానిర్దేశం చేశారు. ఆటలో ఎదగాలంటే సాంకేతిక అంశాలే కాదు వ్యక్తిగత లోపాలు కూడా దిద్దుకోవాలని వారు చేసిన సూచనలను ఆమె అర్థం చేసుకుంది. 

ఇప్పుడు ప్రాక్టీస్‌లో కూడా తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పర్‌ఫెక్షన్‌ వచ్చే వరకు సురుచి అక్కడినుంచి కదలదు. అలాంటి పట్టుదల అలవాటు చేసుకొని పెద్ద లక్ష్యాలతో ఆమె ముందుకు సాగుతోంది. తొలి కోచ్‌ సురేశ్‌ సింగ్‌ నుంచి  జీతూ రాయ్‌ వరకు ఇప్పుడు కష్టపడే తత్వం గురించే చెబుతుండటం విశేషం. వరల్డ్‌ కప్‌ తరహా ప్రదర్శనలు పునరావృతం చేస్తూ నిలకడగా సాగితే భవిష్యత్తులో సురుచి నుంచి కూడా ఒలింపిక్‌ పతకం ఆశించవచ్చు.  

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)