అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
Published on Fri, 05/30/2025 - 23:14
ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.
కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.
జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.
సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్‌ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు.
Tags : 1