రోహిత్‌ రఫ్ఫాడించినా...

Published on Mon, 07/20/2026 - 05:29

లండన్‌: ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగినా... భారత జట్టుకు పరాజయం తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్‌లో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఫలితంగా ఆతిథ్య ఇంగ్లండ్‌ 2–1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్నీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. 

బుమ్రా గైర్హాజరీలో భారత బౌలింగ్‌ను ఆటాడుకున్న ఇంగ్లండ్‌ జట్టు... లార్డ్స్‌ మైదానంలో లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీమిండియాపై ఇంగ్లండ్‌కిదే అత్యధిక స్కోరు. బెన్‌ డకెట్‌ (135 బంతుల్లో 141; 18 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచరీతో చెలరేగగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాకబ్‌ బెతెల్‌ (93 బంతుల్లో 91; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ జో రూట్‌ (48 బంతుల్లో 74 నాటౌట్‌; 9 ఫోర్లు) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అజేయంగా నిలవగా... జోస్‌ బట్లర్‌ (13 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో దంచికొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు చేసి ఓడిపోయింది. రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా... కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (84 బంతుల్లో 77; 10 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి (60 బంతుల్లో 74; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ 4 వికెట్లు పడగొట్టాడు.  

ఆరంభం అదిరినా... 
ఈ మ్యాచ్‌తోనే వన్డే కెరీర్‌కు వీడ్కోలు పడనుందనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ పూర్తి సాధికారికంగా ఆడాడు. గిల్‌తో కలిసి నిధానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్‌ కుదురుకున్నాక మైదానం నలువైపులా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో మొదట గిల్‌ 53 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... రోహిత్‌ 50 బంతుల్లోనే ఆ మార్క్‌ దాటాడు. 

ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించింది. అనంతరం గిల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా... రోహిత్‌కు కోహ్లి జతవడంతో ఇన్నింగ్స్‌ మరోస్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌ రోహిత్, కోహ్లి కలిసి ఆడిన 400వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ప్రపంచ క్రికెట్‌లో మరే జోడీ కలిసి ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. సచిన్‌ టెండూల్కర్‌–రాహుల్‌ ద్రవిడ్‌ జంట (391 మ్యాచ్‌లతో) రెండో స్థానంలో ఉంది. 

ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న రోహిత్‌ 84 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా లార్డ్స్‌లో వన్డే ఫార్మాట్‌లో సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్‌గా రోహిత్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లండ్‌ గడ్డపై రోహిత్‌కు ఇది 8వ వన్డే సెంచరీ. మరే బ్యాటర్‌ ఇంగ్లండ్‌లో ఇన్ని సెంచరీలు చేయలేదు. సచిన్‌ టెండూల్కర్, డికాక్, డివిలియర్స్, సయీద్‌ అన్వర్‌ ఏడు చొప్పున శతకాలు బాదారు.

 సెంచరీ తర్వాతా ధాటిగా ఆడిన రోహిత్‌ ఎట్టకేలకు బెతెల్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. రోహిత్, కోహ్లి రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు. భారత్‌ విజయానికి 42 బంతుల్లో 88 పరుగులు అవసరమైన దశలో ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ (14), శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను అవుట్‌ చేసిన సామ్‌ కరన్‌... తన తదుపరి ఓవర్‌లో కోహ్లిని అవుట్‌ చేసి టీమిండియాను విజయానికి దూరం చేశాడు. చివరి 3 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకోవడమే... ఛేదనలో భారత్‌కు పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది. 

చివరి 3 ఓవర్లలో 62 పరుగులు... 
పవర్‌ప్లేలో చినుకులా మొదలైన ఇంగ్లండ్‌ పరుగుల ప్రవాహం... మధ్య ఓవర్లలో వరదలా మారి... ఆఖర్లో ఉప్పెనలా ముంచెత్తింది. ఓపెనర్లు డకెట్, బెతెల్‌ ఆరంభంలో నిదానంగా ఆడారు. ఫలితంగా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి ఆతిథ్య జట్టు 58 పరుగులు చేసింది. ఆ తర్వాత గేరు మార్చిన ఈ జంట... ఎడాపెడా బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టింది. మోకాలి గాయంతో బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంకాగా... పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్‌ను ఇంగ్లండ్‌ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు.

 ఈ క్రమంలో బెతెల్‌ 51 బంతుల్లో, డకెట్‌ 64 బంతుల్లో హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించాక బెతెల్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రూట్‌ ఫామ్‌ కొనసాగించాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు.  రూట్‌ 154 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు జోడించడం విశేషం. 

ఈ క్రమంలో డకెట్‌ 108 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన తర్వాత లార్డ్స్‌ మైదానంలో అత్యధిక లిస్ట్‌ ‘ఎ’వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన డకెట్‌ అవుటయ్యాడు. కెప్టెన్‌ బ్రూక్‌ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా ... చివర్లో బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రూట్, బట్లర్‌ దూకుడుతో చివరి 3 ఓవర్లలో ఇంగ్లండ్‌ జట్టు 62 పరుగులు పిండుకుంది.  వెస్టిండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ మృతికి సంతాపంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: డకెట్‌ (సి అండ్‌ బి) ప్రిన్స్‌ 141; బెతెల్‌ (సి) రోహిత్‌ (బి) ప్రసిధ్‌ 91; రూట్‌ (నాటౌట్‌) 74; బ్రూక్‌ (సి) కోహ్లి (బి) ప్రసిధ్‌ 14; బట్లర్‌ (నాటౌట్‌) 41; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్లకు) 387. 
వికెట్ల పతనం: 1–192, 2–293, 3–324. 
బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 10–0–72–0; ప్రసిధ్‌ 10–2–69–2; ప్రిన్స్‌ యాదవ్‌ 10–0–79–1; గుర్‌నూర్‌ 10–0–97–0; అక్షర్‌ 10–0–61–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) బెతెల్‌ 138; గిల్‌ (ఎల్బీ) (బి) ఆదిల్‌ 77; కోహ్లి (సి) బ్రూక్‌ (బి) కరన్‌ 74; ఇషాన్‌ (సి) (సబ్‌) రేహాన్‌ (బి) కరన్‌ 14; శ్రేయస్‌ (సి) (సబ్‌) రేహాన్‌ (బి) కరన్‌ 0; కేఎల్‌ రాహుల్‌ (బి) ఆర్చర్‌ 12; అక్షర్‌ (సి) జాక్స్‌ (బి) కరన్‌ 2; గుర్‌నూర్‌ (నాటౌట్‌) 18; అర్ష్ దీప్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 360. 
వికెట్ల పతనం: 1–147, 2–260, 3–304, 4–304, 5–315, 6–327, 7–329. 
బౌలింగ్‌: ఆర్చర్‌ 10–0–63–1; అట్కిన్సన్‌ 6–0–24–0; టంగ్‌ 5–1–43–0; సామ్‌ కరన్‌ 10–0–75–4; ఆదిల్‌ రషీద్‌ 8–0–64–1; జాక్స్‌ 4–0–38–0; బెతెల్‌ 7–0–49–1. 
 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)