కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?
Breaking News
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
Published on Tue, 03/10/2026 - 13:24
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం రెండు ఫార్మాట్లకే పరిమితమై ఉండేది. ఒకటి టెస్టు క్రికెట్, మరొకటి వన్డే ఫార్మాట్. ఈ రెండు ఫార్మాట్‌లను తలదన్నేలా 20 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది టీ20 ఫార్మాట్. దనాధన్ ఆటతో కొద్దికాలంలోనే క్రికెట్ అభిమానుల ఆదరణ చూరగొన్న ఈ పొట్టి ఫార్మాట్ ఇవాళ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 20 ఓవర్ల ఆటలో క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే తాయత్రయంతోనే ఉంటారు. కానీ ఇన్నింగ్స్‌లో చివరి 5 ఓవర్లను డెత్ ఓవర్లుగా పిలవడం ఆనవాయితీ. ఈ ఓవర్లలో నిఖార్సైన ఇన్నింగ్స్‌లు ఆడే బ్యాటర్‌ను ఫినిషర్‌గా పిలుస్తుంటారు.
టీమిండియాకు ప్రస్తుతం శివమ్ దూబే రూపంలో మంచి హిట్టర్ దొరికాడు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే 9 మ్యాచ్‌ల్లో 169 స్ట్రైక్‌రేట్ 235 పరుగులు చేసి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దూబే ప్రదర్శనను ఇప్పటి అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు కానీ నిజమైన దూబే 30 ఏళ్ల ముందే ప్రపంచానికి పరిచయమయ్యాడంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.
పాక్‌ను చీల్చిచెండాడి..
1990ల్లో 50 ఓవర్ల ఆటలో 250 పరుగులు చేయడం కష్టంగా ఉండేది. టాపార్డర్, మిడిలార్డర్ రాణిస్తే తప్ప స్కోరుబోర్డు పరిగెత్తకపోయేది. అయితే 1996 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్వార్టర్‌ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ నవ్‌జ్యోత్ సిద్ధూ 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో యాంకర్ పాత్రను పోషించాడు. సచిన్, కాంబ్లీ, మంజ్రేకర్, అజారుద్దీన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజయ్ జడేజా (25 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిఖార్సైన ఆటతీరుతో పాక్‌ను హడలెత్తించాడు. అప్పట్లో జడేజా ఆడిన ఆట ఇవాళ దూబే ఆట కంటే రెట్టింపు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి పాక్ జట్టులో వకార్ యూనిస్, ముస్తాక్ అహ్మద్, సలీమ్ మాలిక్ వంటి బలమైన బౌలింగ్ లైనప్‌ను చీల్చిచెండాడమే ఇందుకు కారణం. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 248 పరుగులకు ఆలౌటైంది. 1996 ప్రపంచకప్‌లో సెమీస్ చేరినప్పటికీ ఆనాటి చాంపియన్స్ శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
నిఖార్సైన ఆల్‌రౌండర్..
ఇక 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా భారత జట్టు తరఫున 196 వన్డేల్లో 5,359 పరుగులు, 15 టెస్టుల్లో 576 పరుగులు చేశాడు. అయితే 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలడంతో అజయ్ జడేజాపై ఐదేళ్ల నిషేధం పడింది. కానీ జట్టులో కొనసాగినన్ని రోజులు అజయ్ జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు గడించాడు. ఆ తర్వాత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అజయ్ జడేజా స్థానాన్ని భర్తీ చేయడంలో విజయవంతమయ్యాడు.
చదవండి: అందరూ మ్యాచ్ విన్నర్లే!
Tags : 1