BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?
Breaking News
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Published on Sun, 05/26/2024 - 03:56
సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని మూర్తి యాదవ్ను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరోపణలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లానని సీఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబర్లో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్డ్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్ పేర్కొన్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడి ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసినట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.
మరో 400 ఎకరాలను రిజిస్రే్టషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవాస్తవమని సీఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు.
Tags : 1