మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి
Published on Sun, 10/02/2022 - 16:46
పాట్నా: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్‌జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయం రంగంలో అవినీతిపై ప్రశ్నించారు. బీజేపీ-జేడీయూ పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష‍్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే రాజీనామా చేశారు.
సుధాకర్ సింగ్ రాజీనామాను ఆయన తండ్రి, బిహార్ ఆర్‌జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ధ్రువీకరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాళ్ల పక్షాన ఒకరు నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. 2006లో ఎన్డీఏ హయాంలో సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రద్దు చేయడం గమనార్హం.
సుధాకర్ సింగ్ తరచూ తన శాఖలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతు సమస్యలను తీర్చలేకపోతే ఈ పదవి ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు.
చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా
Tags : 1