Breaking News

గులాంగిరీ చేయొద్దు: రాహుల్‌గాంధీ

Published on Tue, 03/03/2026 - 04:07

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా కాంగ్రెస్‌ (డీసీసీ) అధ్యక్షులే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా అయ్యే అవకాశం కూడా వస్తుందని అన్నారు. డీసీసీల అధ్యక్షులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికీ గులాంగిరీ చేయొద్దని, పార్టీకి కళ్లు, చెవులు మీరేనని స్పష్టం చేశారు. సాధారణంగా (సింపుల్‌గా) ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లో పార్టీని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేహీ అంటే పదవులు రావని, డీసీసీ అధ్యక్షుల కార్యాచరణ పదవులే పరమావధిగా ఉండకూడదని, ప్రజల కోణంలో ఉండాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించేలా పని చేయాలని, పార్టీకి ప్రజల్లో మంచి పేరు తేవాలని కోరారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరితా రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్‌ 4 గంటల పాటు వారితో సమావేశమై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. 

బీజేపీ ప్రజల గురించి ఆలోచించదు.. 
‘పార్టీకి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులే సుప్రీం. మీరంతా నా టీమ్‌. భవిష్యత్తు అంతా మనదే. పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకునే బాధ్యత మీది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు సర్వాధికారాలు ఇచ్చాం. మీరు పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజలతో మమేకం కండి. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది మనమే. మన వల్లనే ప్రజలకు ఎక్కువ లబ్ది కలిగింది. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉంటారు. కానీ మనం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాం. అప్పుడే రాజకీయాలు చేస్తున్నాం. ప్రత్యర్థి పార్టీ అలా కాదు. కాంగ్రెస్‌ పార్టీకి ఎలా నష్టం కలిగించాలన్నదే బీజేపీ, మోదీ ఉద్దేశం. ఎలాగైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. వాళ్లు ఓట్ల కోసం స్వార్థంతో ఆలోచిస్తారే తప్ప ప్రజల గురించి ఆలోచించరు. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా మనం పనిచేయాలి. మీరు నిలబడండి. పార్టీని నిలబెట్టండి..’ అని రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. 

ఉన్నోడి వైపు బీజేపీ..లేనోడి వైపు కాంగ్రెస్‌ 
‘సామాజిక న్యాయం మన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. జనాభా దామాషా ప్రకారం వనరుల పంపిణీ గురించి చర్చ చేసింది, దేశంలో కులగణన చర్చను ప్రారంభించింది మనమే. ఆ వర్గాల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంది. అందుకే తెలంగాణలో బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, మైనార్టీల పక్షం వహిస్తున్నాం. దేశంలో రెండే వర్గాలున్నాయి. ఉన్నోడు.. లేనోడు. ఉన్నోడి వైపు బీజేపీ ఉంటే లేనోడి వైపు కాంగ్రెస్‌ ఉంది. బీజేపీది విభజన సిద్ధాంతం అయితే, మనది ఐక్యతా దృక్పథం. మనది అహింసా వాదం, వారిది మతం కోసం రాజకీయ వాదం. మనది గాంధేయవాదం, వారిది హింసా వాదం. మనం అన్ని మతాలు, కులాల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ బీజేపీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయదు.
  
శివుడిలా మనం సామాన్యంగా ఉండాలి 
హిందువులు ఆరాధించే శివుడు సామాన్యుడిలా కనిపిస్తాడు. ఆయన లాగానే మనమూ సామాన్యంగానే ఉండాలి. ఆయన అందరికీ తానున్నానని అభయహస్తం ఇస్తాడు. మన పార్టీ గుర్తు కూడా హస్తమే. మనం అందరినీ కలుపుకొని వెళ్లి ప్రజలకు తామున్నామనే అభయం ఇవ్వాలి. ప్రజలను మెప్పించి, వారి సమ్మతితోనే అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్‌ ఆలోచన. అదే మన సిద్ధాంతం. పార్టీలో మహిళలను గౌరవించాలి. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్‌ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్ళాలి. బీజేపీ ద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఆగడాలను అడ్డుకుని దేశాన్ని రక్షించాలి..’ అని రాహుల్‌ చెప్పారు. 

ట్రేడ్‌ డీల్‌ పెద్ద కుట్ర 
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. మోదీ అమెరికాకు లొంగిపోయేందుకు ప్రధాన కారణం ట్రేడ్‌ డీల్‌. ఇదో పెద్ద కుట్ర. ఈ కుట్రలో మోదీ అనేక తప్పులు చేశారు. అందుకే దేశాన్ని దారాధత్తం చేసి అమెరికా ముందు మోకరిల్లే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసమే పనిచేయడం వెనుక కూడా కుట్ర ఉంది. మోదీ విధానాలతో రూ. 9 లక్షల కోట్ల విలువైన నష్టం దేశ రైతులకు జరుగుతోంది. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరించండి. 

రేవంత్‌రెడ్డి పవర్‌ ఫుల్‌ లీడర్‌ 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్‌ ఫుల్‌ లీడర్‌. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ముందుకు తీసుకెళుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ముఖ్యం. పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అందరూ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించండి..’ అంటూ రాహుల్‌ దిశానిర్దేశం చేశారు.  

శుభాకాంక్షలు..ఫొటోసెషన్‌ 
డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి ముందు వికారాబాద్‌లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాహుల్‌ పాల్గొన్నారు. అందరూ బాగున్నారా అంటూ నేతలను పలకరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి షబ్బీర్‌ అలీ, వి.హన్మంతరావు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ ఈ సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి వెళ్లిన రాహుల్‌గాంధీ అక్కడ వారి కుటుంబసభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించారు. 

వారితో ఫొటోలు దిగారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆత్రం సుగుణ (ఆసిఫాబాద్‌), ఇ.వెంకట్రామిరెడ్డి (హనుమకొండ), సంజీవ్‌ ముదిరాజ్‌ (మహబూబ్‌నగర్‌).. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీ అధ్యక్షుల సమస్యలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, వైఎస్‌ షరి్మల, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సంగతన్‌ సృజన్‌ అభియాన్‌ ఇన్‌చార్జి చల్లా వంశీచందర్‌రెడ్డి, టీపీసీసీ శిక్షణ విభాగం చైర్మన్‌ టి.రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.   

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)