నా దారి నేను చూసుకుంటా..!

Published on Wed, 06/11/2025 - 01:29

తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 

వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్‌లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 

88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. 

సర్వేలో 1,798 మంది..
హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు:  సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్‌ఎన్‌ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్‌లో ఆన్ లైన్ లో నిర్వహించారు. 

వందేళ్లకుపైగా విజయవంతంగా..
దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం. 

మన దగ్గరే అత్యధికం..
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. 

ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్‌లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్‌ 76%, తైవాన్   61, చైనా 56, హాంగ్‌కాంగ్‌లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. 

మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.

జీడీపీలో 79% వాటా.. 
భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్‌వర్త్‌ వ్యక్తులు 60% మంది ఉన్నారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)