Breaking News

సిద్ధార్థ్‌రెడ్డికి జైలు

Published on Wed, 02/18/2026 - 05:09

సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్‌ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. 

ఈమేరకు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్‌ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్‌ లేవంటూ సిద్ధార్థ్‌ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. గత నవంబర్‌లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.  

సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు 
జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. 

హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. 

విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్‌ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. 

అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్‌ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. 

ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. 

డాక్టర్‌ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్‌ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్‌ప్రొఫెషనల్‌’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 

సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్‌ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. 

నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. 

ప్రమాదవశాత్తు కాదు: కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్‌ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 

విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్‌’అనే పురుగుల మందును సిద్ధార్థ్‌ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. 

ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 

సర్వైవింగ్‌ పార్ట్‌నర్‌దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.

ఆ రోజు ఏం జరిగింది? 
2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్‌డ్రింక్‌లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్‌ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. 

ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్‌ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్‌ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్‌ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్‌ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)