వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
అయోధ్యలో అక్రమాలు.. 500 ఏళ్ల త్యాగాల ప్రతీకపై మచ్చా
Published on Thu, 08/06/2026 - 10:40
భోపాల్: అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల చోరీ ఆరోపణలపై రామ జన్మభూమి ఉద్యమ నేతల్లో ఒకరైన సాధ్వి రితంభర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ.. బాధ్యులపై త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాధ్వి రితంభర మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణం కోసం గత 500 ఏళ్లుగా ప్రజలు డబ్బుతో పాటు ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి పవిత్ర స్థలానికి సమర్పించిన కానుకలపై దొంగతనం జరగడం భక్తులను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇది మనందరినీ సిగ్గుపడేలా చేసింది. కొంతమంది చేసే పనులు దేశానికి, సమాజానికి, సంప్రదాయాలకు చెడ్డపేరు తెస్తాయి. ఇది అలాంటి ఘటనల్లో ఒకటి అని ఆమె వ్యాఖ్యానించారు. భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించే కానుకలపై రాబందులాంటి కన్ను వేయడం బాధాకరమని సాధ్వి రితంభర అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో.. రామ మందిరం కోసం అనేక తరాలుగా ప్రజలు చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో విలువలు, నైతికతను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన జెన్ జెడ్ ఉద్యమంపై కూడా సాధ్వి రితంభర స్పందించారు. భారతదేశ వర్తమానం, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత దేశం, సంస్కృతి పట్ల అంకితభావంతో పనిచేయాలని, తమ ప్రతిభను సరైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. భారత యువత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని మేము కోరుకుంటున్నాం. వారు దేశం నెరవేర్చాల్సిన కలలను సాకారం చేస్తారు. భారతీయ పిల్లలు తులసి మొక్కల లాంటివారు. వారికి విలువలనే గంగా జలంతో పోషించాలని అన్నారు.
Tags : 1