Breaking News

‘సేవా తీర్థ్‌’లోకి మోదీ 

Published on Sat, 02/14/2026 - 04:24

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్‌ కాలం నాటి సౌత్‌ బ్లాక్‌ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్‌’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్‌ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 

మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. సేవా తీర్థ్‌తోపాటు కర్తవ్య భవన్‌–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్‌ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్‌ అని లిఖించగా, దాని కింద నాగరిక్‌ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. 

సేవా తీర్థ్‌ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్‌ స్టాంప్‌ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్‌’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్‌కు సంతకం చేశారు.

 లఖ్‌పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్‌పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  పీఎం రాహత్‌ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. 

మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్‌పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్‌పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. 

అధికారులకు టార్గెట్‌ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌(ఎఫ్‌ఓఎఫ్‌) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు.   

బ్రిటిష్‌ ఆనవాళ్లకు మంగళం  
ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్‌లో కొలువు దీరగా, కేబినెట్‌ సెక్రెటేరియట్‌ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్‌–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్‌ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు.

 ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్‌ భవనంతోపాటు సేవా తీర్థ్‌ భవనం నిర్మించారు. రాజ్‌పథ్‌ పేరును కర్తవ్య పథ్‌గా మార్చారు. బ్రిటిష్‌ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్‌గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్‌ కోర్స్‌ రోడ్‌ను కూడా లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్‌ భవన్‌లను లోక్‌ భవన్‌లుగా, లోక్‌ నివాస్‌లుగా మార్చేసింది.  

వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో మైలురాయి: మోదీ
సేవా తీర్థ్‌, కర్తవ్య భవనాలు వికసిత్‌ భారత్‌ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్‌, కర్తవ్య భవన్‌–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. 

ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లు బ్రిటిష్‌ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్‌, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)