Breaking News

అడవుల్లో చివరి వేట.. గణపతి ఎక్కడ?

Published on Wed, 07/29/2026 - 13:47

అడవుల్లో తుపాకుల శబ్దం తగ్గుతోంది... కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మారుమోగుతోంది. ఒకప్పుడు దేశాన్ని వణికించిన మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేతలు ఇప్పుడు ఎక్కడ?, ఆపరేషన్ ‘కగార్’ దెబ్బకు ఒక్కొక్కరుగా కీలక నేతలు మరణించగా, మరికొందరు లొంగిపోయారు. ఒకప్పుడు అజేయంగా భావించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పుడు దాదాపు చెల్లాచెదురైంది. మరి ఒకప్పుడు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన గణపతి ఇంకా జీవించి ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? సంస్థను ఇంకా నడిపిస్తున్నారా? లేక మావోయిస్టు ఉద్యమం నిజంగానే చివరి అధ్యాయానికి చేరుకుందా? ఇప్పుడు భద్రతా వర్గాల్లో ఇదే ప్రధాన చర్చ.

ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్‌గా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడింది. నాలుగు దశాబ్దాలుగా మధ్య భారత అటవీ ప్రాంతాలను తమకు అడ్డాగా మార్చుకున్న మావోయిస్టు సంస్థపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, అగ్ర నాయకుల మరణాలతో ఒకప్పుడు దేశాన్ని వణికించిన సీపీఐ (మావోయిస్టు) సంస్థ ఇప్పుడు తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

కగార్ అంటే?
‘కగార్’ అంటే హిందీలో అంచు, చివరి దశ అనే అర్థం. మావోయిస్టులను వారి చివరి స్థావరాల వరకూ వెంబడించి, ఆయుధ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం, నాయకత్వాన్ని బలహీనపరచడం, అడవుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్తరించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, అబుజ్‌మాద్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా, నారాయణ్‌పూర్, కాంకేర్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు అడవుల్లో కేంద్ర బలగాలు, కోబ్రా కమాండోలు, రాష్ట్ర పోలీసు ప్రత్యేక దళాలు సంయుక్తంగా భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.

ఒకప్పుడు 200కు పైగా జిల్లాలు.. 
2000 దశకంలో మావోయిస్టుల ప్రభావం 200కు పైగా జిల్లాల వరకు విస్తరించిందని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వరకు ‘రెడ్ కారిడార్’ పేరుతో విస్తరించిన ఈ ఉద్యమం ప్రస్తుతం ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికే పరిమితమైందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.

కీలక నేతలంతా మృతి.. 
మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న పలువురు అగ్రనేతలు గత కొన్నేళ్లలో భద్రతా బలగాల ఆపరేషన్లలో మరణించారు. మరికొందరు సంస్థ నుంచి వైదొలగి పోలీసులకు లొంగిపోయారు.

చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్)
సీపీఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యుడు. 2010లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సంస్థకు రాజకీయ, సిద్ధాంతపరమైన ముఖచిత్రంగా గుర్తింపు పొందాడు.

కోటేశ్వరరావు (కిషన్‌జీ)
పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ప్రధాన వ్యూహకర్త. 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఆపరేషన్‌లో మరణించాడు.

నంబాల కేశవరావు (బసవరాజు)
ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) తర్వాత సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజు, 2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ భద్రతా ఆపరేషన్‌లో మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మావోయిస్టు ఉద్యమానికి అతిపెద్ద దెబ్బగా అధికారులు పేర్కొన్నారు.

హిడ్మా..
మోస్ట్‌ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వీ హిడ్మా.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా మృతి చెందాడు. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.

గణపతి ఎక్కడ?
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి ప్రధాన సిద్ధాంతకర్తగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత నాయకత్వ బాధ్యతలను బసవరాజుకు అప్పగించారు. ప్రస్తుతం గణపతి సంస్థలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయంపై అధికారిక సమాచారం లేదు. గణపతి మాత్రమే మిగిలిన అగ్రనాయకుడు అనే వాదన ప్రచారంలో ఉంది.

చివరి అధ్యాయమా?
భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మావోయిస్టు ఉద్యమం గతంతో పోలిస్తే గణనీయంగా బలహీనపడింది. అయినప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇంకా చిన్న చిన్న దళాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందుకే ఆపరేషన్ కగార్‌ను కేంద్రం ఇంకా కొనసాగిస్తోంది. ఇక, ఒకప్పుడు వేలాది మంది సాయుధ కేడర్‌, బలమైన కేంద్ర కమిటీ, విస్తృత 'రెడ్ కారిడార్'తో దేశ భద్రతకు సవాల్ విసిరిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తోందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఆపరేషన్ కగార్ దెబ్బకు నాయకత్వం చెల్లాచెదురవడం, అడవుల్లో భద్రతా బలగాల ఆధిపత్యం పెరగడం, కొత్తగా కేడర్‌ నియామకాలు తగ్గిపోవడం వంటి పరిణామాలు సంస్థ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం నిజంగానే చివరి అధ్యాయానికి చేరుకుందా? లేక మళ్లీ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తుందా? అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో జరిగే పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)