Breaking News

గగన్‌యాన్‌ వేళ ఇస్రోకు షాక్‌.. రాజీనామాల కలకలం

Published on Thu, 07/16/2026 - 12:23

చంద్రయాన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రోకు ఇప్పుడు మరో సవాల్‌ ఎదురైంది. గగన్‌యాన్‌ వంటి ప్రతిష్టాత్మక మిషన్లు ముందున్న సమయంలో.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల రాజీనామాలు చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలపై అప్రమత్తమైన కేంద్రం.. కీలక సిబ్బంది ఎగ్జిట్‌పై కట్టడి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల నిష్క్రమణ అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇస్రో వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు సంస్థను వీడి ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (URSC), తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC) నుంచి ఎక్కువ మంది నిపుణులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో ఉపగ్రహాలు, రాకెట్లు, మానవ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నట్లు సమాచారం.

అప్రమత్తమైన కేంద్రం
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష శాఖ (Department of Space) అప్రమత్తమైంది. గగన్‌యాన్‌ సహా దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి దరఖాస్తులను సాధారణంగా ఆమోదించకుండా.. ఉన్నత స్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇస్రో కేంద్రాలకు సూచించినట్లు తెలుస్తోంది.

ఇస్రో బలం కేవలం సాంకేతిక పరికరాలు కాదు.. వాటిని అభివృద్ధి చేసే శాస్త్రవేత్తల అనుభవం. ఒక రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడానికి వెనుక ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు, వందలాది పరీక్షలు, ఎన్నో వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. గగన్‌యాన్‌ మిషన్‌ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాదు.. భవిష్యత్‌లో భారత అంతరిక్ష కేంద్రం, మరిన్ని చంద్ర అన్వేషణ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు బయటకు వెళ్లడం సంస్థకు సవాల్‌గా మారింది. నిపుణుల స్థానాల్లో కొత్త వారిని నియమించడం సాధ్యమే అయినా.. ఒక నిర్దిష్ట మిషన్‌పై సంవత్సరాల పాటు పనిచేసిన వారి అనుభవాన్ని వెంటనే భర్తీ చేయడం అంత తేలిక కాదు.

నిష్క్రమణకు కారణం ఏంటంటే.. 
ఇస్రో నుంచి శాస్త్రవేత్తల నిష్క్రమణకు ప్రధాన కారణంగా ప్రైవేట్‌ స్పేస్‌ రంగం విస్తరణ కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో భారత్‌లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు అవకాశాలు పెరిగాయి. రాకెట్లు, ఉపగ్రహాలు, స్పేస్‌ టెక్నాలజీలపై పనిచేసే స్టార్టప్‌లు వేగంగా ఎదుగుతున్నాయి. ఇస్రోలో సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు ఈ సంస్థల్లో అధిక వేతనాలతో పాటు కొత్త ప్రయోగాల్లో భాగస్వామ్యం, నిర్ణయాధికారం, కొన్నిసార్లు సంస్థల్లో వాటాల అవకాశాలు కూడా లభిస్తున్నాయి. దీంతో కొందరు శాస్త్రవేత్తలు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇస్రోలో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం సంఖ్య కాదు.. నాణ్యత. ఒక ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త వెళ్లిపోతే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త వ్యక్తికి సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గగన్‌యాన్‌, ఇతర జాతీయ ప్రాధాన్యత కలిగిన మిషన్లలో పనిచేసే గ్రూప్‌-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలను నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖ పరిశీలించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని స్థాయిల వరకు ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. ఇప్పుడు కీలక మిషన్లకు సంబంధించిన సిబ్బంది విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇస్రో చీఫ్‌ ఏమన్నారంటే.. 
శాస్త్రవేత్తల రాజీనామాలపై ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ స్పందిస్తూ.. సంస్థ నుంచి ఉద్యోగులు వెళ్లడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, ఒకరి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కీలక ప్రాజెక్టులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్పేస్‌ రేసులో భారత్‌కు కొత్త పరీక్ష
అంతరిక్షంలో భారత్‌ కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతున్న వేళ.. ఇస్రోలో కొనసాగుతున్న ఈ టాలెంట్‌ ఎగ్జిట్‌ను సంస్థ ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రయాన్‌ విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. ఇప్పుడు గగన్‌యాన్‌ వంటి చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను నిలుపుకోవడం సంస్థ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)