Breaking News

గాంధీ నుంచి సోనమ్‌ వాంగ్‌చుక్‌ వరకు..

Published on Wed, 07/22/2026 - 07:42

దేశంలో ఆహార నిరాకరణ అనేది కేవలం ఒక నిరసన కానే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచే ఒక చరిత్రక మార్గం. అధికార పీఠాల ముందు న్యాయం కోసం గళమెత్తిన గొంతులు విస్మరణకు గురైనప్పుడల్లా, అహింసాత్మక ఆయుధమైన ‘నిరాహార దీక్ష’ వ్యవస్థల పునాదులను కదిలించింది. నాటి మహాత్మా గాంధీ ఆమరణ నిరాహార దీక్షలనుంచి నేటి  సోనమ్ వాంగ్‌చుక్ పోరాటం వరకు.. ఆహార పానీయాలను త్యాగం చేయడం అనేది  నైతిక బలానికి నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో చర్చనీయాంశంగా నిలిచిన చారిత్రక నిరాహార దీక్షలు..

ఇరోమ్ షర్మిల: అత్యంత సుదీర్ఘ పోరాటం 
మణిపూర్ ‘ఐరన్ లేడీ’గా  పేరొందిన ఇరోమ్ చాను షర్మిల.. 2000లో మాలోమ్‌లో జరిగిన మారణహోమం తర్వాత సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, చరిత్రాత్మక దీక్ష చేపట్టారు. ప్రపంచ చరిత్రలోనే ఇది సుదీర్ఘ నిరాహార దీక్షగా నమోదైంది. ఈ సమయంలో ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుని, ద్రవ ఆహారాన్ని అందిస్తూ ప్రాణాలు నిలిపింది. ఆగస్టు 2016లో ఆమె రాజకీయ మార్గంలో పోరాడేందుకు దీక్ష విరమించారు. ఈ పోరాటం వృథా పోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. దీని ప్రభావంతో తదంతర కాలంలో ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పాక్షికంగా తొలగించింది.

స్వామి నిగమానంద్: గంగానది రక్షణ కోసం
హరిద్వార్ వద్ద గంగానది ఉనికిని కాపాడేందుకు, అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్లకు వ్యతిరేకంగా మాతృసదన్‌కు చెందిన సంత్ స్వామి నిగమానంద్ 2011 ఫిబ్రవరి 19న దీక్ష ప్రారంభించారు. దాదాపు 115 రోజుల పాటు ఆహారం లేకుండా పోరాడిన ఆయన, 2011 జూన్ 13న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అత్యున్నత త్యాగం దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, పౌరులను కదిలించింది. ఇది సమాజంలో పర్యావరణ పరిరక్షణ భావనను బలంగా నాటింది.

జీడీ అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సానంద్)
ఐఐటీ కాన్పూర్ పూర్వ ప్రొఫెసర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మౌలిక విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జీడీ అగర్వాల్ గంగానది నిర్మలత్వం, నిరంతర ప్రవాహం కోసం ‘గంగా సంరక్షణ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ 2018 జూన్ 22న దీక్ష చేపట్టారు. 111 రోజుల కఠిన ఉపవాసం తర్వాత 2018 అక్టోబర్ 11న రుషీకేశ్‌లో ఆయన కన్నుమూశారు. ఒక విద్యావంతుడైన శాస్త్రవేత్త పర్యావరణం కోసం ప్రాణాలర్పించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి వినాశనంపై పెద్ద ప్రశ్నగా మారింది.

జతిన్ దాస్, భగత్ సింగ్: లాహోర్ జైలులో..
1929లో లాహోర్ సెంట్రల్ జైలులో స్వాతంత్య్ర సమరయోధులు జతిన్ దాస్, భగత్ సింగ్ వారి సహచరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. జైలులోని భారతీయ ఖైదీలపై జరుగుతున్న జాత్యహంకారం, అమానుష ప్రవర్తన, నాసిరకం ఆహారానికి నిరసనగా ఈ దీక్ష సాగింది. 63 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా పోరాడి, 1929 సెప్టెంబర్ 13న జతిన్ దాస్ ప్రాణాలర్పించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ఖైదీలకు రాజకీయ ఖైదీల హోదా ఇచ్చేందుకు, జైలు నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు దిగివచ్చింది.

మహాత్మా గాంధీ: సబర్మతి, యరవాడల నుంచి..
జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితకాలంలో 17 సార్లు  నిరాహారదీక్షలు చేశారు. అందులో 1933లో అస్పృశ్యతా నివారణ, దళితుల ఉద్ధరణకు మద్దతుగా చేసిన 21 రోజుల ఆత్మశుద్ధి ఉపవాసం అత్యంత ప్రధానమైనది. గాంధీజీకి నిరాహార దీక్ష కేవలం రాజకీయ ఒత్తిడి సాధనం కాదు. అది ఆత్మపరిశీలన, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అంతరాత్మ పిలుపు. ఆయన ఉపవాసాలు కుల అహంకారాన్ని దెబ్బతీసి, స్వాతంత్య్ర సంగ్రామంలో సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశాయి.

అన్నా హజారే: అవినీతికి వ్యతిరేకంగా..
2011లో న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే చేసిన నిరాహార దీక్ష దేశంలోని యువతను, మధ్యతరగతిని రోడ్లపైకి తెచ్చింది. దేశంలో అవినీతి నిరోధానికి బలమైన ‘జన్ లోక్‌పాల్ చట్టం’ తేవాలని డిమాండ్ చేస్తూ ఆయన 12 రోజులు చారిత్రక దీక్ష చేశారు. ఈ పోరాట ధాటికి పార్లమెంట్ ప్రత్యేక తీర్మానం చేయాల్సి వచ్చింది.

సోనమ్ వాంగ్‌చుక్
లద్ధాఖ్ పర్యావరణ వ్యవస్థ, స్థానికులకు ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ హక్కుల కల్పన కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేసిన పోరాటం మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష నీట్‌ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా సాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, యువతకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రారంభించిన ఈ ఉద్యమంలో సోనమ్ వాంగ్‌చుక్ చేరారు.

చట్టం ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగం శాంతియుత నిరసన తెలిపే హక్కును కల్పిస్తుంది. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. నిరసన వల్ల ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే పరిపాలనా యంత్రాంగం జోక్యం చేసుకోవచ్చు. దీక్ష చేపట్టినవారి ఆరోగ్యం క్షీణించిన సందర్భాల్లో వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. భారత్‌లోనే కాకుండా ఐర్లాండ్, బ్రిటన్, అమెరికా, టర్కీ వంటి అనేక దేశాల్లోనూ ఖైదీలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ సంస్థలు నిరాహార దీక్షలను ఆశ్రయించాయి.

ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)