Breaking News

గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్‌పై దాని నీడ పడితే..

Published on Mon, 06/08/2026 - 08:29

గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్‌ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్‌కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. 

వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్‌ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్‌ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్‌కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ఎల్‌ నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్‌లో వీచే ట్రేడ్‌ విండ్స్‌ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్‌ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్‌ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్‌ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్‌ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్‌ ఫోర్‌కాస్ట్‌ మోడళ్లు సూచిస్తున్నాయి.

అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్‌ ఎల్‌ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్‌ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్‌ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. 

భారత్‌పైనే ఎక్కువ ఎందుకు?
గాడ్జిల్లా ఎల్‌నినో గురించి భారత్‌ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.

సాధారణంగా ఎల్‌నినో సమయంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.

ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.

అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.

గతం ఏం చెబుతోందంటే..
1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్‌ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్‌ ఎల్‌ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్‌లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్‌కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (IOD). 1997లో బలమైన పాజిటివ్‌ IOD ప్రభావంతో ఎల్‌ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్‌ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.

ఎల్‌ నినోను భారత్‌ వర్షాకాలానికి విలన్‌గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్‌ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్‌ నినో వల్ల భారత్‌లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్‌ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్‌కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.

ప్రపంచంపై ప్రభావం..
అలాగని గాడ్జిల్లా ఎల్‌ నినో ప్రభావం భారత్‌కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్‌ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

కరువు ఖాయమేనా?
కచ్చితంగా కాదు. ఎల్‌ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్‌పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్‌ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. 

నోట్‌: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)