చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
కూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం!
Published on Fri, 10/30/2026 - 15:00
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్‌ను దర్శించుకుని తిరిగి డెహ్రాడూన్ వెళ్తుండగా భారత్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో పైలట్ (కెప్టెన్ హిమాన్షు)తో పాటు ఐదుగురు ప్రయాణికులు (వీరంతా బెంగళూరుకు చెందినవారు) దుర్మరణం చెందారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్-బద్రీనాథ్ మార్గంలో, జోషిమఠ్ సమీపంలోని చాయీ గ్రామం వద్ద ఈ హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు (సిగ్నల్) కోల్పోయింది. దట్టమైన మంచు, కురుస్తున్న భారీ వర్షమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైనట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో బద్రీనాథ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
మరణించిన వారిలో పైలట్ హిమాన్షు సభర్వాల్ (48) పశ్చిమ ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నివాసి. ప్రయాణికులు ప్రతాప్ బి. నింగరాజు (41), అరుణ్ సాలుంకే (44), సుధీర్ కె. (49), హెచ్.ఎస్. నటరాజ్ (51),శంకర్ గౌడ వి.బి. (39) వీరంతా బెంగళూరుకు చెందినవారు. వీరిలో సాలుంకే పోలీసు అధికారి కాగా శంకర్ గౌడ న్యాయవాది.
ముమ్మరంగా సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర సహాయక బృందాలు, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ‘నేనే స్వయంగా ఈ మొత్తం ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు.
యాత్రికుల్లో ఆందోళన
కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం నుంచి ప్రయాణికులను తీసుకువెళ్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటన యాత్రికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి : జడ్జి కుమారుడి నిర్వాకం .. కొచ్చి పోలీస్ కమిషనర్ బదిలీ!
Tags : 1