అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ
Breaking News
రాజీనామా యోచనలో మహారాష్ట్ర గవర్నర్?
Published on Mon, 01/23/2023 - 18:28
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి(80) రాజీనామాకు సిద్ధం అవుతున్నారా?.. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే వెల్లడించడం గమనార్హం. తాను గవర్నర్ హోదా నుంచి హుందాగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారట. సోమవారం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది మహారాష్ట్ర రాజ్‌భవన్.
ప్రధాని మోదీ తాజాగా(జనవరి 19వ తేదీన) ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానితో తాను గవర్నర్ హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్న విషయాన్ని చెప్పినట్లు గవర్నర్ కోష్యారి తెలిపారు. అంతేకాదు.. మరేయితర రాజకీయ బాధ్యతలు కూడా తనకు కేటాయించొద్దని ఆయన ప్రధానిని కోరారట. బీజేపీ సీనియర్ నేత అయిన భగత్ సింగ్ కొష్యారి.. వయో భారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన శేష జీవితాన్ని పుస్తక పఠనం, సాహిత్య రచనతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.
ప్రధాని మోదీకి తానంటే ఎంతో అభిమానమని, కాబట్టి తాను తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగానే స్పందిస్తారని భావిస్తున్నట్లు కోష్యారి ఆ ప్రకటనలో వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేయడాన్ని తానెంతో గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన.
ఆరెస్సెస్ మూలాలు ఉన్న కోష్యారి.. గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీతో పాటు అదనంగా మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఉత్తరాఖండ్‌కు రెండో ముఖ్యమంత్రిగా, ఆపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, నైనిటాల్-ఉధమ్‌సింగ్ నియోజకవర్గం తరపున ఒకసారి లోక్‌సభకూ ఆయన ఎన్నికయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న టైంలో ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగతంగానూ ఆయన్ని ఇబ్బంది పెట్టిన కామెంట్ ఒకటి ఉంది. మహారాష్ట్ర నుంచి గుజరాతీలను, రాజస్థానీ మార్వాడీలను గనుక వెళ్లగొడితే.. ముంబైకి దేశ ఆర్థిక రాజధాని హోదా ఉండబోదని, డబ్బే మిగలదని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారాయన. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం ఆయనకు దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు వ్యవహారం పెద్దది అవుతుండడంతో.. ఆయన మరాఠ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఆపై కిందటేడాది నవంబర్‌లో.. ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత తరం ఐకాన్ అని, ఈ తరం వాళ్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లే ఐకాన్ అంటూ వ్యాఖ్యానించి.. మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు.
Tags : 1