ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ
Breaking News
బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ
Published on Wed, 07/02/2025 - 05:32
కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయింది. చూసినవాళ్లకు చూసినన్ని అన్నట్లుగా ఈ ఆరు నెలల్లో స్ట్రయిట్ మూవీస్100కి పైగా రిలీజ్ అయ్యాయి. కానీ వందలో హిట్ అంటే పది శాతమే. కోట్లు బడ్జెట్ పెట్టి గ్రాండ్‌గా తీసినంత మాత్రాన వసూళ్లు కూడా గ్రాండ్‌గా ఉంటాయనుకుంటే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డట్టే. ‘బడ్జెట్ కాదు... సబ్జెక్ట్ ముఖ్యం’ అనే పంథాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది. 2025లో హిట్ అయిన చిత్రాలతోపాటు భారీ అంచనాల మధ్య థియేటర్‌కి వచ్చి, నిరాశపరిచిన పెద్ద చిత్రాల గురించి ఓ రౌండప్.
⇒ 2025 సినిమా బాక్సాఫీస్ బోలెడన్ని అంచనాలతో మొదలైంది. జనవరిలో దాదాపు పదిహేను చిత్రాలు విడుదల కాగా... రెండంటే రెండే హిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి పండగకి ముందుగా వచ్చిన చిత్రం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై, అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆ వెంటనే వచ్చిన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా ఎబౌ యావరేజ్ హిట్‌గా నిలిచింది.
బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతికి మంచి హిట్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. కాగా ఈ సీజన్‌లో ‘గేమ్ చేంజర్’ రూపంలో నష్టాలు చవి చూసిన ‘దిల్’ రాజుకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త ఊరటనిచ్చింది.
⇒ ఫిబ్రవరిలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలైతే, ‘తండేల్’ సినిమా రూపంలో ఒకే ఒక్క హిట్ దక్కింది. అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. శ్రీకాకుళం మత్స్యకారుల్లోని కొందరి జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో నాగచైతన్య తొలిసారి వంద కోట్ల క్లబ్‌లో చేరారు.
⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు విడుదల కాగా, రెండు శాతం హిట్ దక్కింది. ఈ హిట్టయిన రెండు సినిమాలూ భారీ బడ్జెట్ కాదు... భారీ స్టార్స్ కూడా లేరు. నూతన తారలు రోషన్, శ్రీదేవి జంటగా, ప్రియదర్శి ప్రధానపాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘కోర్ట్’ చిన్న సినిమాగా రిలీజై, సక్సెస్‌పరంగా పెద్ద సినిమా అనిపించుకుంది.
కంటెంట్ ఉంటే స్టార్స్, భారీ బడ్జెట్ అవసరం లేదనడానికి ‘కోర్ట్’ ఓ తాజా ఉదాహరణ. అలాగే హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ అంచనాలు అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
⇒ ఈ ఏడాది వేసవికి టాలీవుడ్ బాక్సాఫీస్ చల్లబడింది. ఏప్రిల్‌లో రిలీజైన ఏ సినిమా ఆడియన్స్‌తో క్లాప్ కొట్టించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హిరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘జాక్’ ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే ప్రదీప్ మాచిరాజు హీరోగా మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’ చిత్రం మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి నితిన్–భరత్ దర్శకులు. ఇదే నెలలో వచ్చిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘ఓదెల 2’, కల్యాణ్‌రామ్–విజయశాంతిల యాక్షన్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్‌తేజ్ దర్శకత్వంలో డి. మధు, సంపత్ నంది నిర్మించిన చిత్రం ‘ఓదెల 2. ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రాన్ని నిర్మించారు. ‘కోర్ట్’ వంటి సూపర్‌హిట్ తర్వాత ప్రియదర్శి హీరోగా ‘సారంగపాణి జాతకం’ సినిమా వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం హిట్ కాలేదు. ఇలా ఏప్రిల్ పూర్తిగా నిరాశ పరిచింది.
⇒ మే నెల తొలి రోజే ‘హిట్: ది థర్డ్ కేస్’తో ప్రేక్షకులను పలకరించారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టే హిట్ అయింది. ఇక శ్రీవిష్ణుకి ‘సింగిల్’ సినిమా రూపంలో మరో సూపర్‌హిట్ లభించింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలకపాత్రలో మెప్పించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. నూతన తారలు నటించిన ఈ చిత్రంలో సమంత అతిథిపాత్ర చేశారు. ‘శుభం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచిపోయింది. ఇక నవీన్‌చంద్ర ‘లెవన్’, రాజేంద్రప్రసాద్–అర్చన–రూపేష్–ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్‌లో చేసిన ‘షష్టిపూర్తి’, తమిళ హిట్ ఫిల్మ్ ‘గరుడన్’ రీమేక్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్–నారా రోహిత్– మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించే ప్రయత్నంలో తడబడ్డాయి. ‘లెవన్’ సినిమాకు లోకేశ్ అజ్ల్సస్, ‘భైరవం’కు విజయ్ కనకమేడల, ‘షష్టిపూర్తి’కి పవన్‌ప్రభ దర్శకత్వం వహించారు.
⇒ నార్నే నితిన్ హీరోగా రూపొందిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ తొలి వారంలో వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు ఈ సినిమాను నిర్మించారు. ఇక జూన్ మూడో వారంలో ధనుష్–నాగార్జున–రష్మికా మందన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘కుబేర’ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్‌కు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాను పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మించారు. అయితే ‘కుబేర’ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళంలో ఆదరణ దక్కలేదు. ఈ చిత్రం విడుదలైన రోజే అనంతిక సనీల్‌కుమార్–హను రెడ్డి–రవితేజ దుగ్గిరాల లీడ్ రోల్స్‌లో నటించిన మీడియమ్ రేంజ్ సినిమా ‘8 వసంతాలు’ అలరించలేకపోయింది.
ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ చివర్లో విష్ణు మంచు కలల ్రపాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలైంది. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్‌కుమార్, ఆర్. శరత్‌కుమార్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ రూపంలో విష్ణు చెంత ఓ మంచి హిట్ చేరింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎమ్. మోహన్‌బాబు ‘కన్నప్ప’ను నిర్మించారు. ఇలా ఈ ఏడాది ప్రథమార్ధం తొమ్మిది హిట్స్‌తో సరిపెట్టుకుంది. ‘మంచిని ఆశిద్దాం’ అంటారు కాబట్టి ద్వితీయార్ధం హిట్స్‌తో కళకళలాడాలని కోరుకుందాం.
Tags : 1