లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా?
Published on Wed, 09/02/2026 - 16:28
ఒకప్పుడు ఓ భాషలో సినిమా హిట్ అయిందంటే చాలు.. మరో భాషలో రీమేక్ చేసేందుకు పోటీ పడేవారు. కథ నచ్చితే చాలు స్టార్ హీరోలు సైతం రీమేక్‌లకు సై అనేవారు. అయితే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కంటే.. అదే సినిమాను డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేయడానికే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఓ సూపర్‌హిట్ గుజరాతీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర కోసం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రూ.50 లక్షలతో సినిమా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు
గత ఏడాది గుజరాతీలో విడుదలైన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అదే దక్షిణాదిలో అయితే రూ.50 లక్షలతో సినిమా తీయడం సంగతి పక్కన పెడితే.. ఆ మొత్తంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కూడా కష్టమేననే కామెంట్లు వినిపించాయి.ఈ నేపథ్యంలో ‘లాలో’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఈ రీమేక్‌లో కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రను రామ్ చరణ్‌తో చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘లాలో’ కథేంటి?
‘లాలో – కృష్ణ సదా సహాయతే’ కథ విషయానికొస్తే.. లాలో అనే ఆటో డ్రైవర్ తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల భార్యతో గొడవపడి తీవ్రంగా కుంగిపోతాడు. జీవితంలో ఎదురైన సమస్యలను మర్చిపోవడానికి చెడు అలవాట్లకు బానిసవుతాడు. పరిస్థితులు మరింత దిగజారడంతో ఓ నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకుంటాడు. అలాంటి సమయంలో మనిషి రూపంలో శ్రీకృష్ణుడు అతని జీవితంలోకి వస్తాడు. లాలోతో స్నేహం చేస్తూ.. అతని జీవితాన్ని నెమ్మదిగా మార్చే ప్రయత్నం చేస్తాడు. పైకి చూస్తే చాలా సింపుల్‌గా అనిపించే కథే అయినప్పటికీ.. భావోద్వేగాలను బలంగా పండిస్తూ, కథలో మంచి లోతును చూపించడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రానికి అంకిత్ సకియా దర్శకత్వం వహించారు. ఎమోషనల్ కంటెంట్ ప్రధాన బలంగా నిలవడంతో చిన్న సినిమా కాస్తా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
తమిళ దర్శకుడికి రీమేక్ బాధ్యతలు?
తెలుగు రీమేక్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేరును టీమ్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ చరణ్ నిజంగానే నటిస్తారా? లేదా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెడతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. చరణ్ ఓకే చెప్పిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘పెద్ది’ తర్వాత కొంత విరామం తీసుకున్న చరణ్.. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్సీ 17’ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇలాంటి సమయంలో ‘లాలో’ రీమేక్ చర్చ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.గతంలో రీమేక్ సినిమాలు టాలీవుడ్లో ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో రీమేక్‌లకు దాదాపుగా కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ రీమేక్ రిస్క్ చేస్తాడా? ‘లాలో’ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెక్ అవుతాయి? శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్ కనిపిస్తారో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Tags : 1