Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
సినిమా టికెట్ ధర రూ. 200 దాటొద్దు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
Published on Wed, 07/16/2025 - 09:48
సినిమా టికెట్ ధరలు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనియాంశంగా ఉంటుంది. ఈ విషయంలో మన పొరుగు రాష్ట్రం కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కర్ణాటకలో విడుదలైన సినిమా బడ్జెట్ ఎంతైనా సరే టికెట్ ధర రూ. 200కు మించి ఉండకూడదని కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌తోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ ఇదే వర్తించనుందని పేర్కొంది. ఇతర భాష చిత్రాలకు కూడా ఇదే వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
కన్నడ చిత్ర పరిశ్రమ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 బడ్జెట్ ప్రసంగంలో మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రతి షో టికెట్ ధరను రూ. 200కి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సామన్య ప్రజల నుంచి కన్నడ ప్రభుత్వంపై అభినందనలు వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులో వీకెండ్ టికెట్ రేట్లు భారీగా ఉంటాయి. ఏకంగా ఒక్కొ టికెట్ ధర రూ. 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. దీంతో అక్కడ తీవ్రంగా వ్యతిరేఖత వచ్చింది. ఇప్పుడు ఈ దెబ్బతో రూ. 200 రూపాయలకు టికెట్ ధర రానుంది. అయితే, పాప్ కార్న్ వంటి స్నాక్స్ ధరలను కూడా తగ్గించాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ
సినిమా టికెట్ ధరలను ఇప్పుడు ఒక్కో రాష్ట్రం తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు కూడా ఇదే బాటలో అడుగులేస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేట్లు కాస్త ఎక్కువే వున్నాయి. పైగా స్పెషల్ షోలు, ప్రీమియర్లు అంటూ అదనపు రేట్లు వాయించేస్తున్నారు. ఈ అంశం మీద ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా కూడా చాలా చర్చలు నడిచాయి. కోర్టు కేసులు కూడా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ ధరలు అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
సినీ పరిశ్రమ బతకాలన్నా, థియేట్రికల్ వ్యవస్థ కళకళలాడాలన్నా టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో తొలిసారి టికెట్ రేట్లను తగ్గించారు. అయితే, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి నచ్చలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అంటూ పలు వేదికల మీద వారే మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు కూడా టికెట్ ధరలు నియంత్రించే పనిలో ఉండటంతో గతంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఇదే కదా అంటూ గుర్తుచేస్తున్నారు. టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో వుండాలి అనేది జనం మాట.. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు అదనంగా పెంచుకుంటూ పోతే జనం థియేటర్కు దూరం అయిపోతారనేది థియేటర్ యజమానులు చెప్పే మాట. కానీ, నిర్మాతలు వాదన మరోలా ఉంటుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేశాం.. ఆ డబ్బు అంతా మొదటి వారంలోనే రావాలని ఆశిస్తారు.
Tags : 1