Breaking News

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో బీఎన్‌పీ హవా

Published on Fri, 02/13/2026 - 05:03

ఢాకా: పదవీచ్యుత బంగ్లాదేశ్‌ మహిళా ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఆ దేశంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా వైరి పార్టీ ‘బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) హవా కొనసాగుతోంది. 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో 299 స్థానాలకుగాను గురువారం పోలింగ్‌ జరిగింది. సాయంత్రానికి పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు ఆరంభించారు. ఇందులో కడపటి వార్తలు అందేసరికి 175కు పైగా స్థానాల్లో బీఎన్‌పీ పార్టీ ముందంజలో ఉంది. 

67 ఏళ్ల షఫీకుర్‌ రెహమాన్‌ సారథ్యంలోని జామాతే ఇస్లామీ కూటమి కేవలం 30 స్థానాల్లో ముందంజలో ఉంది. 15 ఏళ్ల తర్వాత తమ పార్టీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని బీఎన్‌పీ పార్టీ చైర్మన్‌ తారిఖ్‌ వ్యాఖ్యానించారు. నెలల తరబడి మొహమ్మద్‌ యూనుస్‌ తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులపై దాడులు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న దేశంలో ఇకనైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుతీరుతుందన్న ఆశతో కోట్లాది మంది బంగ్లాదేశీ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నానికి 48 శాతం పోలింగ్‌ 
స్థానిక కాలమానం ప్రకారం నాలుగున్నర గంటలకు పోలింగ్‌ ముగిసింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు 48 శాతం పోలింగ్‌ నమోదైందని ప్రభుత్వ బీఎస్‌ఎస్‌ వార్తాసంస్థ ప్రకటించింది. అప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగే ఆస్కారముంది. ఓట్ల లెక్కింపు తర్వాత తుది ఫలితాలను శుక్రవారం వెల్లడిస్తామని ఎలక్షన్‌ అధికారులు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు దేశ రాజ్యాంగ సవరణ కోరుతూ 84 అంశాలతో రెఫరెండం సైతం నిర్వహించారు. ఈ రెఫరెండంకు జూలై నేషనల్‌ చార్టర్‌ అని పేరుపెట్టారు. 

పదవీచ్యుత షేక్‌ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ పార్టీని ఈసారి ఎన్నికల నుంచి బహిష్కరించడంతో తారిఖ్‌ రెహమాన్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ), జామాతే ఇస్లామీ కూటమిల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. జామాతే ఇస్లామీ కూటమిలో 11 పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. 2024లో ఉద్యమాన్ని లేవదీసిన విద్యార్థి సంఘాలు ఏర్పాటుచేసిన నేషనల్‌ సిటిజెన్‌ పార్టీ(ఎన్‌సీపీ) సైతం జామాతే ఇస్లామీ కూటమిలో భాగస్వామిగా ఉంది. శాంతియుతంగా పోలింగ్‌లో పాల్గొన్నందుకు ఓటర్లకు తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్‌ యూనుస్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘ ఈ ఎన్నికలు, రెఫరెండం అనేవి చరిత్రాత్మకమైనవి. ఒకరకంగా కొత్త బంగ్లాదేశ్‌ పుట్టినరోజు ఇది’’ అని యూనుస్‌ వ్యాఖ్యానించారు. మాజీ మహిళా ప్రధానమంత్రి, దివంగత ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ పార్టీ చైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌ ఢాకా–17, బోగ్రా–6 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. జమాతే చీఫ్‌ షఫీకుర్‌ ఢాకాలోని నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఖుల్నాలో బీఎన్‌పీ అభ్యర్థి అలీ అస్ఘర్‌ లోబీ చేతిలో జమాతే ప్రధాన కార్యదర్శి మియా గోలం పోర్వార్‌ ఓటమిపాలయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఓడిపోయినా సరే ఫలితాలను అంగీకరిస్తామని బీఎన్‌పీ, జమాతే నేతలు వ్యాఖ్యానించడం విశేషం. 

300 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా ఒక స్థానంలో అభ్యర్థి ఆకస్మిక మరణంతో మిగతా 299 నియోజకవర్గాలకే గురువారం పోలింగ్‌ చేపట్టారు. దేశవ్యాప్తంగా 42,779 పోలింగ్‌ కేంద్రాల్లో 50 లక్షల మంది తొలిసారి ఓటర్లు సహా దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు ఓటేసేందుకు తమ పేరును నమోదుచేసుకున్నారని ఎన్నికల అధికారులు గతంలోనే ప్రకటించారు. ఈసారి 50 రాజకీయ పార్టీలకు చెందిన 1,755 అభ్యర్థులతో పాటు మరో 273 మంది స్వతంత్రులు ఈసారి పోటీపడ్డారు. 15 ఏళ్లపాటు దేశాన్ని పరిపాలించిన హసీనా, అవామీ లీగ్‌ పార్టీ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈమె పార్టీ చిహ్నమైన పడవ తొలిసా రిగా బ్యాలెట్‌ పత్రాల నుంచి మాయమైంది. 

పలు చోట్ల ఉద్రిక్తత..
పలు పోలింగ్‌కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. నాలుగు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో 9 మంది చనిపోయారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. గోపాల్‌గంజ్‌లో పోలింగ్‌కేంద్రం సమీపంలో హ్యాండ్‌బాంబ్‌ పేలిన ఘటనలో 13 ఏళ్ల బాలిక గాయపడింది. ఘర్షణలు జరిగిన చోట్ల డజన్ల మందిని అదుపులోకి తీసుకున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)