Breaking News

మోదీ  సైప్రస్‌ యాత్ర...తుర్కియేకు గట్టి హెచ్చరిక! 

Published on Tue, 06/17/2025 - 06:02

ప్రపంచ దేశాల్లో మనవారెవరు, పరాయివారెవరు అన్నదానిపై ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌కు బాగా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా తుర్కియే నైజం పూర్తిస్థాయిలో బయటపడింది. అప్పట్లో భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా స్పందించి అన్నివిధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్‌ పట్ల సిందూర్‌ వేళ తుర్కియే అక్షరాలా విషం కక్కింది. పాకిస్తాన్‌కు డ్రోన్లతో పాటు అన్నివిధాలా సాయుధ సాయం చేసి మనపట్ల కృతఘ్నత ప్రదర్శించింది. 

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది యాదృచ్చికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కియేకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆదివారం మోదీ సైప్రస్‌లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

 ఈ ఎంపిక వెనక పలు భౌగోళిక, రాజకీయ ప్రాథమ్యాలు దాగున్నాయి. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ ఆహ్వానం మేరకు మోదీ ఈ యాత్ర చేపట్టారు. అంతేగాక విమానాశ్రయంలో మోదీని ఆయన స్వయంగా స్వాగతించారు. సైప్రస్‌ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. తద్వారా భారత్‌తో మైత్రీ బంధానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక వ్యాపార దిగ్గజాల సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రధాని సైప్రస్‌ యాత్రకు పలు రకాలుగా ప్రాధాన్యముంది. 

ఉగ్రపోరులో దన్ను 
కశ్మీర్‌ విషయంలో తుర్కియే తొలి నుంచీ పాక్‌కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సిందూర్‌ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలినుంచీ మెతక వైఖరే. కానీ సైప్రస్‌ అలా కాదు. కశ్మీర్‌ విషయంలో ఎప్పుడూ భారత్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటినుంచీ పూర్తిగా దన్నుగా నిలిచింది.

 పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్‌ యూనియన్‌ వేదికపై ఎండగడతానని హమీ ఇచ్చింది. ఈ విషయమై ఈయూ దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది. 

ఈ నేపథ్యంలో సైప్రస్‌ మద్దతు భారత్‌కు చాలా కీలకం. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్‌–అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు సైప్రస్‌ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనడంలో అంతరార్థం కూడా అదే. పహల్గాం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తోడు నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞత తెలిపేందుకు తాజా మూడు దేశాల పర్యటన చక్కని అవకాశమని మోదీ ప్రకటించారు కూడా. 

తుర్కియేతో వైరం 
వీటికి తోడు తుర్కియేతో సైప్రస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్‌ను ఆక్రమించాలని గ్రీస్‌ ఎప్పటినుంచో ప్రయతి్నస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్‌ పూర్తిగా సహకరించింది. అదే అదనుగా తుర్కియే మరోవైపు నుంచి సైప్రస్‌పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు.  

వర్తక పరంగానూ... 
అంతేగాక మోదీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్‌తో సైప్రస్‌ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్‌–పశ్చిమాసియా–యూరప్‌ ఆర్థిక కారిడార్‌లో భౌగోళికంగా సైప్రస్‌ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్‌ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్‌ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టుల్లో సైప్రస్‌ కీలక భాగస్వామి కూడా.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)