Breaking News

నెతన్యాహుకు మరో ఎదురు దెబ్బ

Published on Sun, 11/08/2026 - 07:25

ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఐసెన్‌కోట్‌ను తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ఆహ్వానం పంపించారు. 

దీంతో ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో అధికారం ఎవరికి దక్కుతుందనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెతన్యాహు రాజకీయ భవితవ్యానికి ఈ పరిణామం కీలక పరీక్షగా మారింది. ఇవాళ(ఆదివారం) అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో హెర్జోగ్‌ అధికారికంగా ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజుల సమయం పొడిగించవచ్చు.

ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని కూటమి అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచినప్పటికీ.. పార్లమెంట్‌లో మెజారిటీ సాధించలేకపోయింది. మరో వైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మద్దతు ఏ కూటమికీ స్పష్టంగా లేకపోవడంతో ఇజ్రాయెల్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు రానున్న వారాల్లో కీలక చర్చలు జరగనున్నాయి.

ఇజ్రాయెల్‌ అధ్యక్ష పదవి ప్రధానంగా లాంఛనప్రాయమైనదే అయినప్పటికీ.. ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి తొలి అవకాశం ఇవ్వాలనే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌ (నెస్సెట్‌)లో ఎన్నికైన పార్టీలతో అధ్యక్షుడు హెర్జోగ్‌ సంప్రదింపులు జరిపారు. ఈ ప్రక్రియలో ఐసెన్‌కోట్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ కథనం ప్రకారం.. ప్రధానిగా ఐసెన్‌కోట్‌ పేరును 67 మంది ఎంపీలు సిఫార్సు చేయగా.. నెతన్యాహుకు 46 మంది మద్దతు తెలిపారు.

‘‘ఐసెన్‌కోట్‌ను అధ్యక్ష భవనానికి ఆహ్వానించాం. రేపు ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు బాధ్యతలు అప్పగించనున్నాం’’ అని అధ్యక్షుడి అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ 67 మంది ఎంపీల మద్దతు అంటే ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉన్నట్లు కాదు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం మాత్రమే లభించింది. సంక్లిష్టమైన రాజకీయ సమీకరణాల మధ్య ఆయన మెజారిటీని ఎలా కూడగడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఆయన కూటమికి మొత్తం 53 స్థానాలే లభించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీకి ఇంకా ఎనిమిది స్థానాలు తక్కువయ్యాయి. మరోవైపు ఐసెన్‌కోట్‌కు చెందిన యాషర్‌ పార్టీ 21 స్థానాలు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆయన నేతృత్వంలోని నాలుగు పార్టీల కూటమికి 48 స్థానాలున్నాయి. ఇజ్రాయెల్‌లోని అరబ్‌ మైనారిటీకి ప్రాతినిధ్యం వహించే రెండు పార్టీలు కలిపి 19 స్థానాలు సాధించాయి. అధ్యక్షుడితో సంప్రదింపుల సందర్భంగా అవి ఐసెన్‌కోట్‌కు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌ ముందు పలు మార్గాలున్నాయి. అరబ్‌ ఎంపీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒకటి. గతంలో నెతన్యాహుకు మద్దతుగా నిలిచిన అల్ట్రా ఆర్థడాక్స్‌ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో మార్గం. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌తో కలిసి విస్తృత ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంకో అవకాశం. అయితే చివరి మార్గానికి ప్రధాన అడ్డంకి ఉంది. నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండబోనని  ఐసెన్‌కోట్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

కాగా, ఐసెన్‌కోట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే మరో నేతకు అవకాశం ఇవ్వవచ్చు. ఈ ప్రయత్నం కూడా విఫలమైతే పార్లమెంట్‌ సభ్యులు మరో అభ్యర్థిని ప్రతిపాదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇజ్రాయెల్‌కు సుమారు 100 రోజుల గడువు ఉంది. ఈ వ్యవధిలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు.

ఐసెన్‌కోట్‌ పేరును అధ్యక్షుడు ప్రతిపాదించడంపై నెతన్యాహు ఇప్పటికే ఎదురుదాడికి దిగారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అరబ్‌ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారితో కలిసి వచ్చే వారమే హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొందరు చూస్తున్నారు’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

‘‘ఇజ్రాయెల్‌ దేశాన్ని అంతం చేయాలని కోరుకునే వారితో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు’’ అని విమర్శించారు. అరబ్‌ పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం హమాస్‌ను ఎదుర్కోలేదని, ఇజ్రాయెల్‌ సైనికులను కాపాడలేదని ఆరోపించారు.

ఇదీ  చదవండి: తీవ్ర సంక్షోభంలో పరాగ్వే

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)