ఇండోనేసియా చేతికి బ్రహ్మోస్‌!

Published on Wed, 07/08/2026 - 04:23

జకార్తా: భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ ఇకపై మిత్రదేశం ఇండోనేసియా సైనిక పాటవాన్ని సైతం ద్విగుణీకృతంచేయనుంది. ఇరుదేశాల రక్షణ బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రహ్మోస్‌ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరాచేసేందుకు భారత్‌ మంగళవారం సమ్మతి తెలుపుతూ ఒప్పందం కుదుర్చుకుంది. గగనతలం నుంచి ప్రయోగించి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని సైతం ఇండోనేసియాకు సరఫరాచేయనున్నారు.

ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియంతోతో విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్కు సరఫరా మొదలు, సముద్రప్రాంత భద్రత, ఔషధాలు, విద్య, అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, టెలీకమ్యూనికేషన్స్, ఆహార భద్రత, అత్యంత అరుదైన లోహాలు, భూఅయస్కాంతాల వంటి ప్రధాన రంగాల్లో 14 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత సంయుక్త ప్రకటనలో మోదీ మాట్లాడారు. ఇకపై ఇరుదేశాల బంధంలో సువర్ణాధ్యాయం ఆరంభంకానుందని వ్యాఖ్యానించారు.

బ్రహ్మోస్, అస్త్ర ఇలా రెండు రక్షణ రంగ కీలక ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి దాదాపు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రధాని మోదీ సమక్షంలో కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్‌ సైన్యాన్ని బెంబేలెత్తించిన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల సత్తా చూశాక వీటి కొనుగోలుకు ఇండోనేసియా ఆసక్తి చూపడంతో వీటిని సరఫరాచేసేందుకు భారత్‌ తన సమ్మతి తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా తన భల్లూకం పట్టుబిగిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు దాని సమీప దేశాల సైనికసామర్థ్యాలను భారత్‌ ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇండోనేసియాకు భారత్‌ తన బ్రహ్మోస్‌ వంటి కీలక ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది.

‘‘ఇండో–పసిఫిక్‌లో భద్రతకు మా సమష్టి శక్తియుక్తులు ఎంతో అవసరం. ఆసియా దేశాలకు భారత్‌ సదా సముచిత స్థానం, గౌరవం ఇస్తుంది. హిందూసముద్రప్రాంతంలోని భారత ఇంటిగ్రేటెడ్‌ ఫ్యూజన్‌ సెంటర్‌లోకి ఇండోనేసియా లియేసన్‌ ఆఫీసర్‌ను ఇకపై పంపవచ్చు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం అనేది రక్షణ, భద్రత, సముద్రయానంలో సహకారాన్ని బలోపేతంచేస్తోంది. ఇకపై విపత్తు నిర్వహణ, పారిశ్రామికసహకారం సహా ఎన్నో రంగాల్లో మరింతగా సహకరించుకోబోతున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్‌ నౌకాశ్రయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి’’అని మోదీ ప్రకటించారు. ఈ పోర్ట్‌ భారత గ్రేట్‌ నికోబార్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌కు కేవలం 100 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. 

భారీస్థాయిలో పెట్టుబడులు... 
‘‘ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి సంబంధించిన ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్‌ పెట్టుబడుల వరద పారిస్తాం. నేటి ప్రపంచంలో ఉత్పత్తుల సరఫరా గొలుసు పటిష్టంగా ఉండటమనేది కీలకంగా తయారైంది. అందుకే ఇండోనేసియాలో అరుదైన మూలకాలు, స్టీల్‌ సరఫరా గొలుసు బలోపేతానికి కృషిచేస్తాం. దీనికితోడు ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్‌కు చెందిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) అనుసంధానమై అక్కడి పౌరులకు సేవలు అందిస్తాం. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతిపొందిన ఇరుదేశాల బంధం ఇప్పుడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.

సహకార రంగంతోపాటు అభివృద్ధి, భద్రత, సాంకేతిక, సాంస్కృతిక, విద్యరంగాల్లోనూ సువర్ణాధ్యాయం మొదలుకాబోతోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)బెంగళూరు శాఖను ఇండోనేసియాలోని ఈస్ట్‌ జావా ప్రావిన్స్‌లోని సింఘసారీ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లో ఆరంభించబోతున్నాం’’అని మోదీ తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణలో భారత్‌ సాధించిన అపార అనుభవం ఇండోనేసియాకు అక్కరకురానుంది. ఎన్నికల నిర్వహణతోపాటు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహన
ఒప్పందం కుదిరింది.  

మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం
ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికిగాను ఇండోనేసియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’తో సత్కరించింది. సుబియంతో స్వయంగా దీనిని మోదీకి ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘అవార్డ్‌ పొందటం ఎంతో గర్వంగా ఉంది. పురస్కారం గౌరవం కోట్లాదిమంది భారతీయులకు దక్కుతుంది’’అని అన్నారు.

నేడు ప్రాంభనన్‌ ఆలయ సందర్శన
మంగళవారం మోదీ యోగ్యకర్త నగరంలోని అతిపెద్ద శివాలయం ప్రాంభనన్‌ను దర్శించుకోనున్నారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలిచిన వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ కాంప్లెక్స్‌ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భారత్‌ సైతం పాలుపంచుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌ ఆరంభించేందుకు ఆసక్తి పత్రాలను ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.

సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు
⇒ ఇదే మంత్రంతో భారత్‌ దూసుకెళ్తోంది
⇒ ఇండోనేసియాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగం

జకార్తా: సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రం జపిస్తూ భారత్‌ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియాలోని జకార్తా నగరంలో పర్యటిస్తున్న మోదీ మంగళవారం అక్కడి భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత్‌ జపిస్తున్న స్వావలంభన మంత్రం ఒక్క ఇండోనేసియాకేకాదు యావత్‌ ఆసియాన్‌ దేశాలు ఆచరించాలి. భారత్‌ ఒక్కో సంస్కరణను అమలుచేస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్‌ పెనుమార్పులకు నిలయంగా మారింది. భారత ప్రగతి వేగాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 140 కోట్ల స్ఫూర్తికణికలు ప్రజ్వరిల్లుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 

భారత్‌ ప్రపంచంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థ మాత్రమేకాదు ఇది వంద కోట్ల కలల పయనం. ఇంధనం, అనుసంధానం, చిప్‌ల తయారీ ఇలా ప్రతి రంగంలోనూ భారత్‌ ముందడుగేస్తోంది. భారత్‌ సొంత కలలనేకాదు సోదర దేశాల కలలనూ తీర్చేందుకు తహతహలాడుతోంది. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ మంత్రాన్నీ మేం పఠిస్తాం. భారత్‌ తన నౌకాశ్రయాలను ఆధునీకరిస్తోంది. నూతన సముద్రమార్గాలను అన్వేíÙస్తోంది. ఈ పయనంలో ఇండోనేసియా మాకు మంచి మిత్రునిగా వెంట నడుస్తోంది’’ అని అన్నారు.  

నాలో ఇండియా డీఎన్‌ఏ: సుబియంతో మోదీ ప్రసంగం వేళ అక్కడే ఉన్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో మాట్లాడారు. ‘‘అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే భారత్‌ ఆహా్వనించింది. గత ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భారత్‌కు నా కృతజ్ఞతలు. 1950లో భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. 

ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా మిత్రులుగా మెలుగుతున్నాయి. గత ఏడాది భారతపర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ పరీక్ష చేయించుకున్నా. డీఎన్‌ఏ టెస్ట్‌ పూర్తయింది. నాలో భారతీయ డీఎన్‌ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకే అనుకుంటా.. ఎప్పుడు భారతీయ సంగీతం విన్నాసరే నా శరీరం ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. నా కేబినెట్‌ మంత్రులు, ఆర్మీ జనరల్స్‌ కూడా డాన్స్‌ ఇష్టపడతారు. పాడటమూ ఇష్టమే. ఒకవేళ వాళ్లలోనూ చాలా మందిలో భారత డీఎన్‌ఏ ఉందేమో’’ అని సుబియంతో అనగానే అక్కడి వాళ్లంతా ఫక్కున నవ్వారు.  

మోదీ పథకాలు కాపీ కొట్టా.. 
మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో సుబియంతో మాట్లాడారు. మోదీనుద్దేశిస్తూ.. ‘‘భారత్‌లో మీరు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నేను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఎన్నో పథకాలను కాపీ చేశా. ఇది బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను’’ అని అన్నారు.

విస్తరణవాదానికి దూరంగా ప్రగతిపథానికి దగ్గరగా ఇదే భారత్‌ పంథా: మోదీ 
జకార్తా: భారత్‌ ఎల్లవేళలా అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని, ఏనాడూ విస్తరణవాదం వైపు మొగ్గుచూపలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియా పార్లమెంట్‌లో అక్కడి చట్టసభ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ఇరుదేశాల మైత్రి మరింతగా విస్తరించాలి. 140 ఏళ్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియన్ల ఉమ్మడి శ్రేయస్సు కోసం ముందడుగువేద్దాం. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్‌ కోసం భారత్‌ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛావాణిజ్యాన్ని భారత్‌ కోరుకుంటోంది. భారత్‌ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు’’అంటూ దక్షిణచైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)