వలసలపై ట్రంప్‌ కన్నెర్ర

Published on Sat, 11/29/2025 - 04:22

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: అగ్రరాజ్యాధినేత అధికారిక నివాసం సమీపంలో గురువారం భద్రతాబలగాలపై అఫ్గాన్‌ దేశీయుడు జరిపిన కాల్పుల ఘటనపై డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నెర్రజేశారు. పేద, అంతగా అభివృద్ధి సాధించని దేశాల ప్రజలను వలసదారులుగా అంగీకరించే సంస్కృతికి చరమగీతం పాడుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. శరణార్థులుగా వచ్చి అమెరికా ప్రభుత్వం మీదనే కత్తిదూస్తున్న ఇలాంటి వ్యక్తులకు ఇక ఏమాత్రం ఆశ్రయం కల్పించబోమని ట్రంప్‌ తెగేసి చెప్పారు.

 అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని మెట్రోస్టేషన్‌ సమీపంలో అఫ్గాన్‌ దేశస్తుడు రహ్మనుల్లా లఖన్‌వాలా గురువారం జరిపిన కాల్పుల్లో గాయపడిన వెస్ట్‌ వర్జీనియా నేషనల్‌ గార్డు మహిళా జవాను సారా బెక్‌స్ట్రోమ్‌(20) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిశాక ట్రంప్‌ అనూహ్యంగా ‘థర్డ్‌ వరల్డ్‌’ దేశాలపై వలస నిషేధ కొరడా ఝులిపించారు. 

ఈ మేరకు శుక్రవారం ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘సాంకేతికంగా అమెరికా ఎంతో పురోగమిస్తున్నా కాలంచెల్లిన వలసవిధానాల కారణంగా వాటి ప్రయోజనాలను అమెరికన్లు పొందలేపోతున్నారు. జీవనప్రమాణాలు మెరుగపడట్లేవు. ఈ సమస్య సమసిపోయేలా మూడో ప్రపంచదేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తా. 

దీంతో  బైడెన్‌ స్వదస్తూరీతో సంతకాలు చేయకున్నా ఆటోపెన్‌ విధానంతో సమ్మతి సాధించిన లక్షలాది అక్రమ వలసల పరంపరకు అడ్డుకట్టపడుతుంది. అమెరికా ఆస్తిగా పరిగణించబడని, అమెరికాను ప్రేమించని వాళ్లందరికీ ఫెడరల్‌ ప్రభుత్వ ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దుచేస్తా. వలసదారులుగా వచ్చి పౌరసత్వం పొందాక దేశ ప్రశాంతతకు భంగం కల్గించే వాళ్ల శాశ్వతనివాస హోదాను రద్దుచేస్తా.

 అనధికార అక్రమ ఆటోపెన్‌ విధానంలో అనుమతి సాధించిన చట్టవ్యతిరేక జనాభాను భారీగా తగ్గిస్తా. తిరోగమన వలస విధానం మాత్రమే అమెరికా పురోగతికి బాటలు వేయగలదు. ఇకపై అమెరికా వ్యతిరేకులు ఇక్కడ ఉండబోరు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి వర్గీకరణ ప్రకారం ప్రపంచంలోని 44 దేశాలను తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా లెక్కిస్తున్నారు. ఈ దేశాల నుంచి వలసలను ట్రంప్‌ అడ్డుకునే వీలుందనే అంచనాలున్నాయి.

వాళ్ల గ్రీన్‌కార్డ్‌లను పునఃసమీక్షిస్తాం
బైడెన్‌ హయాంలో అఫ్గాన్‌ నుంచి వలసదారునిగా వచ్చి ప్రత్యేక కారుణ్య పథకంలో భాగంగా అమెరికాలో నివాసఅనుమతి సాధించిన రహ్మనుల్లా కాల్పులకు తెగబడడంతో ట్రంప్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో వలసదారులుగా వచ్చిన విదేశీయులకు జారీచేసిన గ్రీన్‌కార్డ్‌లను పునఃసమీక్షిస్తామని శుక్రవారం అమెరికా సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సేవలు(యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ జోసెఫ్‌ ఎలో చెప్పారు. ‘‘ మాదేశం, అమెరికన్ల పరిరక్షణే మాకు పరమోన్నతం. గత పాలకుల తప్పిదాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. 

అఫ్గాన్‌ దేశస్తుల వలస, శరణార్థి అభ్యర్థనల దరఖాస్తులను నవంబర్‌ 27వ తేదీ నుంచి పక్కనపడేస్తున్నాం. అత్యంత ప్రమాదకర దేశాలైన అఫ్గానిస్తాన్, మయన్మార్, బురుండీ, చాద్, కాంగో రిపబ్లిక్, క్యూబా, ఈక్వెటోరియల్‌ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, సియెర్రా లియోన్, సోమాలియా, సూడాన్, టోగో, తుర్కెమెనిస్తాన్, వెనిజులా, యెమెన్‌ల నుంచి వచ్చే శరణార్థి అభ్యర్థనల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాం’’ అని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మరోసారి నూతన మార్గదర్శకాలను విడుదలచేశారు.

మొదటి ప్రపంచదేశాలంటే?
ట్రంప్‌ ప్రకటనతో మొదటి, రెండో, మూడో ప్రపంచదేశాలు ఏమిటి? అనే చర్చ మొదలైంది. ప్రజాస్వామ్యయుత పాలనతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, అమెరికాతో జట్టుకట్టిన దేశాలను మొదటి ప్రపంచదేశాలు అంటారు. వీటిల్లో ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌ దేశాలతో దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్వీడన్, ఐర్లాండ్, ఫిన్లాండ్‌ ఉన్నాయి.

రెండో ప్రపంచదేశాలంటే?
కమ్యూనిస్ట్‌–సామ్యవాద దేశాలను రెండో ప్రపంచదేశాలుగా భావిస్తారు. ఆనాటి సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలతోపాటు పోలండ్, తూర్పు జర్మనీ, చెకస్లోవేకియా, బాల్కన్స్, చైనా, మంగోలియా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, కాంబోడియాలను రెండో ప్రపంచ దేశాలుగా పరిగణిస్తారు.

మూడో ప్రపంచ దేశాలేంటి?
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికాకు మద్దతు పలికిన పశ్చిమ దేశాలను మొదటి ప్రపంచదేశాలుగా భావించగా, కమ్యూనిస్ట్‌ భావజాలంతో నిండిన తూర్పు దేశాలను రెండో ప్రపంచ దేశాలు అన్నారు. ఈ కూటములకు మద్దతు పలకకుండా, తటస్థంగా ఉండిపోయిన వాటిని మూడో ప్రపంచదేశాలుగా భావించారు. ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాలు ఈ వర్గంలో ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా పేద, అంతగా అభివృద్ధి చెందని దేశాలను థర్డ్‌వరల్డ్‌ కంట్రీస్‌గా లెక్కిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన జనాభా నిపుణుడు ఆల్‌ఫ్రెడ్‌ సావీ 1952లో తొలిసారిగా ‘మూడు ప్రపంచాలు, ఒక్కటే భూమి’ పుస్తకంలో ఈ భావనను ప్రతిపాదించారు. 

భారత్‌ ఏ జాబితాలో ఉంది?
సోవియట్‌ రష్యా పతనం తర్వాత మూడో ప్రపంచదేశాలు అనే భావన మనుగడలో లేదు. తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలనే మూడో ప్రపంచదేశాల గాడిన కడుతున్నారు. ఐక్యరాజ్యసమితి జాబితా ప్రకారం ఇందులో 44 దేశాలున్నాయి. ఆఫ్రికా ఖండంలో 32, ఆసియాలోని 8 దేశాలతోపాటు కరేబియన్‌ దేశం హైతీ, పసిఫిక్‌ ద్వీపదేశాలు మూడు మొత్తంగా 44 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత భావనల ప్రకారం స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్‌ పేద దేశమే. కానీ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతూ పెద్ద ఆర్థికశక్తిగా మారింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించింది. ఈ లెక్కన ట్రంప్‌ చెప్పిన మూడో ప్రపంచ దేశాల జాబితాలో భారత్‌ లేదనే చెప్పాలి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)