Breaking News

దాడులే దాడులు

Published on Mon, 06/16/2025 - 04:07

టెల్‌ అవీవ్‌/టెహ్రాన్‌/దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ/జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్‌ ఆదివారం వరసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్‌ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్‌ దద్దరిల్లిపోయింది. ఇరాన్‌ క్షిపణులు ఇజ్రాయెల్‌లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్‌ను ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.

ఊపిరి సలపనివ్వని ఇజ్రాయెల్‌ 
ఇరాన్‌కు ఏమాత్రం సమయమివ్వకుండా టెహ్రాన్, సమీప ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. టెహ్రాన్‌లో పౌర భవన సముదాయంపై దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది చిన్నారులే! ఇప్పటిదాకా 406 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ది సౌత్‌ పార్స్‌’ సహజవాయువు ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ దాడిలో దారుణంగా దెబ్బతింది.

పర్షియన్‌ గల్ఫ్‌లో బుషెహర్‌ ప్రావిన్సులోని చమురుశుద్ది కర్మాగారమూ మంటల్లో చిక్కుకుంది. షహ్రాన్‌ ఆయిల్‌ డిపోపైనా దాడులు జరిగాయి. ‘‘ఆయుధాల ఉత్పత్తి కేంద్రాల నుంచి సిబ్బంది పారిపోండి. వాటిపై దాడులు చేయబోతున్నాం. అణు విద్యుత్కేంద్రాల సమీప ప్రాంతాల పౌరులూ పారిపొండి’’ అని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. ఇస్ఫహాన్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై మరోసారి దాడులు చేసినట్టు ప్రకటించింది.

క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్‌
ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్‌అవీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్‌అవీవ్‌ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్‌ ప్రెస్‌ రిపోర్టర్‌ తెలిపారు.

టెల్‌ అవీవ్‌కు దక్షిణాన బాట్‌యామ్‌ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్‌ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.

దీనికి భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో కుమారుడు అవ్‌నర్‌ వివాహ వేడుకను వాయిదా వేసుకుంటున్నట్టు నెతన్యాహూ వెల్లడించారు. అటు హమాస్, ఇటు ఇరాన్‌ దాడులతో దేశమంతా యుద్ధంలో మునిగి తేలుతుంతే ఇంట్లో పెళ్లి సంబరాలు చేసుకుంటారా అంటూ విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఖమేనీ హత్యకు ప్లాన్‌!
వారించిన ట్రంప్‌
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్‌ ప్లాన్‌ చేసినట్టు సమాచారం! అమెరికా ఈ మేరకు వెల్లడించింది. ‘‘అందుకు సర్వం సిద్ధమైంది.  వద్దంటూ అధ్యక్షుడు ట్రంప్‌ వారించడంతో వెనక్కు తగ్గింది’’అని లేదంటే ఖమేనీని చంపడం పెద్ద పని కాదని ఇజ్రాయెల్‌ వర్గాలు అన్నాయి.

వెంటనే ఆపగలను: ట్రంప్‌ 
ఇరాన్, ఇజ్రాయెల్‌ ఘర్షణను ఇప్పటికిప్పుడు ఆపేయగలనని ట్రంప్‌ చెప్పుకున్నారు. ‘‘ఆ దేశాలను నిలువరించి ఈ రక్తపాతాన్ని ఆపడం నాకు చాలా తేలిక. ఈ రగడతో అమెరికాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్‌కు మేం ఎలాంటి సాయమూ చేయడం లేదు’’ అని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్‌ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరాయి.

మీరు ఆపితే మేమూ ఆపుతాం
దాడులవేళ ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్‌ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్‌ ప్రావిన్సులో ఖతార్‌తో కలిసి ఇరాన్‌ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్‌ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు.

తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్‌ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్‌ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్‌ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది.

#

Tags : 1

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు