Breaking News

ఎల్‌నినో దెబ్బ.. ఎండిపోనున్న ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు

Published on Mon, 07/06/2026 - 08:51

భూమ్మీద ఉన్న అతిపెద్ద సరస్సుకు ఘోర విపత్తు రాబోతోంది. 3 లక్షల 75 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి, సముద్రాన్ని పోలి ఉన్న ఆ సరస్సు మరో పాతికేళ్లలో ఎండిపోవడమే కాకుండా.. అక్కడ ఓ భయంకర ఎడారి ఉద్భవించనుంది.ఇప్పుడు ప్రపంచమంతా రష్యా-ఉక్రెయిన్.. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాలపై ఆందోళన చెందుతుంటే.. అంతకు మించిన విపత్తు తనపని తాను చేసుకుపోతోందనే విషయం మీకు తెలుసా?అవును, మధ్య ఆసియాలో అతి పెద్ద సరస్సుగా పేరున్న క్యాస్పియన్ సీ వేగంగా అంతరించిపోతోంది. మీరు విన్నది నిజమే..!

ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌తో విలవిలలాడుతున్న ఈ మహా సరస్సుకు.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికేస్తున్న భయంకరమైన ‘సూపర్ ఎల్‌నినో’ విపత్తు తోడైంది! పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల, క్యాస్పియన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడి నీరంతా ఊహించని వేగంతో ఆవిరైపోతోంది.

మరోవైపు ఎల్‌నినో వల్ల వర్షాలు ముఖం చాటేయడంతో.. ఈ సరస్సుకు జీవనాడి అయిన నదుల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఘోరంగా పడిపోతోంది. రష్యా, కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్.. ఇలా ఐదు దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ మహా సరస్సు, 2050 కల్లా గుర్తుపట్టలేనంతగా మారిపోబోతోంది. అసలు క్యాస్పియన్ సముద్రానికి ఏమైంది? దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? ఈ రోజు చర్చించుకుందాం.

సముద్రమంత పెద్ద సరస్సు..!
క్యాస్పియన్ సముద్రం ఎంత పెద్దదో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే.. దీన్ని గనుక అమెరికా మ్యాప్ పైన పెడితే, దక్షిణాన లాస్ ఏంజిల్స్ నుండి ఉత్తరాన ఓరెగాన్, ఐడహో రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది. సముద్రాలతో ఎలాంటి సహజ అనుసంధానం లేకపోవడం వల్ల సాంకేతికంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. కానీ, 2020లో జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్ లోని ఉట్రెచ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'నేచర్' జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ఈ శతాబ్దం ముగిసేసరికి క్యాస్పియన్ సముద్రం నీటి మట్టం 9 మీటర్ల నుండి ఏకంగా 18 మీటర్ల మేర పడిపోనుంది! ఒకవేళ 9 మీటర్ల నీటి మట్టం తగ్గితే.. ఈ సముద్ర ఉపరితల వైశాల్యంలో 23 శాతం శాశ్వతంగా ఎండిపోతుంది. అదే గరిష్టంగా 18 మీటర్లు తగ్గితే.. ఏకంగా 34 శాతం భాగం భూమిగా.. ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటే.. ఎడాదిరి మాదిరిగా మారిపోతుంది. అంటే, దాదాపు 'పోర్చుగల్' దేశమంత పరిమాణంలో ఉన్న నీటి భాగం ఎండిపోయి ఎడారిగా మారుతుందన్నమాట! అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే.. 2050 నాటికే, అంటే కేవలం మరో పాతికేళ్లలోనే ఈ సరస్సు ఉత్తర భాగం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.

ఉత్తరభాగం కనుమరుగు..!
అసలు ఈ ఉత్తర భాగమే ఎందుకు ముందు ఎండిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను వివరిస్తాను. క్యాస్పియన్ సముద్రం మూడు బేసిన్లుగా ఉంది. దక్షిణ బేసిన్ అత్యంత లోతైనది. ఇక్కడ దాదాపు ఒక కిలోమీటరు మేర లోతు ఉంటుంది.  మధ్య బేసిన్ కూడా 788 మీటర్ల మేర లోతు ఉంటుంది. కానీ కజకిస్తాన్, రష్యా సరిహద్దుల్లో ఉండే ఉత్తర బేసిన్ సగటు లోతు 5 మీటర్లు మాత్రమే! క్యాస్పియన్ సముద్రంలో మూడో వంతు వైశాల్యం దీనిదే అయినప్పటికీ, కేవలం 1 శాతం నీరు మాత్రమే ఇక్కడ ఉంటుంది. గత శతాబ్దంలో 'ఆరల్ సముద్రం' ఎలాగైతే సోవియట్ పాలకుల నిర్వాకం వల్ల పూర్తిగా ఎండిపోయిందో.. ఇప్పుడు క్యాస్పియన్ సముద్రానికి కూడా అదే గతి పడుతోంది.

ఎందుకు ఈ పరిస్థితి?
అసలు క్యాస్పియన్ సముద్రం ఎందుకు ఎండిపోతోంది? అనే ప్రశ్నకు రెండు అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. మొదటిది, ఈ సరస్సుకు నీరందించే 130 నదులలో అత్యంత ప్రధానమైనది 'ఓల్గా నది'. క్యాస్పియన్ సముద్రానికి వచ్చే నీటిలో 80 శాతం ఈ ఒక్క నది నుంచే చేరుతుంది. అయితే, 2026లో 'అమెరికన్ జియోఫిజికల్ యూనియన్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఓల్గా నది ద్వారా వచ్చే నీటి ప్రవాహం గత కొన్నేళ్లుగా 12 శాతం తగ్గిపోయింది. క్లైమేట్ ఛేంజ్ వల్ల వర్షపాతం తగ్గడమే దీనికి కారణం. ఇక క్యాస్పియన్ సీ ఎండిపోవడానికి రెండో కారణం.. గ్లోబల్ వార్మింగ్! 1979 నుంచి 2015 మధ్య కాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. దీనివల్ల నీరు ఆవిరైపోయే రేటు విపరీతంగా పెరిగింది. క్యాస్పియన్ సముద్రం కోల్పోయిన నీటిలో 40 శాతం కేవలం ఈ ఎండల వల్ల ఆవిరైపోయినదే!

జీవవైవిధ్యానికి ముప్పు..?
ఈ విపత్తు వల్ల జరిగే నష్టం ఊహాతీతం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపోతున్న 'క్యాస్పియన్ సీల్స్' అనే జీవులు చలికాలంలో ఈ ఉత్తర భాగంలో గడ్డకట్టే మంచుపైనే పిల్లల్ని కంటాయి. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతే, ఆ జీవజాతి పూర్తిగా అంతరించిపోతుంది. ఇక ఆర్థికంగా చూస్తే.. ప్రపంచంలోని 3 శాతం ఆయిల్ నిల్వలు, 4 శాతం గ్యాస్ నిల్వలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా కజకిస్తాన్‌కు చెందిన, అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన 'కాశగన్ ఆయిల్ ఫీల్డ్' ఈ ఉత్తర బేసిన్ లోనే ఉంది. సముద్రం ఎండిపోతే, అక్కడ ఉన్న బిలియన్ల డాలర్ల షిప్పింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ల్యాండ్‌లాక్డ్ అయిపోయి, కజకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అంతేకాదు, రష్యాలోని ఆస్ట్రాఖాన్, అజర్‌బైజాన్ రాజధాని బాకూ లాంటి ప్రముఖ ఓడరేవులు కొత్త తీరప్రాంతానికి కిలోమీటర్ల దూరంలోకి జరిగిపోతాయి. చైనా నుంచి ఐరోపా వెళ్లే అత్యంత కీలకమైన 'మిడిల్ కారిడార్' ట్రేడ్ రూట్ కూడా ఈ సరస్సు ఎండిపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మారబోతోంది.

భూగర్భం విషపూరితమే..
ఇవన్నీ ఒకెత్తయితే, ఎండిపోయిన ఈ సరస్సు గర్భం విషపూరితమైన ఎడారిగా మారుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన ఆయిల్ వెలికితీత, కెమికల్ వ్యర్థాల వల్ల ఈ నీరు పూర్తిగా కలుషితమైంది. రేపు ఎండల వల్ల ఈ భూమి ఎండిపోయాక, వీచే గాలులు ఆ కెమికల్ ధూళిని చుట్టుపక్కల నగరాలపైకి మోసుకొస్తాయి. దీనివల్ల ఈ తీరప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు 'క్లైమేట్ రెఫ్యూజీస్' అంటే.. వాతావరణ శరణార్థులుగా తమ ఇళ్లను వదిలి వలస వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లోనూ ఇరాన్ తన డ్రోన్లను రష్యాకు సరఫరా చేయడానికి ఈ క్యాస్పియన్ సముద్రాన్నే వాడుకుంటోంది. రాజకీయాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఈ మహా సరస్సు.. ప్రకృతి ప్రకోపానికి బలైపోతుండటం నిజంగా మానవాళికి ఒక హెచ్చరిక. మరి గ్లోబల్ ఎమిషన్స్ తగ్గించి ప్రపంచ దేశాలు ఈ మహావినాశనాన్ని ఆపగలవా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

:: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)