Breaking News

వర్చువల్‌ కచ్చడాలు

Published on Mon, 07/22/2024 - 00:55

‘ఒక తల్లి, ముగ్గురు డాడీలు’ యూ ట్యూబ్‌ ఓపెన్‌ చెయ్యగానే ఒక చానల్‌ పెట్టిన థంబ్‌ నెయిల్‌ కనపడింది. వ్యూస్‌ పెంచుకోవడానికి యూట్యూబ్‌ చానల్స్‌తో పాటు చిన్నా పెద్ద పత్రికల డిజిటల్‌ విభాగాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ‘మతి పోగొట్టే, రచ్చరచ్చ చేసే, పడీపడీ నవ్వే, చూడగానే షాకయ్యే’ ఎన్నో థంబ్‌ నెయిల్స్‌ చూస్తూనే ఉన్నాము. కానీ ఆడవాళ్ళ విషయంలో... ముఖ్యంగా పోరాట కులాల నుంచి వచ్చిన ఆడవాళ్ళ విషయంలో ఈ చూపుడు వేళ్ళు మరిన్ని వంకర్లు తిరుగుతాయి. 

‘ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తావా?’ అంటుంది ఫ్యూడల్‌ సమాజం. పౌరుషమైన విషయాలు మగవారికే కనుక వారు పురుషులయ్యారు. సమాజమూ రాజకీయాలు వగైరాలన్నీ మగవారి టెరిటరీగా ఉన్నంతకాలం ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం తప్పన్నది ఒక అనాగరిక విలువ. ఆ మేరకు స్త్రీలు యుద్ధాలు చేయని సుకుమారులుగా, మాటంటే బడబడా కన్నీరు కార్చే సున్నిత మనస్కులుగా తయారు చేయబడ్డారు. 

ఇక ఇపుడు అలా లేరు. స్త్రీలు అన్నీ మాట్లాడగలరు. ముక్కూ చెవులూ కోసి పంపినందుకు సంబరపడిన మన మొహాలకేసి జాలిగా చూసి, ‘ప్రేమించడం తప్పా?’ అంటుంది ఆధునిక శూర్పణఖ. ‘పేడితో యుద్ధం చెయ్యనని’ ఆయుధం విసర్జించిన విలువిద్యకారుని ప్రశ్నించింది శిఖండి. ‘భీష్మా! నాతో పోరాడు’ అని సవాల్‌ చేసినట్లు కూడా రాసింది ఒక రచయిత్రి. 

స్త్రీలు తమ యుద్ధాలు తామే చేస్తున్నా వారి లైంగిక వ్యక్తిత్వం మగవారి సొత్తుగానే ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల ఈ స్థితి కొత్తరూపం తీసుకుంటోంది. రాజకీయ నాయకులుగా, రాజకీయ కుటుంబీకులుగా, ఉన్నతోద్యోగులుగా, కళాకారులుగా ఇంకా ఎన్నో రంగాలలో స్త్రీలు బాహాట శీలపరీక్షలకు గురవుతున్నారు. 

చేతిలో ఫోనో, ఛానలో ఉన్న చాలామంది అగ్నిగుండాలకి సమిధలు తయారు చేస్తున్నారు. ‘ఫలానా స్త్రీ ఎవరితో శారీరక సంబంధంలో ఉందీ, ఆమె బిడ్డకి ఎంతమంది డాడీలు, ఆమెకి ఎంతమంది మగాళ్లతో సంబంధాలు ఉన్నాయి, ఆమె ఏ రోజు ఎవరితో ఏ హోటల్లో ఉందీ’ వంటి లక్షోపలక్షల ప్రశ్నలు సమాజాన్ని ఉద్ధరించడం కోసం మీడియా వేస్తూ ఉంటుంది. 

అంతేకాదు అటువంటి స్త్రీలకి ఎటువంటి శిక్షలు విధించాలో కూడా రచ్చబండలు, బతుకు జట్కాబండులతో పాటు పిల్లా పిచుకా యూట్యూబర్లు, పెద్ద మీడియా సంస్థల, రాజకీయ పార్టీల డిజిటల్‌ విభాగాలు నిర్ణయిస్తాయి. ‘కామాంధురాలి కళ్ళు పీకాలి’, ‘పరాయి మగాడితో కులికిన స్త్రీని గుడ్డలూడదీసి కొట్టాలి’, ‘అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెని చెట్టుకు కట్టేసి తన్నాలి’ వంటి అనేక శిక్షలను సజెస్టివ్‌గా చెప్పడంతో పాటు, ఆ యా శిక్షలను అభినయించి చూపగల ధీరులు వారు. 

స్త్రీ పురుష శారీరక సంబంధాలు వ్యక్తిగతం. వాటిని చర్చించడానికి కొద్దిమందికి మాత్రమే హక్కు ఉంది. అటువంటి వివాదాల్లోని వ్యక్తులు, ఆ యా సంబంధాలలోని అవకాశవాదాన్ని, మోసాన్ని, హింసని గుర్తించి తీర్పు ఇచ్చే న్యాయవ్యవస్థ లేదా ఆ ఇరువురి సమ్మతంతో ప్రయత్నించే మధ్యవర్తులకి మాత్రమే ఆ హక్కు ఉంది. అంతే తప్ప ఎవరు పడితే వారు, వారి సంబంధాలలోకి తొంగి చూసి, చకచకా అడుగులు వేసి వ్యాఖ్యానించడం కుసంస్కారం. 

తమ రక్తం పంచుకు పుట్టినవారికే ఆస్తి ఇవ్వడం కోసం, బయలాజికల్‌ తండ్రులుగా తమ స్థితిని నిర్ధారించుకోవడం కోసం స్త్రీ మొలకు ఇనుప కచ్చడాలు బిగించి, తాళాలు వేసిన ఘనత పితృస్వామ్య సమాజానిది. ఇపుడు మీడియా, సోషల్‌ మీడియా సామాజిక, రాజకీయ రంగాలలో ఉన్న స్త్రీలకు అటువంటి వర్చువల్‌ కచ్చడాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాయి.

డియర్‌ మీడియా– సోషల్‌ మీడియా! అవినీతిని వెలికి తీయడమే మీ అత్యున్నత లక్ష్యం అయినపుడు అవినీతే ప్రమాణం కావాలి తప్ప ఎవరి వ్యక్తిగతాలయినా మీకెందుకు! వేల కోట్ల సంపన్నుల మీద పెద్దచూపు, పీడిత వర్గాల వ్యక్తిత్వం మీద చిన్నచూపుతో ఉన్న విషయానికి వంద మసాలా దినుసులు కలిపి వార్తలను వండి వడ్డించే హక్కు మీకుందా? ఒక స్త్రీ ఎంతమందితో తిరిగితే, ఎవరితో ఏ సంబంధంలో ఉంటే, ఎవరితో బిడ్డని కంటే మీకేమిటి నొప్పి? స్త్రీలుగా, పోరాట కులాల స్త్రీలుగా, పౌరులుగా, మనుషులుగా మాకు ఉండే హక్కుల పట్ల ఎలానూ అక్కర లేదు. 

ఏ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని పసిబిడ్డల పట్ల మానవ సహజమైన తడి కూడా మీకు లేదు. ‘తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం’ అన్న నానుడి పాతదే కానీ దాని నిజార్థాన్ని, ‘పిల్లలు మన ద్వారా వస్తారు తప్ప మనకోసం రారు’ అన్న ఖలీల్‌ గిబ్రన్‌ తాత్వికార్థాన్ని గ్రహించగలిగితే  స్త్రీ పురుష సంబంధాల పట్ల మీ చూపు మారుతుంది. 

ఒక బిడ్డకు ఎంతమంది డాడీలు అంటూ చర్చ చేసిన ప్రతి మీడియా సంస్థా ఈ రోజు స్త్రీల, బాలల హక్కులను ఉల్లంఘించాయి. వ్యూస్‌ కోసం ఎంతకైనా తెగించే మిమ్మల్ని చూస్తుంటే, మా శరీరాల చుట్టూ కెమెరాలు బిగించినట్లు, రాబందుల మైకుల చప్పుడు మా తలల మీదుగా వీస్తున్నట్లు ఉంది. దయ చేసి ఆపండి!

కె.ఎన్‌. మల్లీశ్వరి 
వ్యాసకర్త కార్యదర్శి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక, ఏపీ
malleswari.kn2008@gmail.com

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)