Breaking News

శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష

Published on Wed, 08/05/2026 - 00:09

ఇటీవల పార్లమెంట్‌లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్‌ వీళినాథన్‌ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్‌ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కూడా కామకోటికి వత్తాసు పలికారు. 

అధికారిక మద్దతు
గోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి.  వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్‌ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం  చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్‌ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. 

గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్‌ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్‌ పరిధిలోకి వస్తుంది. యూరిన్‌ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. 

నవ భారతానికి ప్రాచీన జబ్బు
కీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్‌లెట్‌ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. 

పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్‌ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్‌పై భరత్‌ అగర్వాల్‌ అనే అమెరికన్‌ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్‌.బి. సింగ్‌ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్‌సెట్, బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్‌ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్‌ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్‌ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్‌ జవాబిచ్చారు. 

ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్‌ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయంలో తేలింది. 

చైనా ఉదాహరణ
చైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్‌ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్‌ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్‌ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. 

భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్‌ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్‌ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)