Breaking News

నేటి యువత చూపుతున్న నైతిక శక్తి

Published on Fri, 07/24/2026 - 00:53

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్‌ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్‌లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్‌ నారాయణ్‌) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్‌ మంతర్‌ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.

సత్యాగ్రహ శక్తి
సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్‌ మంతర్‌ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.

ధర్మబద్ధమైన కార్యాచరణ
‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.

ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు.  అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.

ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్‌ నుంచి అంబేడ్కర్‌ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.

పూర్తికాని స్వాతంత్య్ర పోరాటం
భారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్‌ మంతర్‌లో యువత  గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!

డా‘‘ రఘు చలిగంటి
వ్యాసకర్త ఫ్రౌన్‌హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ (జర్మనీ)
సీనియర్‌ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ జర్మనీ’ వ్యవస్థాపకుడు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)