Breaking News

రిస్క్‌ తీసుకుంటేనే 'నవలోకాలు'!

Published on Mon, 06/22/2026 - 00:28

నేనూ ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేశాను. అప్లైడ్‌ మ్యాథ్స్‌లో మాస్టర్స్‌ పట్టా పొందాను. నాకు ఇద్దరు పిల్లలు. వారూ ఉన్నత విద్యావంతులే. కాబోయే తల్లిదండ్రులుగా మీకు నాదొక సలహా. పెద్దయిన తర్వాత మీరు ఫలానా కావాలంటూ వారికి ఎన్నడూ చెప్పకండి. వారు దానికి విరుద్ధమైన పని చేసి చూపిస్తారు. కానీ, మీరు వారికొక ఆదర్శమైన వ్యక్తిలా మారవచ్చు లేదా ఆదర్శప్రాయంగా తీసుకో దగిన వ్యక్తుల్ని వారికి చూపవచ్చు. మా అమ్మ నాకు అదే పని చేసింది. నాకపుడు 15 లేదా 16 ఏళ్ళు అనుకుంటా. మా అమ్మ నాకు ‘సొసైటీ ఆఫ్‌ విమెన్‌ ఇంజినీర్స్‌’ సంస్థను చూపించింది. 

నేను ఇరవై ఏళ్లుగా ఒక ఉత్తమ భౌతికవేత్త, ఇంజినీర్‌ వద్ద పనిచేస్తున్నా. ఆయనే ఎలాన్‌ మస్క్‌. పది మందితో మొదలుపెట్టి దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా స్పేస్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో సహాయపడే అవకాశాన్ని మస్క్‌ నాకు కల్పించారు. మొదట్లో ఆదాయం లేకపోయినా ఏటా కోట్ల డాలర్లు గడించే సంస్థగా అది అవతరించింది. అమెరికాలో తయారైన రాకెట్లు, అంతరిక్ష నౌకల ద్వారా వ్యోమగాములను పంపడంలో చేయూతనివ్వగలగడం నాకెంతో గర్వదాయకంగా ఉంటుంది. మా డ్రాగన్‌ అంతరిక్ష నౌక ద్వారా ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యోమగాములనైనా సరే అంతరిక్షంలోకి పంపగలం. ఓసారి కేవలం పౌరులను పంపాం. 

వారు కొద్ది రోజులు భూమి చుట్టూ తిరిగి వచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. మనుషులు ఈ భూమిపైనే కాకుండా చంద్రునిపైన లేదా కుజునిపైన జీవించేందుకు బాటను సృష్టించడంలో సాయపడ్డానని అనుకుంటున్నాను. అవే కాదు, వాటిని మించి ఇతర నక్షత్ర వ్యవస్థలు, గెలాక్సీలలో జీవించగలిగే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాను. ఇతర గ్రహాల్లో లేదా విశ్వాంతరాళంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే వారితో మాత్రమే మాట్లాడాలని కోరుకుంటు న్నానని నేను తరచు జోక్‌ చేస్తూంటాను. అది నా జీవిత కాలంలో నెరవేరకపోవచ్చు. కానీ, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పునాదిగా లేదా తొలి అడుగులు వేసినదిగా నా కృషి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. నా గురించి చెప్పుకున్నది చాలు. నా జీవితానుభవాల ఆధారంగా రెండు మూడు సంగతులు చెబుతాను.

కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడితేనే...
అసంబద్ధమైనవైనా సరే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి. విఫలమవుతానేమోనని భయ పడకండి. విఫలమైనా, పొరపాటు చేసినా అంగీకరించేందుకూ, మరో దారిని వెతుక్కునేందుకూ సందేహించకండి. ఆశించిన ఫలితం రానంత మాత్రాన విఫలమయ్యామనుకోకండి. తప్పటడుగును వృద్ధిగా పరిగణించండి. స్పేస్‌ఎక్స్‌లో జాయినవ్వాలా వద్దా అని 2002లో నేను చాలా మథనపడ్డాను. ఆ చిన్న అంకుర సంస్థలో చేరడం వ్యక్తిగతంగా రిస్క్‌ తీసుకోవడమనిపించింది. ఆ రంగంలో అంతకుముందెన్నడూ సఫలమైనవారు లేరు. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడటం ఇష్టం లేకపోయింది. తర్వాత, నాకే అనిపించింది. నేనేమీ పెద్ద తెలివైన దాన్ని కాను. నేను దీన్ని ప్రయత్నించి చూస్తే నేనైనా లేదా కంపెనీ అయినా విఫలమైతే పట్టించుకునేదెవరు? ప్రయత్నించి చూడటమే ముఖ్యమైన విషయంగా తోచింది. రిస్క్‌ తీసుకోవాలి. ఉత్తేజకరమైన దాంట్లో భాగం కావాలని నిర్ణయించుకున్నా. నేనపుడు ఆ నిర్ణయానికి రాకపోయి ఉంటే నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం ఏ విధంగా ఉండేవో ఇపుడు ఊహించబుద్ధి కూడా కాదు. 

రాకెట్‌ను పైకి పంపడమే కాదు, దాన్ని సురక్షితంగా తిరిగి భూమి మీదకు దింపడం చాలా కష్టం. ఈ విషయంలో స్పేస్‌ఎక్స్‌ అపారమైన రిస్క్‌ తీసుకుంది. టెక్నాలజీకి నిరంతరం పదును పెట్టుకుంటూ వచ్చింది. రాకెట్‌ను ప్రయోగించిన వేదికకు డ్రోన్‌షిప్‌ కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంది. ఓ డజనుసార్లు విఫలమైన తర్వాత, రాకెట్‌ను దానిమీద సురక్షితంగా దింపగలిగాం. ఇప్పటికీ అది క్లిష్టమైన కార్యమేగానీ, రొటీన్‌గా మారిపోయింది. ఆ టెక్నాలజీ కుజ గ్రహంపై ఆవాసం ఏర్పరుచుకునేందుకు చాలా ముఖ్యం.

కబుర్లు అనవసరం
పనిచేస్తున్న సంస్థలో టెక్నాలజీకే పరిమితం కాకుండా అకౌంటింగ్, ఫైనాన్సింగ్, ప్రభుత్వ అనుమతులు వంటి వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వచ్చింది. ఒకసారి తివాచీని వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసేందుకు కూడా నేను వెనుకాడలేదు. సైన్స్‌ ప్రయోగాలకు, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సరుకులు తీసుకెళ్ళి, తీసుకొచ్చేందుకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మాతో దాదాపు 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అట్లా, నా విధినిర్వహణల పరిధి విస్తరిస్తూ పోయింది. ఎలాన్‌ మస్క్‌ అభ్యర్థన మేరకు కంపెనీకి చెందిన ఇతర విభాగాల్లోనూ పనులు చక్కబెట్టడంలో సహాయ పడుతూ వచ్చాను. 

దయతో మెలగండి. ఎదుటివారి పట్ల గౌరవం చూపండి. కానీ, ఒక సంగతి గుర్తుంచుకోవాలి. కబుర్లరాయుళ్లతో మనకు పనిలేదు. వారు చేయాల్సిన పని చేయడం మానేసి, ఇతరుల పనికి కూడా అవాంతరాలు కల్పించేవారుంటారు. కొత్త, వినూత్నమైన ఆలోచన లను పంచుకోవడంలో తప్పు లేదు. క్లిష్టమైన సమస్యలను పరిష్క రించుకునేందుకు అవి అవసరమే. కానీ, అది కాలక్షేప ప్రక్రియగా మారకూడదన్నదే నా ఉద్దేశం. ఒక్కముక్కలో చెప్పాలంటే, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం గొంతెత్తి మాట్లాడటంలో లేదు. ఎదుటి వారి మాటలను శ్రద్ధాసక్తులతో వినడంలో ఉంది. తోటి ఉద్యోగుల ఐడియాలను స్వాగతించండి. ముఖ్యంగా మీ ఆలోచనలతో విభేది స్తున్నవారి మాటలను మరింత ఓపిగ్గా వినండి. 

మనమేం చేయగలం?
ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ప్రస్తావించకపోవడం కూడా సబబు కాదు. ఆందోళన కలిగిస్తున్న అంశాలకు పరిష్కారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద కూడా లేవు. మున్ముందు తడతాయేమో చూడాలి. భవిష్యత్‌ జీవన విధానంలో టెక్నాలజీ పాత్ర మరింత పెరగబోతోంది. సైన్స్‌, గణితంలో మన విద్యార్థుల మార్కులు పెదవి విరిచేవిగా ఉంటున్నాయి. ఉత్తీర్ణతలో చైనా అగ్ర స్థానంలో ఉంటే, నా మూలాలున్న ఐర్లాండ్‌ 12వ స్థానంలో ఉంది. అమెరికాది 25వ స్థానం. ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే, అత్యధిక, అత్యల్ప మార్కులు తెచ్చుకుంటున్న వారి మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. భవిష్యత్తుకు తగ్గట్లుగా నేటి బాలలను తీర్చిదిద్దాలి. 

మొదటగా అసాధ్యమైనవిగా కనిపించినా కొన్ని కొత్త ఐడియాలను కూడా గౌరవించడం, వాటి గురించి చెప్పేవారి మాటలను ఉపేక్షించకుండా వినడం అవసరం. మానవ ప్రతిభా వ్యుత్పత్తులను నిరుపయోగంగా వదిలేయడంకన్నా నైతికమైన పాపం మరొకటి ఉండదు. వ్యక్తిగత పురోభివృద్ధితోపాటు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చడంలో మన వంతు కృషి ఏమి చేయగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)