Breaking News

దేశానికి వయసు మీద పడనుంది!

Published on Mon, 06/09/2025 - 01:50

యువజనుల సంఖ్య మనకు కలిసి వస్తున్న లాభం. దీన్నే డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అంటున్నారు. అయితే ఇది ఎంతో కాలం నిలవదు. పనిచేసే వయసులో ఉన్న యువ జనం ఎల్లకాలం ఉండరు. చూస్తుండగానే దేశం వృద్ధులతో నిండిపోతుంది. వయసు మళ్లిన జనాభా ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతుంది. 

మన జనాభా 134 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. జనబలం, ధనబలం రెంటిలో ఇండియా ఇప్పుడున్నంత గొప్పగా చరిత్రలో ఏనాడూ లేదు. దీనికి మూలాలు దాదాపు వందేళ్ల నాడు పడ్డాయి. భారత జనాభా చరిత్రలో 1921 అతి ముఖ్యమైన సంవత్సరం. దీన్ని ‘ఇయర్‌ ఆఫ్‌ గ్రేట్‌ డివైడ్‌’గా వ్యవహరిస్తారు. ఆ ఏడాది మరణాల సంఖ్య గణనీయంగా పడి పోయింది. దీంతో అప్పటి వరకూ నిలకడగా ఉన్న జనాభా వృద్ధి రేటు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. 

1901–1921 మధ్యకాలంలో పెరిగిన జనసంఖ్య అతిస్వల్పం. 20 కోట్ల నుంచి కేవలం 22 కోట్లకు పెరిగింది. ఇక అక్కడి నుంచి విస్ఫోటనాన్ని తలపిస్తూ దేశ జనాభా నేడున్న అసాధారణ స్థాయిని అందుకుంది. ఒక శతాబ్ద కాలంలోనే రమారమి ఆరు రెట్లు హెచ్చింది. ఈ శతాబ్దం మధ్యనాటికి ఇప్పటి జనాభాకు మరో 20–30 కోట్ల మంది కొత్తగా వచ్చి చేరతారు.   

వృద్ధాప్యం – నగరీకరణ
వయస్సు రీత్యా చూస్తే, మొత్తం జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 2005లో 5 శాతం ఉండేవారు. 2050 నాటికి జనాభాలో వీరి వాటా 14.5 శాతం అవుతుంది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. పెరిగే ఈ వయోవృద్ధుల కోసం కొత్త పన్ను విధానాలు, సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలు ఇప్పటి నుంచీ రూపొందించుకోవాలి. వయోవృద్ధులు అధికంగా ఉన్న ధనిక దేశాలను చూసి మనం ముందు నుంచీ జాగ్రత్త పడాలి. వృద్ధాప్యం ఆర్థిక వ్యవస్థకు పెను భారం. 

జన సాంద్రత చిక్కబడటం మరో ఆందోళనకర అంశం. 2005లో చదరపు కిలోమీటరుకు 345 మంది ఉండగా, 2050 నాటికి ఈ సంఖ్య 504కి పెరుగుతుంది. ఇదే కాలంలో, పట్టణీకరణ అధికమై పలు కొత్త సమస్యలు సృష్టిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు 2000లో 30 కోట్ల మంది (జనాభాలో 28.7 శాతం) కాగా, వీరు 2030 నాటికి 60 కోట్లు (40.7 శాతం) అవుతారు. పట్టణ ప్రాంతాలు, వాటితో పాటు పట్టణ జనాభా ఈ స్థాయిలో పెరుగుతూ పోతే, గృహనిర్మాణం, మంచినీరు, డ్రెయినేజి, రవాణా, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు, ఆహార పంపిణీ వ్యవస్థలు భారీస్థాయిలో ఉండాలి. పట్టణాభివృద్ధికి ఎంత పెట్టుబడీ చాలదు.

2060–70కి జనాభా స్థిరీకరణ?
ఇండియాకు ఇప్పుడు ఒనగూరుతున్న డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ 2050 వరకే కొనసాగుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం, 2005లో 15–64 ఏళ్ల బ్రాకెట్లో ఉన్న ప్రజల సంఖ్య జనాభాలో 62 శాతం కాగా, 2050 నాటికల్లా ఇది 67.3 శాతానికి పెరుగుతుంది. వీరంతా పనిచేయగల వారు. రానున్న కాలంలో వీరికి కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి. అయితే, 2045–50 మధ్య కాలంలో 15–64 ఏజ్‌ గ్రూప్‌ శాతంలో ఎలాంటి వృద్ధీ ఉండదు. ఇది జనాభా స్థిరీకరణ దశకు సంకేతం. ఆ తర్వాత నుంచీ శ్రామికుల శాతం శర వేగంతో క్షీణిస్తుంది. వయసు మళ్లిన వారి శాతం పెరుగుతూపోతుంది.  చైనా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే!

జనాభా స్థిరీకరణ అంటే? కొంతకాలం పాటు జనన మరణాల రేట్లు స్థిరంగా ఉండిపోతాయి. అంటే సగటున ఒక్కో మహిళ కనే పిల్లల సంఖ్య 2.1 మందికి పరిమితమవుతుంది. దీన్ని ‘రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌ ఫెర్టిలిటీ’ అంటారు. ఈ స్థాయికి ఫెర్టిలిటీ రేటు చేరినప్పుడు జనాభా స్థిరీకరణ దశలో ఉంటుంది. అంతకంటే తగ్గితే జనాభా క్షీణదశలోకి జారిపోతుంది. ‘నేషనల్‌ పాపులేషన్‌ పాలసీ–2000’ ప్రకారం, 2045 నాటికి ఇండియా స్థిర జనాభా స్థాయిని సాధించాలి. 

ఒక తరాన్ని మరో తరం భర్తీ చేయడానికి అవసరమైన 2.1 టోటల్‌ ఫెర్టిలిటీ రేటును 2010 నాటికి  చేరుకుంటామన్న అంచనా ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీన్ని సాధించలేకపోయినందున, స్థిరీకరణ లక్ష్యాన్ని కూడా వాయిదా వేశారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనాభా స్థిరీకరణకు 2060ని తాజా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. పాపులేషన్‌ రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌ ఫెర్టిలిటీ (2.1) సాధించిన చాలా కాలం తర్వాతే, జనాభా స్థిరీకరణ దశ ఆరంభమవుతుందన్న అంశం మనం ఇక్కడ గుర్తించాలి.  

జనాభాపై ప్రణాళికా సంఘం 1996లో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ దీనిపై అధ్యయనం చేసి, ఇండియా ఈ రీప్లేస్‌మెంట్‌ లెవెల్‌ ఫెర్టిలిటీ రేటును 2026 నాటికి చేరుకుంటుందని తేల్చింది. అదే రాష్ట్రాల వారీగా చూస్తే, హిందీ బెల్టులోని బిహార్‌ 2039కి, రాజస్థాన్‌ 2048కి, ఇక మధ్యప్రదేశ్‌ 2060 తర్వాత, ఉత్తర ప్రదేశ్‌ 2100 తర్వాతగానీ ఈ లెవెల్‌ సాధించగలవని అంచనా వేసింది. కాబట్టి జాతీయ జనాభా స్థిరీకరణ 2060 లేదా 2070 లోపు సాధ్యపడే అవకాశాల్లేవు. 

సువర్ణావకాశం కోల్పోతామా?
ఈ ప్రాంతీయ అసమానతల ప్రకారం, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జనాభా ఆందోళనకరంగా విస్ఫోటనం చెందుతుంది. 1991–2050 మధ్యకాలంలో ఇండియా జనాభా 77.3 కోట్లు పెరిగితే, ఉత్తరప్రదేశ్‌ ఒక్కదాని వాటానే ఈ అదనపు జనాభాలో 19.8 కోట్లు ఉంటుంది. జాతీయ వ్యాప్త జనాభా వృద్ధిలో ఇది నాలుగోవంతు! బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి వలసలు పెరిగి మెట్రోపాలిటన్‌ పారిశ్రామిక నగరాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.    

రానున్న సంవత్సరాల్లో తలసరి జీడీపీ ఎలా ఉండబోతోంది? ఇండియా ఎకనామిక్‌ సూపర్‌ పవర్‌ అవుతుందా అనే అంశం మీద 2005లో వరల్డ్‌ బ్యాంక్‌ ఆర్థికవేత్త స్టీఫెన్‌ హౌస్‌ వెలువరించిన అధ్యయన పత్రం ప్రకారం, 2050 నాటికి బిహార్, ఒడిశా, యూపీ, ఎంపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో తలసరి ఆదాయాలు 1,000 డాలర్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న తలసరి జీడీపీ కంటే ఇది తక్కువ. 

2050లో ఉండబోయే దానికంటే కూడా కచ్చితంగా తక్కువే ఉంటుంది. ఈ రాష్ట్రాల్లోనే జనాభా వెల్లువెత్తుతోంది. రాష్ట్రాల మధ్య నెలకొనే తలసరి ఆదాయ వ్యత్యాసాలు పునఃపంపిణీ విధానాలను (పన్నుల్లో వాటా, సంక్షేమ పథకాల వంటి వాటి అమలును) తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం చూస్తే, ప్రజలు పొట్ట చేతపట్టుకుని సాపేక్షంగా బీద రాష్ట్రాల నుంచి సాపేక్షంగా ధనిక రాష్ట్రాలకు వలసలు పోతారు. ఇది సామాజిక అశాంతికి దారితీస్తుంది. 

2020లో ఇండియాలో 15–24 ఏళ్ళ మధ్యవయసు యువకులు 24.5 కోట్ల మంది ఉన్నారు. 2020లో నమోదైన పొదుపులు, పతాక స్థాయి ఉత్పాదక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నట్ల యితే, 2050 నాటికి అభివృద్ధి చెందిన సుసంపన్న ఆర్థిక వ్యవస్థగా దేశం ఆవిర్భవించే అవకాశం ఉండి ఉండేది. యువజనుల శాతం పరంగా ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ ఎప్పటికీ  రాదు. వచ్చే అర్ధ శతాబ్దంలోనైనా మనం బీదరికం ఉచ్చు నుంచి బయటపడాలంటే, మానవ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీద భారీ పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఇదే! అయితే, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నాలేం జరుగుతున్న దాఖలాల్లేవు.

మోహన్‌ గురుస్వామి 
వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత
mohanguru@gmail.com

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)