Breaking News

సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?

Published on Thu, 02/26/2026 - 08:01

నడుస్తున్న చరిత్రలో  కొన్ని దశలు మన కళ్లముందే మూసుకుపోతాయి. తుపాకీతో ప్రారంభమైన దశ, తలవంచి ముగిసిన దశగా మారిపోతుంటే అది కేవలం సంఘటన కాదు– ఒక యుగాంత సంకేతం. పోరాట సంసిద్ధత క్షీణించినప్పుడు, విజయంపై విశ్వాసం సన్నగిల్లినప్పుడు నక్సలైట్లు లొంగిపోవడం కొత్త విషయం కాదు. గతంలోనూ లొంగుబాట్లు జరిగాయి. అయితే అవి నిశ్శబ్ద ఘటనలు. ముఖం చాటేసి, ప్రధాన స్రవంతి జీవితంలో కలిసిపోయే వ్యక్తిగత నిర్ణయాలు. ఇప్పుడు దృశ్యం భిన్నంగా ఉంది. సరళీకృత ఆర్థిక విధానాల కాలం ఇది. 

లొంగుబాటు ఇక ఏమాత్రం వ్యక్తిగత నిర్ణయం కాదు; అదొక ప్రజా ప్రదర్శన. తుపాకీని ప్రభుత్వానికి అప్పగించడం కూడా ఒక సిద్ధాంత విజయం అన్నట్టు ప్రచారం. ఒకప్పుడు ‘తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం’ అన్నవాళ్లు, ఇప్పుడు ‘తుపాకీ స్వాధీనం ద్వారానే శాంతి’ అంటున్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీతో సహా మరో నలుగురు కీలక నేతలు లొంగిపోవడం ఆ శ్రేణిలో తాజా పరిణామం. ఆ పార్టీ కేంద్ర కమిటీ పూర్వ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్‌ గణపతి సహా మరో 11 మంది ముఖ్య నాయకుల లొంగుబాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఇది యాదృచ్ఛికమా? లేక ఒక సంకేతమా? 

దేవ్‌ జీ (Devji) మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారనో, అవుతున్నారనో ఇటీవల వార్తలు వచ్చాయి. పీపుల్స్‌ వార్‌ గ్రూపు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన కేజీ సత్యమూర్తి 1990లో అజ్ఞాత జీవితం ముగించి బయటకు వచ్చారు. కానీ లొంగుబాటు కార్యక్రమం జరపలేదు. ఆ పార్టీ వ్యవస్థాపకులైన కొండపల్లి సీతారామయ్య 1995లో జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకూ లొంగుబాటు సంస్కారం అవసరం రాలేదు. కానీ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో ఉండగా లొంగిపోవడం – ఇది మొదటిసారి. కానీ అది గర్వించదగిన రికార్డా? లేక చరిత్రలో ఒక మలుపా? ఒకరు లొంగిపోతే యాదృచ్ఛికం. ఇద్దరు లొంగిపోతే వ్యక్తిగత వైఫల్యం. వరుసగా నాయకత్వం లొంగిపోతే అది ధోరణి. ధోరణిపై సైద్ధాంతిక చర్చ తప్పనిసరి. 

గణపతి అనారోగ్యంతో చాలాకాలం క్రితమే కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అసలు ప్రశ్న వ్యక్తుల గురించి కాదు, ఉద్యమం గురించి! ఈ ముగింపు సైనిక ఓటమా? లేక సైద్ధాంతిక వైఫల్యమా? నిజానికి 1990 వరకు భారత దేశంలో అనేక మార్పులకు కమ్యూనిస్టులు దోహదం చేశారు. అయితే 1990ల తర్వాత ప్రపంచం మారిపోయింది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలతో భారత సామాజిక–ఆర్థిక నిర్మాణం పూర్తిగా మారింది.  కానీ, పోరాట కార్యక్రమం మారిందా?  అర్ధ–వలస, అర్ధ–భూస్వామ్య వ్యవస్థ నిర్ధారణ, నాలుగు వైరుద్ధ్యాలు, వ్యావసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం– ఈ సిద్ధాంత భాష అంతా 1970లది. గట్టిగా మాట్లాడితే చైనాలో 1930ల నాటిది.  

2020ల నాటి భారతదేశానికి అది పనికి వస్తుందా?  ఇక్కడే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం సృజ నాత్మకతను కోల్పోయింది. పాత మ్యాప్‌తో కొత్త భూభాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది సైద్ధాంతిక వైఫల్యం. మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టి, బలగాలను ఒకే ప్రాంతంలో – దంతెవాడలో – మోహరించినప్పుడు, వ్యూహాత్మక చాతుర్యం అవసరం. కానీ అన్ని శక్తులనూ ఒకే ప్రదేశంలో దించి, చుట్టుముట్టే పరిస్థితిని తెచ్చుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ సైనిక పరాజయం తాత్కాలికం. సిద్ధాంత పరాజయం అంతకన్నా పెద్ద దెబ్బ. 

ఒక పార్టీ కథ ముగిసి పోవచ్చు. ఒక దశ చరిత్రలోకి వెళ్లిపోవచ్చు. కానీ ప్రజల మీద అణచివేత ముగిసిందా? అసమానత అంతరించిందా? అణచివేత ఉన్నంతకాలం పోరాటం అంతరించదు. కేవలం రూపం మారుతుంది. సిద్ధాంతం మారుతుంది. చరిత్ర ఖాళీని సహించదు. పాత సిద్ధాంతం విఫలమైతే ఆ స్థానంలో కొత్తది వస్తుంది. పాత పార్టీ ఆయుధాలను వదిలేసి లొంగిపోతే కొత్త పార్టీ వస్తుంది. పోరాడే సమూహాలు మారుతాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే; కొత్తగా వస్తున్న సిద్ధాంతం ఏమిటీ? కొత్తగా పోరాడే శక్తులు ఏవీ?


- డానీ 
వ్యాసకర్త సామాజిక–రాజకీయ విశ్లేషకులు

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)