Breaking News

నడచిన హిమాలయం... ఎగసిన ప్రజాకెరటం!

Published on Sat, 06/14/2025 - 03:33

కళ్లు ఆకారాన్ని చూస్తాయి. మనస్సు ఆంతర్యాన్ని చూస్తుంది. దాని పరిధి చాలా విశాలం. మనసుతో మను షుల్ని, సమాజాన్ని చూడగలిగినవాడు, చదవగలిగినవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే మాజీ ముఖ్య
మంత్రి డా‘‘ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి. నాకు అత్యంత సన్నిహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, మనిషి పట్ల మమ కారం, పేదరికాన్ని పారద్రోలాలన్న పట్టుదల, అణగారిన జనానికి అన్నీ సమకూర్చాలన్న కోరిక, సమసమాజ స్థాపన ఆయన లక్షణాలు, లక్ష్యాలు. శత్రువును కూడా క్షమించగలిగే సంస్కారం, పగవాడికైనా మేలు చేసే గుణం ఆయన సొంతం. హిమాలయ సమున్నతుడు కాబట్టే ప్రజలు ప్రేమగా ఆయ నను ‘రాజన్న’ అని పిలుచుకున్నారు. 

పాదయాత్ర:
2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన 1,648 కిలోమీటర్ల పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన వెంట నేను ఉండటం నా అదృష్టం. ఎంత జీవితాన్ని చూశానో, ఎన్ని నేర్చు కున్నానో అన్నిటికీ ‘సాక్షి’ ఆ పాదయాత్ర. 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది మహాయాత్ర. ఆ సభా వేదికకు పైన నీడగా షామియానా వేశారు. విపరీతంగా వచ్చిన జనం అందరూ ఎండలోనే ఉన్నారు. అది గమనించిన వైఎస్‌ ‘జనం ఎండలో ఉంటే నేను నీడలోఉండాలా’ అంటూ షామియానా తీయించారు. 

మండుటెండలోనే సాగింది ఆయన ప్రసంగం. అనంతరం తొలి అడుగు వేశారు ప్రజా ప్రస్థానానికి! కీపాస్‌ కట్టిన పంచ, తలపాగాలతో రైతులా కదిలారు. ఆయనను దగ్గరగా చూడా లని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని, గ్రామాలకు గ్రామాలు కదలి వచ్చాయి. చేవెళ్ల దాటి కౌకుంట్ల, మన్నెగూడ, శివారెడ్డిపేట... ఇలా అనేక గ్రామాల గుండా సాగుతోంది పాదయాత్ర. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చలించిపోతున్నారు. రాత్రి బస చేస్తున్న గ్రామాలలో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా, సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు వైఎస్‌. 

సదాశివ పేటకు చేరింది యాత్ర. అక్కడ ఎందరో కుండలు చేస్తున్నారు. వారిని చూపించాను ఆయనకు. ‘కరుణా! చూడాల్సింది వారు చేస్తున్న కుండల్ని కాదు, వారిగుండెల్ని’ అంటూ వారి దగ్గరికి వెళ్లారు. అంత దగ్గరగా ఆయనను చూసి చెమ్మగిల్లిన కళ్లతో వారు వారి బాధల్ని చెప్పుకున్నారు. ‘మంచిరోజులు వస్తున్నాయి’ అంటూ వారిని ఓదార్చారు. ప్రజలలో కనిపిస్తున్న పేదరికం, అనారోగ్యం, కరవు చూసి చలించిపోయిన ఆయనలో అప్పుడే ఉచితకరెంటు, ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎనిమిదవ రోజు సుల్తానాపూర్‌లో యాత్ర సాగుతోంది.

ఆ గ్రామంలో నర్సారెడ్డి అనే రైతు కుటుంబాన్ని అప్పు తీర్చ మని బ్యాంకు వారు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అప్పటికే నర్సారెడ్డి ఆత్మహత్య చేసు కున్నాడు. అయినా ఆ కుటుంబాన్ని బ్యాంకువాళ్లు వేధిస్తు న్నారు. అది విన్న వైఎస్‌ ముఖంలో బాధ, కోపం! వెంటనే బ్యాంకు వారిని పిలిపించి నిలదీశారు, హెచ్చరించారు.

బ్యాంకువారు భయపడి వెనక్కి తగ్గారు, ఆ కుటుంబం రక్షింప బడింది.పొతంశెట్టి పల్లెలో యాత్ర సాగుతోంది. ఓ యువ జంట వైఎస్‌ ఎదురుగా వచ్చి కాళ్ళమీద పడింది. తాము ప్రేమి కులమని, కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, చాలా దూరం నుంచి మిమ్మల్ని నమ్మి వచ్చామని వారు చెప్పుకొన్నారు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆయన అక్కడే అప్పుడే ఆ జంటకు వివాహం చేశారు, అక్షింతలు వేశారు. మరో నాయకుడైతే వారిని అక్కడే వదిలేసేవారు. 

కానీ వైఎస్‌ ముందుచూపుతో హైదరాబాదులోని ఓ పోలీసు ఉన్నతాధి కారికి ఫోన్‌ చేసి ఆ జంటకు రక్షణ కల్పించమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగే దారిలో నేను, మరికొందరు మిత్రులం వైఎస్‌ కన్నా కాస్త ముందుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళం. వైఎస్‌ రాక గురించీ, పాదయాత్ర గురించీ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మా ప్రయత్నం. బురుగిద్ద గ్రామం దాటి, గాంధీనగర్‌ చేరుకున్నాం. అప్పటికి రాత్రి ఏడు గంటలు అయి ఉంటుంది. హఠాత్తుగా వడగళ్ళ వాన, విపరీతమైన చలి! వర్షంలో తడుస్తామని ప్రక్కనే వున్న జీపు ఎక్కి కూర్చున్నా. 

దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. మా వెనుక దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న వైఎస్‌ ఆ చలిలో, వర్షంలో అలాగే తడుస్తూ వచ్చారు. అందుకే ధీరుడు, నాయకుడు అయ్యారాయన. నాయకపురం దాటి, లక్ష్మీపురం గ్రామంలో ప్రవేశించాం. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకే పార్టీ, ఇద్దరు నాయకులు! ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అది గమనించిన  వైఎస్సార్‌ ఇద్దర్నీ పిలిచి అక్కడే రాజీ చేశారు. 

పాదయాత్ర గోదావరి జిల్లాలలోకి ప్రవేశించింది. అక్కడ కూడా రైతు బతుకు దీనంగా ఉండటం, గ్రాసం లేక పశువు లను రైతులు సగం ధరకు అమ్ముకోవడం చూసి వైఎస్‌ చలించి పోయారు. సీతంపేట గ్రామంలో నాగపద్మిని అనే మహిళ వైఎస్‌ దగ్గరికి వచ్చింది. కుటుంబ నియంత్రణకు ఆపరేషన్‌ చేయించున్నాననీ, అధికారులు ఆ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారనీ చెప్పింది.  వెంటనే అధికారులను పిలిపించి అక్కడే సర్టిఫికెట్‌ ఇప్పించారు. 

ఆమె చేతిలో పదిహేను రోజుల పసికందు ఉంది. ఆ బిడ్డకు ‘రాజశేఖర్‌’ అని పేరు పెడతానంటే, ఆయన కాదని ‘రాజీవ్‌‘ అని నామకరణం చేశారు. రాజ మండ్రి సమీపం కోవూరుకు చేరుకున్నాం. జన ప్రవాహం మరింత ఎక్కువయింది. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు జనం చప్పట్లు ఆగలేదు. ఆ క్షణమే అర్థమ య్యింది రాష్ట్రానికి కాబోయే అధినాయకుడు ఎవరో!

2003 మే 18:
తెల్లారింది. కానీ నిప్పుల కొలిమిలో నిద్ర లేచినట్లు ఉంది. వైఎస్‌ నీరసంగా కనిపించారు. అయినా నడక సాగింది. కానీ నీరసం తెలుస్తోంది. ఓ చెట్టు క్రింద మంచం వేసి కాసేపు కూర్చోబెట్టాం. తరువాత మెల్లగా మధురపూడి గ్రామం చేరుకున్నాం. ఆయన పూర్తిగా నీరసించి పోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. ఆరు రోజుల విరామం తరువాత మే 24న తిరిగి నడక ప్రారంభించారు వైఎస్‌. యాత్ర పత్తిపాడు గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

జనప్రవాహం చెక్కు చెదరడం లేదు. జూన్‌ 11న జర్జంగి గ్రామం చేరుకున్నాం. అక్కడ రాళ్ళ క్వారీలలో వందలాది మంది వడ్డెరలు పని చేస్తున్నారు. వారంతా ఆయణ్ణి చూడటానికి వచ్చారు. తమ తలపాగాలను తీసి రోడ్డుమీద పరిచారు. దానిపై ఆయన్ని నడవమన్నారు. చూస్తున్న అందరి కళ్ళూ చెమరించాయి. శరీరాలు పులకరించాయి. అది కదా అభిమానం, అది కదా గౌరవం... అది కదా నిజమైన సన్మానం!  

జూన్‌ 15న ఇచ్ఛాపురం చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. పార్టీలోని అతిరథ మహారథులందరూ వేదికపైకి వచ్చారు. లక్షలాది మందిజనం. చప్పట్లకు దిక్కులు దద్దరిల్లాయి. ఆ మహా ప్రజా ప్రస్థానానికి చిహ్నంగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర పూర్తి అయింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు! చాలు జీవితానికి ఈ అనుభూతి. గుర్తు చేసుకుంటే శరీరం పులకరిస్తోంది. ఆయన జ్ఞాపకంతో కళ్లు చెమరిస్తు న్నాయి. రైతు బాంధవుడైన ఆ మహానేత అడుగులో అడుగు వేసి నడచిన నా జన్మ ధన్యం. చరిత్ర ఏనాడూ మరచిపోలేని సత్యం ఈ మహాయాత్ర!

-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్‌
-భూమనకరుణాకర రెడ్డి

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)