Breaking News

ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?

Published on Mon, 05/05/2025 - 10:54

ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ  కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ  ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురం


బొటన బావి 
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.

ఇదీ చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

గొల్లగుంట నుయ్యి  
కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.

కవలల బావి 
తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.

నిండు కుండలా.. 
సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.

బావి నీరు వల్లే కవలలు 
మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి,  దొడ్డిగుంట, రంగంపేట మండలం

కోరికలు తీర్చే బావిగా నానుడి 
మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి 
తులాభారాలు ఇస్తూంటారు.        – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలం

అపోహే.. 
ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు.  – డాక్టర్‌ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడ

చదవండి: Yoga: ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్‌ చేసే యోగాసనం ఏదో తెలుసా?

బావి నీటి వల్ల కాదు 
కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్‌ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)